మండల పరిధిలోని నాగులదిన్నె గ్రామంలో ఎంపీ బుట్టా రేణుక గురువారం రాత్రి బస నిర్వహించారు. ఈ గ్రామాన్ని ఆమె దత్తత తీసుకున్నారు.
నాగులదిన్నె (నందవరం) : మండల పరిధిలోని నాగులదిన్నె గ్రామంలో ఎంపీ బుట్టా రేణుక గురువారం రాత్రి బస నిర్వహించారు. ఈ గ్రామాన్ని ఆమె దత్తత తీసుకున్నారు. గురువారం రాత్రి స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని, మూడు నెలల్లో గ్రామంలో రూపురేఖలు మారుతాయని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామాభివృద్ధి కోసం కోటి రూపాయల నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పేదలందరికీ ఇళ్లు, చేనేత కార్మికుల కోసం షెడ్లు నిర్మిస్తామన్నారు.
మరుగుదొడ్డి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 12వేలు నిదులు మంజూరు చేస్తోందన్నారు. గ్రామానికి జూనియర్ కళాశాల మంజూరైందని, ఈ ఏడాది నుంచి ఇక్కడే ప్రారంభం అవుతుందన్నారు. ప్రజలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడం కోసం రూ. 10 లక్షలతో రెండు ఆర్వో ప్లాంటు నిర్మాణాలు మంజూరైనట్లు చెప్పారు. అనంతరం స్థానికులతో కలిసి ఎంపి సహపంక్తి భోజ నం చేశారు. ఆ తర్వాత ఆమె అక్కడనే బసచేశారు.
సమావేశంలో సర్పంచ్ ప్రభాకర్, తహశీల్దార్ రవికుమార్, ఇన్‌చార్జి ఎంపీడీవో రమణమూర్తి, ఈవోపీఆర్‌డీ ఎలీష, ఎస్‌ఐ వేణుగోపాలరాజు, ఎంపీ పీఏలు శ్రీనివాసరావు, శివశంకర్, కార్యదర్శి అయ్యపురెడ్డి, నక్కలమిట్ట శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మద్దయ్య, బాస్కర్‌రెడ్డి, స్థానిక పెద్దలు సంగాల సత్యన్న, రంగయ్యశెట్టి, రమేష్, సుదీర్‌బాబు పాల్గొన్నారు.