వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో కిడ్నీ ఆపరేషన్‌

Kidney Operation with YSR Aarogyasri  - Sakshi

వ్యాధిగ్రస్తుడికి ఉచితంగా కిడ్నీ మార్పిడి

గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ల్యాప్రోస్కోపీ విధానంలో చికిత్స 

ఉచితంగా ఆపరేషన్‌ పూర్తికావడంతో రోగి ఆనందం 

గుంటూరు మెడికల్‌: అతనో కార్పెంటర్‌. పేరు మహ్మద్‌ రౌఫా. రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం ఎక్కడికి వెళ్లినా లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో తల్లడిల్లాడు. ఆ వ్యాధిగ్రస్తుడిని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఆదుకొంది. ఆ పథకంలో అతను ఉచితంగా ఆపరేషన్‌ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి తిరిగివెళ్లాడు. అతనికి ఆపరేషన్‌ చేసిన గుంటూరు జిల్లా చినకోండ్రుపాడులోని కాటూరి మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి డీన్‌ డాక్టర్‌ కేఎస్‌ వరప్రసాద్‌ మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ల్యాప్రోస్కోపీ విధానంలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేసినట్లు ఆయన తెలిపారు. సుమారు రూ.10 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేసి రోగి ప్రాణాలు కాపాడామన్నారు.

కృష్ణా జిల్లా గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామానికి చెందిన మహ్మద్‌ రౌఫా (36) గతంలో విజయవాడ, గుంటూరులోని పలు ఆస్పత్రుల్లో వైద్యం కోసం వెళ్లాడు. రూ. లక్షల్లో ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పడంతో కుంగిపోయాడన్నారు. నాలుగునెలల క్రితం తమ ఆస్పత్రికి వచ్చాడని తెలిపారు. వైద్యులు పరీక్షలు చేసి కిడ్నీ మార్చాలని నిర్ణయించి జనవరి ఐదో తేదీన ఆపరేషన్‌ చేసినట్లు వెల్లడించారు. రౌఫాకు అతని అక్క గుల్జార్‌ బేగం కిడ్నీ దానం చేసిందని, ఆమె కిడ్నీని రౌఫాకు అమర్చటంతో శస్త్రచికిత్స విజయవంతమైందని చెప్పారు. ల్యాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్‌ చేయటం వల్ల కిడ్నీ దానం చేసిన వారు చాలా త్వరగా కోలుకుంటారని, మూడు రోజుల్లోనే తమ పనులు తాము చేసుకుంటారని వివరించారు. అత్యాధునిక ఈ వైద్య విధానంలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తమ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నామని డాక్టర్‌ వరప్రసాద్‌ సూచించారు. మహ్మద్‌ రౌఫాను మంగళవారం డిశ్చార్జి చేశామని తెలిపారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్లలో నిపుణులైన అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్‌ శ్రేయాన్‌, డాక్టర్‌ తేజ్‌షా పర్యవేక్షణలో తమ ఆస్పత్రి సిబ్బంది కృషితో రౌఫాకు ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తిచేశామన్నారు.   

నాకు పునర్జన్మ నిచ్చారు మహ్మద్‌ రౌఫా  
కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న నేను కిడ్నీ జబ్బు వల్ల పనికి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. నా భార్య, ఇద్దరు పిల్లలు పలు ఇబ్బందులు పడ్డారు. రెండేళ్ల పాటు వ్యాధి బాధలను అనుభవిస్తూ పలు ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ కోసం సంప్రదించాను. రూ. 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆపరేషన్‌ చేయించుకునే స్థోమత లేని సమయంలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం నాకు ఎంతో ఉపయోగపడింది. పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్‌ చేయించుకున్నాను. డాక్టర్లు నాకు పునర్జన్మనిచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, వైద్యులకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top