అక్రమార్జనలో రారాజు | king Of Illegal And Irregularities | Sakshi
Sakshi News home page

అక్రమార్జనలో రారాజు

Jun 12 2018 9:44 AM | Updated on Aug 17 2018 12:56 PM

king Of Illegal And Irregularities - Sakshi

శ్రీకాకుళం మున్సిపల్‌ డీఈఈ శ్రీనివాసరాజు ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ సిబ్బంది

సాక్షి, విశాఖ క్రైం : మున్సిపాలిటీలో వెలుగులు నింపాల్సిన ఆ అధికారి అవినీతి మురుగులో పీకల్లోతున కూరుకుపోయాడు. ఉద్యోగంలో చేరింది మొదలు... అందినకాడికి వెనకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగడంతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టేశాడు. ఎట్టకేలకు పాపం పండడంతో అక్రమార్జనలో రారాజుగా వెలుగొందిన శ్రీకాకుళం మున్సిపాలిటీ డీఈఈ గొట్టిముక్కల శ్రీనివాసరాజుతోపాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకకాలంలో సోదాలు చేసి రూ.30 కోట్లకు పైగా అక్రమాస్తులు వెనకేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను  ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర వెల్లడించారు.

 
బంగారమే బంగారం 
శ్రీనివాసరాజు ఇంటిలో సోదాల సమయంలో 423.3గ్రాముల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు అక్కయ్యపాలెం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలోని లాకర్‌లో భార్య పేరు మీద 151.78గ్రాములు బంగారు వస్తువులు, డాబాగార్డెన్స్‌లో గల బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద లాకర్‌లో 221.970 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 795 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలు గుర్తించారు. 1548 గ్రాముల వెంటి వస్తువులు లభ్యమయ్యాయి. అదేవిధంగా నగదు రూ.12 లక్షల 27వేలు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.5లక్షల 45 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వం ధర ప్రకారం రూ.1.64కోట్లు ఉంటుందని, మార్కెట్‌ విలువ మాత్రం రూ.30 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

గుర్తించిన అక్రమాస్తులివీ... 
విశాఖ నగర పరిధిలోని సీతమ్మధార నార్త్‌ ఎక్స్‌టెన్స్‌న్‌ దరి పాపాహోం సమీపంలో గల ఆర్‌.ఆర్‌.రెసిడెన్సీలోని ప్లాట్‌ నెంబర్‌ 302లో శ్రీనివాసరాజు నివాసముంటున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. 
     పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోవలి గ్రామంలో ఎక్కువగా శ్రీనివాసరాజు భూమి కొనుగోలు చేశారు. తొలిసారిగా ఈ గ్రామంలో 6.82 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. అదే గ్రామంలో 7.2 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తల్లి జి.స్వరాజ్యం పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్‌ 417/1, 418/1లో 3.19 ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో తండ్రి జి.కృష్ణంరాజు పేరు మీద సర్వే నెంబర్‌ 417/2, 449/2లలో వ్యవసాయ భూమి 2.69 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాస రాజు మామయ్య వి.నారాయణరాజు పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్‌ 416/1లో 2.49ఎకరాల వ్యవసాయ భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో సర్వే నెంబర్‌ 416/52, 416/3, 417 – 1,418 లో 4.71 ఎకరాలు కోనుగోలు చేశారు.


     శ్రీనివాసరాజు అత్తమ్మ వి.వరలక్ష్మి పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్‌ 887/1, 887/2లో 3.6ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నర్శింహపురం గ్రామంలో భార్య పేరిట సర్వే నెంబర్‌ 75/2లో 697.44 గజాల స్థలం. అదే గ్రామంలోని సర్వే నెంబర్‌ 75/2లో ఖాళీ స్ధలం 7.20 ఎకరాలను కుమార్తె జి.మౌనిక పేరు మీద కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెద్ద అమిరాం గ్రామంలో భార్య రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్‌ 487/1, 487/2, 487/2బిలలో 697.44 గజాల స్థలం. విశాఖ జిల్లా అడవివరం గ్రామంలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్‌ 275 / 30 – ఎలో 183 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. అలాగే శ్రీనివాస రాజు రెండు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.


సర్వీసులో 25 ఏళ్లకుపైగా జీవీఎంసీలోనే 
అవినీతి ఊబిలో కూరుకుపోయిన శ్రీనివాసరాజు తన సర్వీసులో ఎక్కువ కాలంలో జీవీఎంసీలోనే తిష్ట వేశారు. బదిలీపై వెళ్లినప్పటికీ మళ్లీ వెంటనే వెనక్కు వచ్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని వెంప గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు జీవీఎంసీలో 1988లో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. అనంతరం 2000వ సంవత్సరంలో ఏఈగా ప్రమోషన్‌ వచ్చింది. అప్పటి నుంచి  2012 వరకు జీవీఎంసీలో ఏఈగా పనిచేశారు. 2012లో బొబ్బిలి మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. అక్కడ 18 నెలలు పని చేసి మళ్లీ ఏఈగా జీవీఎంసీకి బదిలీపై వచ్చారు. అనంతరం 2017లో ఉద్యోగోన్నతి రావడంతో శ్రీకాకుళం మున్సిపాలిటీకి డీఈఈగా వెళ్లారు. అయితే జీవీఎంసీలో పనిచేసిన కాలంలో కొందరు అధికారులతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఓ ప్రజాప్రతినిధితో కలిసి బినామీల పేరున భారీగా పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బినామీల గుట్టు విప్పేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement