
రాఘవయ్య మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న పర్యావరణ పరిరక్షణసంఘం నాయకులు(ఇన్‌సెట్) రాఘవయ్య
సోంపేట/కంచిలి: పర్యావరణ పరిరక్షణ సంఘం ఉపాధ్యక్షుడు, కంచిలి మండలం మండపల్లి గ్రామానికి చెందిన మాదిన రాఘవయ్య (76) కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం తెల్లవారుజామున తనువుచాలించారు. ఈ విషయం తెలిసి థర్మల్ వ్యతిరేక ఉద్యమకారులు, ప్రజలు విషాదానికి గురయ్యారు. మంగళవారం సాయంత్రం పొలాలు, తోటలు చూసుకొని ఇంటికి వచ్చిన ఆయన ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
రాఘవయ్య మృతి సమాచారం తెలుసుకున్న వెంటనే పర్యావరణ పరిరక్షణ సంఘ ప్రతినిధులు, మత్స్యకారులు, స్థానిక ప్రజలు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. రాఘవయ్య పెద్దకుమారుడు సింగపూర్‌లో ఉన్నారు. అతను వచ్చిన తరువాత రాఘవయ్య అంత్యక్రియలు నిర్వహిస్తారు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె, ఉన్నారు.
కుటుంబానికి పెద్ద దిక్కు..
రాఘవయ్య వ్యవసాయం చేసుకుంటూ ఈ ప్రాంతంలో పెద్దమనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతని కుటుంబా నికి అండగా ఉండేవారు. వీరిది ఉమ్మది కుటుంబం. సుమారు 50 మంది కుటుంబ సభ్యులున్నారు.
ఉద్యమంలో కీలపాత్ర
థర్మల్ విద్యుత్ కర్మాగారం నిర్మిస్తే సమస్యలు తప్పవని ఈ ప్రాంతీయులు ఆందోళన చెందారు. దీంతో థర్మల్ వ్యతిరేక ఉద్యమం చేయాలని నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఎనిమిది మంది కమిటీలో రాఘవయ్య ఒకరు. ఉద్యమంలో ఈయనే కీలక పాత్ర పోషించారు. సుమారు 50కు పైగా కేసులను ఎదుర్కొన్నారు. తన పొలం పనులు చూసుకుంటూ క్రమం తప్పకుండా కోర్టుకు హాజరై థర్మల్ వ్యతిరేక ఉద్యమం పట్ల తన చిత్తశుద్ధిని చూపించుకున్నారు. మానవహక్కులు, పర్యావరణ పరిరక్షణ సంఘం వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. పదిరోజుల క్రితం విజయవాడలో జరిగిన పర్యావరణ పరిరక్షణ సంఘం సమావేశంలో పర్యావరణ పరిరక్షణసంఘం కార్యదర్శి బీన ఢిల్లీరావుతో కలసి పాల్గొన్నారు.
పలువురు సంతాపం
రాఘవయ్య మృతికి ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్.దాసు, పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కృష్ణమూర్తి, బీన ఢిల్లీరావు, జెడ్పీటీసీ సభ్యులు ఎస్.చంద్రమోహన్, నాయకులు ఎస్.శ్రీరామమూర్తి, బి.తారకేశ్వరరావు, ఎం.బుద్దేశ్వరరావు, మానవహక్కులవేదిక నాయకుడు జగన్నాథం, పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు సంతాపం తెలియజేశారు.