జానపాడుకు చేరిన నరసింహారావు 

Malaysia Victim Narasimha Rao Reached Guntur District Janapadu - Sakshi

మలేషియా బాధితుడి కథ సుఖాంతం

ఎమ్మెల్యే, ఎంపీ చొరవతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు  

సాక్షి, పిడుగురాళ్ల/గురజాల: తండ్రి కష్టాలు చూసి తట్టుకోలేక కుటుంబాన్ని అప్పుల బాధ నుంచి విడిపించాలనే తపనతో మలేషియా వెళ్లి చిన్నతనంలోనే నరకం చూసిన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన బత్తుల నరసింహారావు కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. మలేషియా నుంచి తెలుగు అసోసియేషన్‌ సభ్యులు టిక్కెట్‌ బుక్‌ చేయడంతో నరసింహారావు గురువారం  జానపాడులోని తన స్వగృహానికి క్షేమంగా చేరుకున్నాడు. ఐదు నెలల కిందట నరసింహారావు తన స్నేహితుడు సైదారావు, భీమవరానికి చెందిన ఏజెంట్‌ అయ్యప్పకు మలేషియా వెళ్లేందుకు రూ.లక్ష అప్పు చేసి ఇచ్చాడు. ఆ ఏజెంటు వర్కింగ్‌ వీసా బదులు విజిటింగ్‌ వీసాపై నరసింహారావును మలేషియాకు పంపించాడు.

మలేషియాలో ఓ కొరియర్‌ కంపెనీలో పనిచేస్తున్న అతన్ని పోలీసులు విజిటింగ్‌ వీసాపై వచ్చినట్లు గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపించారు. మలేషియాలో తను పడుతున్న బాధలను నరసింహారావు తండ్రికి ఉత్తరం ద్వారా తెలిపాడు. కొడుకును జైల్లో వేశారని, చిత్ర హింసలు పెడుతున్నారని నరసింహరావు తండ్రి బత్తుల గురూజీకి తెలిసి తల్లడిల్లాడు. ‘నేను చ‍చ్చి పోతున్నా. ఇక బతకను’ అంటూ కొడుకు రాసిన లేఖను మీడియా దృష్టికి తీసుకెళ్లడంతో పాటు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి తెలిపాడు.

స్పందించిన ఎమ్మెల్యే మలేషియాలో తెలుగు అసోసియేషన్‌ సభ్యులతో మాట్లాడారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదించి నరసింహరావు ఇండియా వచ్చేందుకు కృషి చేశారు. వారందరి కృషితో గురువారానికి స్వగ్రామమైన జానపాడుకు వచ్చాడు. తల్లిదండ్రులు గురూజీ, పద్మ కుమారుడిని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. పోలీసులు తనను అరెస్టు చేశాక నరకం చూపించారని, జ్వరంతో బాధపడుతున్నా కనీసం ఒక్క మాత్ర కూడా ఇవ్వలేదని నరసింహారావు వాపోయాడు. తన తండ్రి ,అధికారుల చేసిన ప్రయత్నాల వల్లే స్వదేశం చేరుకోగలిగానని హర్షం వ్యక్తం చేశాడు. 

మొదలైన మరో మలేషియా బాధితుడి కథ 
బత్తుల నరసింహారావు మలేషియా పోలీసుల నుంచి విడుదలై ఇండియాకు వస్తుండటంతో.. పోలీసులకు చిక్కిన మరో మలేషియా బాధితుడు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన లావేటి రమేష్‌ తనకు టిక్కెట్‌ వేయమని తల్లిదండ్రులకు లెటర్‌ ఇచ్చి పంపించాడు. రమేష్‌ గత ఏడు నెలల నుంచి మలేషియా జైల్లో మగ్గుతున్నాడు. ఒక బాధితుడి కథ సుఖాంతమయ్యే సరికి మరో బాధితుడి కథ వెలుగు చూసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top