రాజధాని గ్రామాల్లో భూ సమీకరణపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. భూ సమీకరణ వల్ల లాభాలను రైతుకు...
భూ సమీకరణ లక్ష్యం నెరవేరేనా ?
►భూ సమీకరణపై విస్తృత ప్రచారం
►వ్యాపారులను మించిపోతున్న ప్రభుత్వం
►ద్వంద్వ విధానాలపై రైతుల్లో నిరసన
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని గ్రామాల్లో భూ సమీకరణపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. భూ సమీకరణ వల్ల లాభాలను రైతుకు వివరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. భూ సమీకరణకు ఈ నెలాఖరు వరకు గడువు పొడగించామని, గతంలో అభ్యంతర పత్రాలు(9.2) ఇచ్చిన రైతులు కూడా ఇప్పుడు అంగీకారపత్రాలు(9.3) ఇవ్వవచ్చని, భూ సేకరణ విధానం కంటే భూ సమీకరణలోనే రైతులకు అనేక ప్రయోజనాలు ఉంటాయంటూ.. మైకుల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు.
పెద్ద సంఖ్యలో ఆటోలను వినియోగిస్తూ అందులో రికార్డు చేసిన క్యాసెట్లకు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కొత్త సినిమాలు, ఎగ్జిబిషన్లు, కొత్త దుకాణాల ప్రారంభాల సమయంలో నగరాల్లోని వ్యాపారులు సమీపంలోని గ్రామీణ ప్రాంతాలోల ఈ తరహా ప్రచారాన్ని గతంలో నిర్వహించేవారు. వీరికి ధీటుగా అధికారులు కూడా భూ సమీకరణ వలన కలిగే లాభాలను ప్రచారం చేస్తున్నారు. అంగీకారపత్రాలు ఇచ్చిన రైతులకు వెంటనే కౌలు చెక్కుల పంపిణీ, రుణమాఫీ వంటి సౌకర్యాలను సత్వరం అందచేయడం జరుగుతుందని, సలహాలు, సందేహాలకు సీఆర్‌డీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రచారంలో పేర్కొంటున్నారు.
భూ సేకరణను బూచిగా చూపి..
రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల నుంచి భూ సేకరణ ద్వారా భూములు తీసుకుంటామని ఈ నెల 14 న ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 33,400 ఎకరాలను భూ సమీకరణ విధానంలో సేకరించామని, అదనంగా భూములు కావాలని పట్టణాభివృద్ధి సంస్థ రెవెన్యూశాఖను కోరడంతో భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానికి అవసరమైన భూమిని సేకరించేందుకు జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం సర్వాధికారాలు ఇచ్చింది.
అయితే భూ సేకరణ విధానాన్ని ప్రారంభించనున్నామని రైతుల్ని భయపెట్టిన ప్రభుత్వం ఆ విధానంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా భూ సమీకరణ విధానానికి గడువు పొడగించడంతోపాటు దాని వలన కలిగే లాభాలకు విస్త్రత ప్రచారం కలిగించడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భూ సేకరణ బూచితో రైతుల్ని భయపట్టిన ప్రభుత్వం భూ సమీకరణపై ప్రచారం చేస్తూ ద్వంద్వ విధానాలు అనుసరిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.