తుపాకీ మోతలతో దద్దరిల్లింది

Maoists And Police Firing in Visakhapatnam Agency - Sakshi

విశాఖ–తూర్పుగోదావరి సరిహద్దులో ఎదురు కాల్పులు

ఆంధ్రా గ్రేహౌండ్స్‌ బలగాలకు తారసపడ్డ మావోయిస్టులు

చీకటి పడడంతో పరార్‌.. ల్యాండ్‌మైన్స్‌ పెట్టినట్టు సమాచారం

మూడు 303 తుపాకులు, 14 కిట్‌ బ్యాగులు స్వాధీనం

ముమ్మరంగా కూంబింగ్‌

ఏ క్షణాన ఏం జరుగు తుందోనని ఆందోళనచెందుతున్న గిరిజనులు

సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ తూర్పు గోదావరి సరిహద్దు అటవీ ప్రాంతం పోలీసు బలగాలు, మావోయిస్టుల తుపాకీ మోతలతో  దద్దరిల్లింది.  ఒక్కసారిగా ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరగడంతో... కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం  ఉలిక్కిపడింది.  మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదరుకాల్పులు జరిగిన  ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. గిరిజన గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

ముందే అందిన సమాచారం
 గత కొద్ది రోజులుగా మావోయిస్టు అగ్రనేతలు కటాఫ్‌ ఏరియాని వదిలి గిరిజన గ్రామాలకు దగ్గరగా సంచరిస్తున్నారని సమాచారం ఉంది. అయితే వారిని పట్టుకునేందుకు సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి వందల మంది పోలీసులు విశాఖ ఏజెన్సీ ఆంధ్రా, ఒడిశా, తూర్పు గోదావరి సరిహద్దు ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తూ బలగాల జాడ కోసం అన్వేషిస్తున్నారు. ఈ తరుణంలో విశాఖ ఏజెన్సీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గుమ్మిరేవుల çసరిహద్దు తూర్పుగోదావరి ప్రాంతంలో మావోయిస్టు దళం సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి 7.45 గంటలకు  మావోయిస్టులు ఉన్న స్థావరానికి పోలీసు బలగాలు చేరుకున్నాయి.  గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.

ల్యాండ్‌మైన్‌ అమర్చిన మావోయిస్టులు ?
విశాఖ జిల్లా, తూర్పుగోదావరి సరిహద్దులో జరిగిన ఎదురు కాల్పుల సమయంలో మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కటాఫ్‌ ఏరియాని వదిలి గిరిజన గ్రామాలకు దగ్గరగా వచ్చి సంచరిస్తున్న సమయంలో ఏ క్షణంలోనైనా బలగాలు వస్తాయని ముందుగానే అప్రమత్తమైనట్టు సమాచారం. ఈ మేరకు తాము ఉన్న ప్రదేశంలో మావోయిస్టులు ల్యాండ్‌మైన్‌ను అమర్చినట్టు తెలిసింది. వాటిని కూంబింగ్‌కు వెళ్లిన బలగాలు కూడా గుర్తించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఆ ప్రాంతం నుంచి  మావోయిస్టులు  తప్పించుకున్నారు.  తప్పించుకున్న వారిలో అగ్రనేతలు నవీన్, చలపతి ఉన్నట్టు  సమాచారం.

కొనసాగుతున్న కూంబింగ్‌
 ఎదురుకాల్పుల అనంతరం కూంబింగ్‌ మరింత ఉధృతం చేశారు. ఇప్పటికే ఎనిమిది గ్రేహౌండ్స్‌ బలగాలు ముమ్మర కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలైన నవీన్, చలపతి మరికొంత మంది అగ్రనేతలు ఉన్నట్టు జిల్లా పోలీసులకు సమాచారం ఉంది. ఇటీవలే పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు తెలియజేశారు. అప్పటి నుంచి ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.   తాజాగా జరిగిన ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న దళ సభ్యుల కోసం మరికొంతమంది బలగాలను పంపించినట్టు సమాచారం. ఎదురు కాల్పులు జరిగిన విషయాన్ని ఒడిశా పోలీసులకు కూడా తెలియజేశారు.  

ఎన్‌కౌంటర్‌ ఇలా...
విశాఖ ఏజెన్సీ గుమ్మిరేవుల పంచాయతీ సరిహద్దు తూర్పుగోదావరి జిల్లా చప్పకొండ, బురదమామిడి ఆంధ్రాకు 3 కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళం ఉందని విశాఖ గ్రేహౌండ్స్‌ బలగాలకు పక్కా çసమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టి మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి కాల్పులు జరిపాయి. దీంతో మావోయిస్టులు కూడా కాల్పులు జరిపారు.   అయితే అప్పటికే చీకటి పడిపోవడంతో  మావోయిస్టులు  సంఘటన స్థలం నుంచి జారుకున్నారు.  మావోయిస్టుల దళం అక్కడ ఉందని, అందులో అగ్రనేతలు కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల అనంతరం బుధవారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్‌ బలగాలు సంఘటన స్థలానికి వెళ్లి, అక్కడ లభించిన 303 తుపాకీలు, 14 కిట్‌ బ్యాగులు, విప్లవ గీతాల పుస్తకాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top