భూములు ఇవ్వాల్సిందే | Land must give | Sakshi
Sakshi News home page

భూములు ఇవ్వాల్సిందే

Aug 1 2015 11:29 PM | Updated on Sep 22 2018 8:07 PM

భూములు ఇవ్వాల్సిందే - Sakshi

భూములు ఇవ్వాల్సిందే

కార్పొరేట్‌సంస్థలకు అనుకూలంగా భూసేకరణకు ప్రభుత్వం దశలవారీగా చక్కబెట్టుకురావాలని ప్రభుత్వం పన్నాగం పన్నింది...

విభజించు... పాలించు... నాడు భారతదేశాన్ని ఆక్రమించడానికి బ్రిటిష్ పాలకులు అనుసరించిన కుయుక్తి ఇది. నేడు కార్పొరేట్ పెద్దలకు భూముల పందేరానికి టీడీపీ అనుసరిస్తున్న పన్నాగం కూడా ఇదే. జిల్లాలో పీసీపీఐఆర్ ప్రాజెక్టుక భారీ భూసేకరణను రైతులు, ప్రజాసంఘాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భూసేకరణ చేయొద్దని న్యాయస్థానం స్టే ఇచ్చింది. కానీ కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలకే కట్టుబడ్డ ప్రభుత్వం వ్యూహం మార్చింది. సామదానోపాయాలు ఫలించకపోవడంతో బేధ,దండోపాయాలకు తెరతీసింది. అధికారులను గ్రామాల్లోకి పంపించి ఆమోదించాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తోంది.  ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్యే స్వయంగా రంగంలోకి దిగి మరీ భూసేకరణకు రైతులపై ఒత్తిడి తీసుకురావడం ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది.
- రైతులపై ప్రభుత్వం ఒత్తిడి
- న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ మరీ
- పీసీపీఐఆర్ ప్రాజెక్టుకు భూసేకరణకు వ్యూహం

కార్పొరేట్‌సంస్థలకు అనుకూలంగా భూసేకరణకు ప్రభుత్వం దశలవారీగా చక్కబెట్టుకురావాలని ప్రభుత్వం పన్నాగం పన్నింది. నక్కపల్లి మండలంలోని చందనాడ, వేంపాడు, రాజ య్యపేట, డీఎల్‌పురం, అమలాపురం, నేలపూ డి, ఎన్.నరసాపురం, గునుపూడి, బంగారయ్యపేట గ్రామాల పరిధిలో దాదాపు 7వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణను వ్యతిరేకించిన రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దాంతో రైతులను విభజించి వారిని భూసేకరణకు ఒప్పించేందుకు ప్రభుత్వం వ్యూహం పన్నింది.  

ఇందుకోసం ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్యే రంగంలోకి దిగడం గమనార్హం. మొదటి విడతగా చందనవాడ, వేంపాడు, రాజయ్యపేట, డీఎల్‌పురం గ్రామాలపై గురిపెట్టింది. ఆ గ్రామాల పరిధిలోని 4,500 సేకరణకు రైతులను ఒప్పించేందుకు అధికారులు కొన్ని రోజులుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య కూడా ఆ గ్రామాల్లో పర్యటించారు.  గ్రామాలవారీగా సమావేశాలు పెట్టి భూసేకరణకు అంగీకరించాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. కార్పోరేట్‌సంస్థల నుంచే నేరుగా పరిహారం అందిస్తామని కూడా చెబుతున్నారు. భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. ఇటీవల వేంపాడులో నిర్వహించిన సమావేశంలో రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. చందనాడ, డీఎల్‌పురం రైతులు కూడా  ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు.
 
న్యాయస్థానం ఉత్తర్వులకు విరుద్ధంగా...
స్టే ఉత్తర్వులు అమలులో ఉండటం అధికారులు భూసేకరణకు అనుకూలంగా గ్రామాల్లో పర్యటిస్తుండటం గమనార్హం. ఈ అంశాని న్యాయస్థానంలో పరిష్కరించుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అధికారులను గ్రామాల్లోకి పంపించి భూసేకరణకు అనుకూలంగా పనులు చక్కబెడుతోంది. న్యాయస్థానంలో వేసిన కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా అధికారులు రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అందుకోసం రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారు.

ప్రభుత్వ యత్నాలపై రైతులు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయస్థానం ఉత్తర్వులు అమలులో ఉండగా గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నారు?... సమావేశాలు ఎలా నిర్వహిస్తున్నారు అని ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్నే నిలదీశారు కూడా. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తామని కూడా చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అధికారులను గ్రామాల్లోకి వెళ్లి ఎలాగైనా రైతులను ఒప్పించాలని ఒత్తిడి తెస్తోంది. అధికారులు గ్రామాల్లోకి వస్తుండటం... రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో నక్కపల్లి మండలంలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement