అఖిలపక్షంలో నాడు ఎవరేమన్నారంటే..? | leaders past comments in all party meet on bifurcation | Sakshi
Sakshi News home page

అఖిలపక్షంలో నాడు ఎవరేమన్నారంటే..?

Sep 29 2013 2:15 AM | Updated on Sep 1 2017 11:08 PM

తెలంగాణ అంశంపై కిందటేడాది డిసెంబర్‌ 28న కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

తెలంగాణ అంశంపై కిందటేడాది డిసెంబర్‌ 28న కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు రాష్ట్రంలోని ఎనిమిది పార్టీల నుంచి ఇద్దరేసి ప్రతినిధుల చొప్పున పాల్గొన్నారు. ఈ భేటీలో అధికార కాంగ్రెస్‌ రెండు వాదనలు వినిపించింది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ అనుకూలంగా వ్యవహరించిందని కేఆర్‌ సురేశ్‌రెడ్డి చెప్పగా.. విభజనకు అనుకూలమని కాంగ్రెస్‌ ఏనాడూ చెప్పలేదని గాదె వెంకట్‌రెడ్డి చెప్పారు. అయితే సురేశ్‌రెడ్డి వాదననే కాంగ్రెస్‌ నిర్ణయంగా కేంద్రానికి నివేదిస్తానని షిండే స్పష్టంచేశారు.

ఆయా పార్టీలు సమావేశంలో ఏమన్నాయంటే..

కాంగ్రెస్‌: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది(సురేశ్‌రెడ్డి). నేను సమైక్యవాదిని. విభజనకు అనుకూలమని కాంగ్రెస్‌ ఏనాడూ చెప్పలేదు(గాదె)

టీడీపీ..: 2008లో ప్రణబ్‌ కమిటీకి ఇచ్చిన లేఖలోనే తెలంగాణపై మా అభిప్రాయం చెప్పాం. ఇప్పుడు కూడా మా అభిప్రాయాన్ని సీల్‌‌డ కవర్‌లో ఇస్తున్నాం.

టీఆర్‌ఎస్‌..: వీలైంనంత త్వరగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. కాలయాపన చేయకుండా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఎంతకాలం నాన్చుతారు? తెలంగాణ ఇస్తరా, ఇవ్వరా? తేల్చిచెప్పండి.
వైఎస్సార్‌సీపీ..: ఆర్టికల్‌-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా కేంద్రానివే సర్వాధికారాలు.. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా.. ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలి.

సీపీఎం..: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి. దీనిపై ముందు కాంగ్రెస్‌ వైఖరి తెలియజేయాలి.
సీపీఐ..: విశాలాంధ్ర కోసం గతంలో పోరాడాం.. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం.

మజ్లిస్‌..: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి. విభజించాల్సి వస్తే రాయలసీమ, తెలంగాణ కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలి.

కేంద్రం: తెలంగాణపై ఇదే ఆఖరు సమావేశం. కొందరికి బాధ కలుగుతుందని మౌనంగా ఉండం. గరిష్టంగా నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటాం.

నిజాయతీ నిరూపించుకున్నామన్న బాబు..

ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగిన రోజున.. ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో మాట్లాడారు. అఖిలపక్ష భేటీలో తమ వైఖరిని స్పష్టంగా చెప్పామని, టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. ‘‘తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని మొదట్నుంచీ చెబుతున్నా.. మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నింది. 2008లో టీడీపీ తీసుకున్న నిర్ణయం కేంద్రం వద్దే లేఖలో ఉంది. ప్రణబ్‌ కమిటీకి ఇచ్చిన ఆ లేఖను వాపసు తీసుకోలేదు. ఆ లేఖ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అఖిలపంలో చెప్పాం’’ అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement