నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు

Kanipakam Vinayaka Brahmotsavam In Chittoor - Sakshi

21 రోజుల పాటు నిర్వహణ

సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యం : ఈవో

సాక్షి, కాణిపాకం(యాదమరి): లోకాలనేలే నాయకుడి బ్రహ్మోత్సవాలకు కాణిపాకం పుణ్యక్షేత్రం ముస్తాబైంది. సోమవారం వినాయక చవితి నుంచి 21 రోజులు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడానికి ఆలయాధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు. విద్యుత్‌ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలు, అవసరమైన ప్రసాదాలను సిద్ధం చేశారు. ఆలయంలోని మూషిక, అన్వేటి, సుపథ మండపాలు, నవగ్రహ ఆలయం, అభయాంజనేయ స్వామి సన్నిధిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన ద్వారం వద్దనున్న ధ్వజస్తంభాన్ని విదేశీ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. విద్యుత్‌ దీపాలతో ఆలయ పరిసరాలను శోభాయమానంగా అలం కరించారు. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత ఇస్తామని ఈఓ దేముళ్లు తెలిపారు. 

వినాయకా..భువికి దిగి రావయ్యా!
కాణిపాకం (యాదమరి): వినాయకా!..భువికి దిగి రావయ్యా..అనే రీతిలో బ్రహ్మోత్సవాలకు కాణిపాకం ముస్తాబైంది. భక్తులకు క్యూలు ఏర్పాటు చేశారు. భక్తుల కాలక్షేపానికి ఆస్థాన మండపంలో, వరసిద్ధుని అనుబంధ వరదరాజుల స్వామి ఆలయ ముందు ఏర్పాటు చేసి పందిట్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రోజు ఉత్సవమూర్తుల ఊరేగింపులో మేళ తాళాలు, భజనలు, పిల్లన గోవి పాటలు, భక్తి గీతాలాపనలు ఏర్పాటు చేశారు. గణేష దీక్షధారుణ భక్తులు రోజూ రెండు పర్యాయాలు దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు సెల్‌ఫోన్లు భద్రపరచడానికి, పాదరక్షకులు పెట్టుకునేందుకు,వేర్వేరు ప్రాంతాలలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్వామివారిని ద ర్శనం చేసుకున్న భక్తులకు ఉచితంగా పులిహోర, చక్కెర పొంగలి పంపిణీ చేయనున్నారు.

నేడు వరసిద్ధునికి పట్టువస్త్రాల సమర్పణ
కాణిపాక శ్రీ వరసిద్ధునికి బ్రహ్మోత్సవాలలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉదయం 9 గంటలకుకి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఈఓ దేముళ్లు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎక్సైజ్‌ అండ్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖామాత్యులు కె.నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు హాజరవుతారని పేర్కొన్నారు. 

ప్రతి ఒక్కరికీ స్వామివారి దర్శనం
కాణిపాకం (యాదమరి): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి  వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి 21 రోజుల పాటు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఈ నేపథ్యంలో కాణిపాక ఆలయ ఈవో దేముళ్లుతో ‘సాక్షి’  ప్రత్యేక ఇంటర్వ్యూ.
సాక్షి :  ఆలయ ఈఓగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఎలా ఉంది?
ఈఓ: స్వామివారి బ్రహ్మోత్సవాల ముందు నేను ఇక్కడ ఈఓగా బాధ్యతలు స్వీకరించాను. పెద్ద బాధ్యతే ఇది. అందరి సహకారంతో విజయవంతం చేస్తాను. 
సాక్షి : భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?
ఈఓ: బ్రహ్మోత్సవాలలో రోజూ లక్ష మంది వరకు భక్తులు రావచ్చని అంచనా వేశాం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశాం. 
సాక్షి :  ఎలాంటి  సౌకర్యాలు కల్పిస్తున్నారు?
ఈఓ: భక్తులకు అందుబాటులో  రూ.100 గదుల 100 ఉన్నాయి. అలాగే ఏసీ రూమ్‌లు 80 ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి బస్సులలో వచ్చే యాత్రికులకు డార్మిటరీలు, కల్యాణ మండపాలు ఉన్నాయి. అలాగు బస్టాండ్‌ నుంచి ఆలయం వరకు ఉన్న మార్గంలో 270 వరకు బాత్రూమ్‌లు ఏర్పాటు చేశాం. 
సాక్షి :  సామన్య భక్తులకు దర్శనం ఎలా కల్పిస్తారు?
ఈఓ: బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నాం. ఉదయం 4.30 గంటల నుంచి స్వామి వారి దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. చవితి రోజున ఇంకా త్వరగా దర్శనం ప్రారంభించడానికి ప్రయత్నిస్తాం.
సాక్షి:  వీఐపీలకు ఏ సమయంలో దర్శనం కల్పిస్తారు?
ఈఓ: వీఐపీలకు ఉదయం 8 గంటల లోపు, రాత్రి 8 గంటల  తరువాత దర్శనం కల్పించనున్నాం. బ్రహ్మోత్సవాల సమయంలో నిత్య సేవలు రద్దు చేస్తున్నాం. 
సాక్షి :  భక్తులకు దర్శనాల ఏర్పాట్లు ఏమిటి?
ఈఓ: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉచితం, రూ.10, రూ.51, రూ.100, ప్రముఖులకు వేర్వేరుగా  దర్శనం క్యూలు ఏర్పాటు చేశాం. అలాగే చంటి పిల్లలకు, గర్భవతులకు, వృద్ధులకు ప్రత్యే క క్యూలను ఏర్పాటు చేశాం. క్యూలలో తాగునీటి వసతి కల్పించాం.  ఫ్యాన్లు  ఏర్పాటు చేశాం.
సాక్షి :  ప్రసాదాల మాటేమిటి?
ఈఓ: భక్తులకు రూ.10 లడ్డూలు 80 వేలు, రూ.50 లడ్డూలు 15 వేలు, రూ.100 లడ్డూలు 10 వేలు , వడలు 5 వేల వరకు సిద్ధం చేశాం. 
సాక్షి :  భక్తులను ఆకట్టుకునేలా ఏం చేశారు?
ఈఓ: విద్యుద్దీపాలంకరణతో ఆలయానికి సరికొత్త శోభను తీసుకొచ్చాం. అలాగే ఆలయం అంతటా ప్రత్యేక పుష్పాలంకరణ చేస్తున్నాం. స్వామివారి బ్రహ్మోత్సవ  విశేషాలు తెలిపే విద్యుత్‌ కటౌట్లు ఏర్పాటు చేశాం. 
సాక్షి :  భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నారా?
ఈఓ: భక్తులకు ఆలయ నిత్యాన్నదాన కేంద్రంలో రోజూ 3,500 మందికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భోజన వసతి కల్పిస్తాం. అలాగే 21 రోజుల పాటు నిరంతర అన్నదాన కమిటీ సభ్యులు ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు అన్నదానం చేస్తారు. 
సాక్షి :  బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక కార్యక్రమాలు?
ఈఓ: ఈ ఏడాది నుంచి ఆలయంలో ప్రత్యేక పవిత్రోత్సవాలను నిర్వహించేందుకు శ్రీకారం  చుడుతున్నాం,  అలాగే వేద సభ నిర్వహించేం దుకు అర్చకులు, వేదపండితులను సంప్రదిస్తున్నాం. ఈ నెల 6న చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. భక్తు ల కాలక్షేపం కోసం ప్రతి రోజూ మధ్యాహ్నం హరికథ, సాయంత్రం భరతనాట్యం, కూచిపూడి, నృత్య ప్రదర్శనలు, రాత్రుల్లో నాటక ప్రదర్శనలు మొదలైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top