మన ఊపిరి.. ప్రత్యేక హోదా

Krishna: Special Story On Special Category Status - Sakshi

ప్రత్యేక హోదాగ్నిని రగిలించిన వైఎస్సార్‌సీపీ

2015లో జగన్‌ ఆమరణ దీక్షకు మద్దగా నిలిచిన కృష్ణాజిల్లా

సాక్షి, విజయవాడ : ‘అధికారంలోకి రాగానే ఐదేళ్లు, పదేళ్లు కాదు...15  ఏళ్లు ప్రత్యేకహోదా ఇస్తాం..’ ఇదీ గత ఎన్నికల వేళ టీడీపీ, బీజేపీ కలిసి ఇచ్చిన హామీ. ఆ తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి చేయకుండా, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని రాష్ట్రంలోని యువతకు తీరని ద్రోహం చేసింది. పరిశ్రమలు లేక, ఉన్నత చదువులు చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. దీంతో ఎంతో విలువైన యువశక్తి వృథా అవుతోంది. ప్రత్యేకహోదా కోసం గత నాలుగేళ్లుగా అనేక పోరాటాలు, ఉద్యమాలు, యువభేరి కార్యక్రమాలు, ధర్నాలు, ఆందోళనలు, రిలేదీక్షలు, ఆమరణ దీక్షలు ఇలా అనేక రూపాలలో  పోరాటం చేసి చివరకు ప్రత్యేకహోదా కన్నా ప్యాకేజీనే మిన్న అని చెప్పిన చంద్రబాబు చేత కూడా ప్రత్యేకహోదా కావాలని చెప్పించిన నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీకే మద్దతు తెలుపుతానని జగన్‌ జాతీయ పార్టీలకు స్పష్టం చేయడాన్ని బట్టే రాష్ట్రాభివృద్ధి పట్ల, యువత పట్ల ఆయనకు ఎంత నిబద్ధత ఉందో అర్ధమవుతోంది.

రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలంటూ వైఎస్సార్‌ సీపీ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో మహోద్యమాన్ని నడిపింది. ఈ ఉద్యమాలకు కృష్ణాజిల్లా కూడా వేదికైంది. ధర్నాలు, రాస్తారాకోలు, రైల్‌రోకోలు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, కలెక్టరేట్‌ ముట్టడి  వంటి విభిన్న మార్గాల్లో గత ఐదేళ్లుగా నిరసనలు తెలియచేస్తోంది. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని కాదని, హోదా గురించి ఉద్యమాలు చేస్తే అరెస్టులు చేయిస్తామని చంద్రబాబు బెదిరించినా ఏ మాత్రం బెదరకుండా  ఉద్యమాన్ని జిల్లా వాసులు నడిపారు. 
దేశంలో 29 రాష్ట్రాల్లో ఇప్పటికీ 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కలిగి ఉన్నాయి. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే 12వ రాష్ట్రమయ్యేది. మరో ఐదు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తున్నాయి.  విభజన చట్టంలో ఇచ్చిన హామీతో పాటు నాటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌  హామీ ప్రకారం మార్చి 2,2014 పార్లమెంట్‌ చట్టం చేసింది.  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉద్యమాన్ని  ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పార్టీలు చేపట్టినా ఐదేళ్లు దీన్ని సజీవంగా నిలబెట్టింది మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే.

హోదా.. లాభాలు 
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర నిధులు 90 శాతం గ్రాంటుగానూ, 10 శాతం అప్పుగానూ ఇస్తుంది. గ్రాంటుగా వచ్చే సొమ్ము తిరిగి చెల్లించనవసరం లేదు. పరిశ్రమలకు భారీగా రాయితీలు వస్తాయి. 
ఎక్సైజ్‌ డ్యూటీ, ఇన్‌కం ట్యాక్స్‌ 100 శాతం పన్ను రాయితీ వస్తుంది. ప్రైట్‌ రీయింబర్స్‌ మెంట్‌ దక్కితే పరిశ్రమలు వస్తాయి. మనం కొనుగోలు చేసే అనేక వస్తువులు సగం ధరకే వస్తాయి. కరెంటు చార్జీలు భారీగా తగ్గుతాయి.

