ఎట్టకేలకు కృష్ణపట్టణం–ఓబులవారిపల్లె రైలు కూత

The Largest Tunnel in South India kadapa - Sakshi

సాక్షి, కడప : కృష్ణపట్టణం–ఓబులవారిపల్లె రైలు మార్గంలో రైలుకూత వినిపిస్తుందని దశాబ్దకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు  పూర్తిస్థాయిలో కృష్ణపట్టణం నుంచి ఓబులవారిపల్లె మీదుగా సరుకు రవాణా చేసే గూడ్స్‌ రైళ్లను అధికారులు నడుపనున్నారు. కృష్ణపట్టణం పోర్టు నుంచి ఓబులవారిపల్లెకు దాదాపు 113 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలో విద్యుత్‌ రైల్‌ ఇంజిన్ల ద్వారా గూడ్సులను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు రూ.2వేల కోట్లు వ్యయంతో పనులు పూర్తి చేశారు. రైలు మార్గం 2005–06లో మంజూరైంది. ఈనెల 15న రైల్వే అధికారులు ఆర్‌వీఎన్‌ఎల్‌ అధికారులు కలిసి పూర్తిస్థాయి గూడ్స్‌ ఇంజిన్‌తో ట్రైయల్‌రన్‌గా రైలును నడిపించారు.

ఈ మార్గంలో కిలోమీటర్‌ రెండవ టన్నెల్‌ ఇదివరకే పూర్తయింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గం ఈ దారిలో ఉంది. పూర్తిస్థాయి ఆస్ట్రేలియన్‌ టెక్నాలజీతో సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు. ఈ మార్గం కృష్ణపట్టణం పోర్టు నుంచి సరుకు రవాణా చేసేందుకు నిర్మించామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో పూర్తిస్థాయిలో రైల్వేస్టేషన్ల నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఇప్పట్లో ఈ మార్గంలో ప్యాసింజర్‌ రైలు నడిపేందుకు వీలుపడదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

ఏదేమైనా దశాబ్దాలుగా కడప జిల్లా నుంచి కోస్తాకు, రాష్ట్ర రాజధాని విజయవాడకు నేరుగా రైలుమార్గం ఏర్పాటు చేసి ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 20నుంచి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌లతో గూడ్సు రైలును ప్రారంభిస్తామని రైల్వే అధికారులు ప్రకటించినా,  అనివార్య కారణాలతో నడపలేదు. ట్రక్‌ టన్నెల్‌ వద్ద చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించి గూడ్సు రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. 

నేడు దక్షిణ మధ్య రైల్వే జీఎం పరిశీలన
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన మాల్య, డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ విజయప్రతాప్‌సింగ్‌ శుక్రవారం ఓబులవారిపల్లె–కృష్ణపట్టణం రైలు మార్గాన్ని పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలులో నందలూరుకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక రైలులో మార్గంలోని ట్రాక్‌ నాణ్యత, టన్నెల్‌ పనులను పరిశీలించనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top