అర్హులైన పేదలంటూ ఇళ్లు మంజూరు చేసిన అధికారులే వారిని అనర్హులుగా తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. కష్టపడి ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు...
- పూర్తయినవి తప్ప మిగిలిన ఇళ్లపై సమగ్ర సర్వే
- మంజూరు చేసిన అధికారులే అనర్హులుగా తేల్చే చర్యలు
- మండలాల ఏఈలకు టార్గెట్లు ఫిక్స్ చేసిన అధికారులు
బి.కొత్తకోట: అర్హులైన పేదలంటూ ఇళ్లు మంజూరు చేసిన అధికారులే వారిని అనర్హులుగా తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. కష్టపడి ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయని ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య ను తగ్గించే దిశగా మరోసారి సమగ్ర సర్వేకు ఆదేశించింది. మండల స్థాయి లో సర్వే పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఈఈ, డీఈఈ, ఏఈలకు ఆదేశాలందాయి. నాలుగు అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ అనధికారి కంగా ఇందిర ఆవాజ్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లపై నివేదికలు ఇవ్వాలని కోరారు. దీన్నిబట్టి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ పథకానికి నిధులు వచ్చే పరిస్థితి కనిపిం చడం లేదు.
ఆర్‌సీ తప్ప మిగిలినవన్నీ..
వైఎస్ హయాంలో జిల్లాలో ఇందిరమ్మ-1లో 1,00,803, ఇందిరమ్మ-2లో 1,26,933, ఇందిరమ్మ-3లో 95,737, 2004-05, 2005-06లో స్పిల్ ఓవర్‌కింద 7,632 గృహాలను మంజూరు చేశారు. మొత్తం 3,31,105 గృహాలు మంజూరయ్యా యి. ఆయన మరణానంతరం జీవో 171తో 19,999, జీవో 33తో 31,269, జీవో 44తో 10,528 ఇళ్లను మంజూరు చేశారు. వీటిలో గడిచిన మార్చి నాటికి అధికారిక లెక్కల ప్రకారం 2,95,134 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రస్తుతం పునాదుల స్థాయిలోని 31,900, గోడల స్థాయిలోని 2,830, రూఫ్ లెవల్లోని 13,170 ఇళ్లపై సర్వే చేయనున్నారు. గత నెలలో భూ మట్టానికి వేసిన పునాదులు, పునాదుల స్థాయిలో నిలిచిపోయిన ఇళ్లను మాత్రమే పరిశీలించాలని అధికారులు సూచించారు. వీటిలోనే 11,550 గృహాలను డిజైబుల్డ్‌లో ఉంచారు. ఇప్పటికే 15,600 గృహాల రద్దుకు అధికారుల వద్ద నివేదికలున్నాయి. ప్రస్తుత ఈ సంఖ్య మరింత పెరగనుంది.
ఐఏవైపై ప్రత్యేక నివేదిక..
ఇందిరమ్మ ఇళ్లపై సర్వే నిర్వహించే అధికారులు ఎస్‌సీ, ఎస్‌టీలకు చెందిన ఐఏవై పథకం కింద నిర్మించి న వాటిపైనా విచారించి లబ్ధిదారులను గుర్తించనున్నారు. జిల్లా వ్యాప్తం గా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, నిధుల కోసం కేంద్రానికి విన్నవించనున్నట్టు తెలుస్తోంది. ఆ నిధులతోనైనా ఐఏవై నిర్మాణాలు పూర్తి చేయిం చే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.