కృష్ణాజిల్లాలో పారిశ్రామికవేత్తలకు కొదవలేదు. ఈప్రాంతానికి చెందిన లగడపాటి రాజగోపాల్, కావూరు సాంబశివరావు తదితర పారిశ్రామికవేత్తలు కృష్ణాజల్లా కంటే ఇతర రాష్ట్రాల్లోనే పెద్దపెద్ద పరిశ్రమలు స్థాపించారు. వ్యవసాయరంగంలో అభివృద్ధి చెందిన కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకు చెప్పుకోదగిన పరిశ్రమ ఒక్కటీ లేదు. గత ఐదేళ్లలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలు వస్తున్నాయని హడావుడి చేయడమే తప్ప ఒక చెప్పుకోదగిన పరిశ్రమ రప్పించడం కాని ప్రారంభించడం కాని లేనేలేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పారిశ్రామికవేత్తలు ఇక్కడికే వలస వచ్చేవారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల 2వేల పరిశ్రమలు వచ్చాయి. వెనుకబడిన రాష్ట్రంలోనే అన్ని పరిశ్రమలు వస్తే.. బందరు వంటి ఓడరేవు ఉండి పరిశ్రమలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్న కృష్ణాజిల్లాకు ఈ ఐదేళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చేవని మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగం,ఉపాధి కరువైంది!
పరిశ్రమలు లేకపోవడంతో  ఆరున్నర లక్షల కుటుంబాలు వ్యవసాయరంగం పై ఆధారపడి జీవిస్తున్నారు. విద్యావంతులైన యువకులు ఉద్యోగఅవకాశాలు లేక  హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుతో తదితర నగరాలతో పాటు విదేశాలకు  వలసపోతున్నారు.  లక్షల మంది ఇతర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా రావడం వల్ల ఉత్తరాఖండ్‌లో 490 శాతం ఉద్యోగ అవకాశాలు పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి. మన జిల్లాలో పరిశ్రమలు వచ్చి ఉంటే కనీసం ఆరేడు వందల శాతం మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేవని ఇతర రాష్ట్రాల నుంచి  ఇక్కడకు ఉద్యోగాల కోసం వలసలు వచ్చేవారు.

అనుబంధ పరిశ్రమల్లో అవకాశాలు! 
ప్రత్యేక హోదా మనకు వచ్చి ఉంటే కృష్ణాజిల్లాలోని యువతీ యువకులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కొత్తగా పరిశ్రమలకు అనుబంధంగా పరిశ్రమల్ని పెట్టుకునేందుకు అవకాశం ఉండేదని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా జీఎస్టీ,  ఎక్సైజ్, కస్టమ్స్, ఇంకంట్యాక్స్‌లో 100 శాతం పను రాయితీలు ఇచ్చి, బ్యాంకులు యువతకు సబ్బీడీలోలోన్లు ఇచ్చి ఉంటే జిల్లా వ్యవసాయపరంగానే కాకుండా పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందిన మరొక హైదరాబాద్‌గా మారేదని విజయవాడకు చెందిన ఒక పారిశ్రామికవేత్త అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న వ్యాపార సంస్థలు ఏడెనిమిది రెట్లు పెరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభిస్తుంది.

హోదాను బతికించింది జగనే
రాష్ట్రంలో ప్రత్యేకహోదా నినాదాన్ని బతికించింది వైఎస్సార్‌ సీపీ అధినేత  వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి మాత్రమే. ఈ విషయం అన్ని పార్టీలతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒకప్పుడు ప్రత్యేకహోదా ఉపయోగంలేదు అన్న ముఖ్యమంత్రి  యూటర్న్‌ తీసుకుని హోదా కావాలని నాటాకాలు ఆడుతున్నారు.

