గగనం.. దూరం

Lockdown Effect on ISRO Experiments SPSR Nellore - Sakshi

లాక్‌డౌన్‌తో ఆగిన ప్రయోగాలు

రాకెట్ల తయారీ ఆలస్యం

ప్రయోగశాలలకే పరిమితం

కరోనా వైరస్‌ ప్రభావం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై పడింది. కోవిడ్‌–19 ప్రబలకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది. దీంతో ఇస్రోలో కార్యకలాపాలు స్తంభించాయి. ఇక ప్రయోగాలకు కేంద్రమైన సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఈ ఏడాది ప్రయోగాలన్నీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ ప్రయోగాలు చేపట్టి గగన్‌యాన్‌కు సిద్ధం కావాలన్న కార్యాచరణ మరింత ఆలస్యం కానుంది.

నెల్లూరు, సూళ్లూరుపేట:  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది సుమారు 12 ప్రయోగాలు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఏడాది మొదట్లోనే అంటే జనవరి 17న ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్‌–30 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్చి 5న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–2 రాకెట్‌ ద్వారా జీఐశాట్‌–1 అనే సరికొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. అన్ని దశల్లో పనులు పూర్తి చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రయోగం నిరవధికంగా వాయిదా పడింది. ఫలితంగా ఆ రాకెట్‌ను ప్రయోగవేదిక నుంచి వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లి ఉపగ్రహం అమర్చిన పార్టు వరకు విడదీసి క్లీన్‌రూంకు తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రయోగంతో పాటు ఈ ఏడాది ప్రథమార్థంలోనే అంటే మార్చి నెలాఖరులోపే రెండు పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలకు కూడా చేయాల్సి ఉంది. మొదటి ప్రయోగ వేదికకు సంబంధించిన మొబైల్‌ సర్వీస్‌ టవర్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ–49 రాకెట్‌కు సంబంధించి నాలుగు దశల రాకెట్‌ పనులు పూర్తయ్యాయి. అయితే కరోనా లాక్‌డౌన్‌ దెబ్బకు పనులు నిలిచిపోయాయి.

ఎస్‌ఎస్‌ఏబీ బిల్డింగ్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ–50 రాకెట్‌ను కూడా మూడు దశలు అనుసంధానం చేశారు. ఈ రాకెట్‌ ప్రయోగాలు సైతం ఆగిపోవడంతో వాటికి కాపలా కాసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గత నెల 20న నుంచి షార్‌ కేంద్రానికి కొంత మంది అధికారులు మాత్రమే  విధులకు హాజరవుతున్నారు. ప్రయోగాల జోలికి పోకుండా ప్రయోగ వేదికలపై ఉన్న రాకెట్‌లను కాపాడుకునే పనిలో ఉన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం లేకుండా అంతా బాగుండి ఉంటే ఈ ఏడాది సుమారు 8 పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లు, రెండు జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లు, ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాలతో పాటు చంద్రయాన్‌–2, గగన్‌యాన్‌ ప్రయోగాలకు ఈ పాటికే బీజం పడి ఉండేది. లాక్‌డౌన్‌ ఎత్తేసినా ఈ ఏడాది రెండు మూడు ప్రయోగాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందేమోనని షార్‌ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. దేశంలోని ఇస్రో కేంద్రాలన్నింటిలో ప్ర«ధానంగా కేరళ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకలో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి.  పరిస్థితులంతా సర్దుబాటు అయితే తప్ప ప్రయోగాలకు జోలికి పోయే పరిస్థితి కనుచూపు మేరలో కూడా కానరావడం లేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top