ఉద్యోగం రాలేదు! 
చాట్రాయి మండలం  చిన్నంపేట గ్రామానికి చెందిన కొమ్ము రత్తయ్య, సరోజనీలు కూలీ పనులకు వెళ్లి కొడుకు కొమ్ము వీర వెంకట సత్యనారాయణను ఇంజనీరింగ్‌ చదివించారు. 2012 ఇంజనీరింగ్‌ పూర్తి చేసాడు. అప్పటి నుండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. హోదా వచ్చి ఉంటే కొలువు దక్కేదని భావిస్తున్నాడు.

ప్రత్యేక హోదా.. రాష్ట్రానికి సంజీవని
రాష్ట్రానికి స్పెషల్‌ స్టేటస్‌ హోదా కల్పించాలని మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్‌. హోదా వల్ల రాష్ట్రానికి రాయితీలు వస్తాయని, పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు       పెడతారని, చదువుకున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయని గళమెత్తి నినదించిన నాయకుడు ఆయనే. హోదా ఉద్యమంలో గణనీయమైన పాత్ర పోషించటంతో పాటు గడచిన ఐదు సంవత్సరాలుగా ప్రతి వేదికపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఒకసారి హోదా కావాలని, మరోసారి ప్యాకేజీ అని, హోదా అంటే అరెస్టులు చేయించి, మరలా ఇప్పుడు హోదా కోసం పాటు పడుతున్నామంటూ రంగులు మార్చే ఊసర వెల్లులకు తగిన గుణపాఠం ఈ ఎన్నికలలో చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. రాయితీలు లేక అనేక పరిశ్రమలు మూతపడటంతో పాటు, నష్టాల్లో ఉన్నాయి. వాటిని ఆదుకోవడానికి ప్రత్యేక హోదా సంజీవని. తప్పక హోదా ఇవ్వాలి. 
- షేక్‌ మున్ని–ముస్తాబాద, గన్నవరం

చేజేతులా నాశనం చేశారు


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నాలుగేళ్లపాటు మిత్రత్వం నెరపి ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేయకుండా ప్యాకేజీ కోసం పాకులాడడం వల్లే నేడు రాష్ట్రానికి ఇలాంటి దుర్గతి పట్టింది. హోదా వచ్చి ఉండి ఉంటే ఈ ఐదేళ్లలో ఎంతో ప్రగతి సాధించే వారం. ప్యాకేజీలకు తలొగ్గారు.  హోదా కోసం ఐదేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశయం ఈ         సార్వత్రిక ఎన్నికలతో నెరవేరుతుందనే నమ్మకం కలుగుతోంది.
–చిట్టూరి నాంచారయ్య, చినకామనపూడి, ముదినేపల్లి

హోదాతో వ్యవసాయానికి మరింత లాభం
ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయితీని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ పరికరాల తయారీ కంపెనీల ఏర్పాటు రాష్ట్రంలోనే జరుగుతుంది. తద్వారా పరికరాలు తక్కువ ఖర్చుకే దొరుకుతాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే బియ్యం, మినుములు వంటి ప్రాసెసింగ్‌ యూనిట్లు ఇక్కడే నెలకొల్పడంతో రైతులు ఆశించిన దానికంటే ఎక్కువ గిట్టుబాటు ధర వస్తుంది. విద్యుత్‌ చార్జీలు తగ్గుతాయి. అంతేకాకుండా వ్యవసాయానికి ఎక్కువ సమయం విద్యుత్‌ సరఫరా చేస్తారు. వ్యవసాయ విత్తనోత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేయడంతో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయి. హోదా వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి లాభం ఎక్కువగా ఉంటుంది.
 –పంచకర్ల విష్ణువర్ధన్, అభ్యుదయ రైతు, అరిసేపల్లి,  మచిలీపట్నం

హోదా నిలిచింది టీడీపీ వల్లే!
రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవడానికి ప్రభుత్వ నిర్వాకమే కారణం. ముఖ్యమంత్రి ఒకసారి ప్రత్యేక హోదా సంజీవనా అంటారు. ప్రత్యేక హోదా ఉన్న చత్తీస్‌గఢ్‌ ఎంతో అభివృద్ధి చెందింది. అక్కడ పరిశ్రమలొచ్చాయి.  మన ముఖ్యమంత్రి హోదాపై డ్రామాలు ఆడటం బాధాకరం. 
–అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి,  మైలవరం

ఉద్యోగాలు, పరిశ్రమలొస్తాయి


ప్రత్యేకహోదా రాష్ట్రానికి చాలా అవసరం. అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించాలంటే హోదా కావాలి. పన్ను రాయితీలు ఉంటే పరిశ్రమలు వస్తాయి. పేరున్న విద్యాసంస్థలు, ఉన్న త ప్రమాణాలతో కూడిన విద్యాలయాలు అందుబాటులోకి వస్తాయి. రాయితీలు ఉన్నప్పుడు ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. కేంద్రానికి చెల్లించే సొమ్ము 10 శాతమే ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో ప్రగతి వేగం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.  
 – ఆర్‌. వసంత్‌కుమార్, విద్యావేత్త, కంకిపాడు

హోదా వస్తే ఉద్యోగాలొచ్చేవి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఈప్రాంతంలో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. హోదా రాకపోవటం వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. ఆక్వా పరిశ్రమకు ఎంతో ప్రాధాన్యత ఉన్న గుడివాడ ప్రాంతానికి ఆక్వా హబ్‌ రావటంతో పాటు ఆ రంగంలో పరిశ్రమలకు అవకాశం పెరిగేది. పరిశ్రమలు రాయితీ ఉంటేనే ఎక్కువ పరిశ్రమలు వస్తాయి. హోదా ఈ రాష్ట్రానికి, యువతకు అవసరం. ఈసారైనా హోదా సాధించే వారికే మద్దతు ఉండాలి.
– టి సీతారామయ్య, ఉపాధ్యాయులు, గుడివాడ

ప్యాకేజీలకు తలొగ్గారు


ప్రత్యేక హోదాలో ఏముంది, ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యేక హోదాకి తేడా లేదన్న చంద్రబాబునాయుడు ఇప్పుడు యూటర్న్‌ తీసుకోవడం హాస్యాస్పదం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే  90 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. కేంద్రానికి పన్నులు చెల్లించే ఆవశ్యకత ఉండదు. టాక్స్‌ ఫ్రీ స్టేట్‌ అవుతుంది.  కొత్త పారిశ్రామికవాడలు, కంపెనీల స్థాపనకు దోహదమవుతుంది. పారిశ్రామికీకరణ ద్వారా రహదారులు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రాభివృద్ధి ఇతోధికంగా జరిగి ఆర్ధికాభివృద్ధి వేగంగా జరుగుతుంది. 
–పుప్పాల శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది

సంజీవని కాదన్నారు
నాడు సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవని కాదన్నారు. ప్యాకేజీకి ఒప్పుకొన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెట్టారు. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని హోదాపై డ్రామాలాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం చేస్తుంది. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ మొదట నుంచి హోదా సాధనే ధ్యేయంగా పోరాటాలు చేస్తున్నారు. 
– కంభపు రాంబాబు, మంటాడ, పామర్రు

హోదా రాక..  చాలా నష్టపోయాం
రాష్ట్రం అన్యాయంగా విభజనకు గురైంది. ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయింది. అధికారంలో ఉండి, నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా చంద్రబాబు హోదా సాధించలేకపోయారు. దీని అవసరం ఎంతో తెలిసి కూడా హోదాను పక్కన పెట్టేశారు. దీనివల్ల పరిశ్రమలు రాలేదు. అసలే నందిగామ ప్రాంతం అన్ని విధాలుగా వెనుకబడిపోయింది.
–పింగళి లక్ష్మీ నరసింహారావు, న్యాయవాది

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top