వైభవంగా కందికొత్తల పండగ

Kandi Kottala Festival In Gummalaksmipuram - Sakshi

గుమ్మలక్ష్మీపురం(కురుపాం): గిరిజనులు ఏటా ప్రతిష్టాత్మకంగా చేపట్టే కందికొత్తల పండగను ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహిస్తున్నారు. సంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గుమ్మలక్ష్మీపురంలో గిరిజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, యువజన సంఘాల ఆధ్వర్యాన ఉత్సవం సందడిగా సాగింది. గుమ్మలక్ష్మీపురంలోని హైస్కూల్‌ గ్రౌండ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల గ్రామాల నుంచి వేలాదిమంది గిరిజనులు తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా గిరిజనులు గ్రామదేవతలైన గొడ్డాలమ్మలు, చత్తరమ్మలను తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజన సాంప్రదాయం ప్రకారం డప్పులు, ఇతర వాయిద్యాల మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా కందికొత్తల థింసా నృత్యాలు చేశారు. అలాగే బృందాలుగా ఏర్పడి హైస్కూల గ్రౌండ్‌ నుంచి ఎల్విన్‌పేట మీదుగా గుమ్మలక్ష్మీపురం వరకు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో నృత్య ప్రదర్శనలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు.

 గిరిజనులంతా ఐక్యమత్యంగా చేసిన నృత్యాలు కనువిందు చేశాయి. ఈ ఉత్సవాల్లో బదిలీపై వెళ్లిన ఆర్డీఓ  బి సుదర్శనదొరతోపాటు స్థానిక గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండంగి రమణ, నాగభూషణరావు, నిమ్మక శేఖర్, ఆరిక సూర్యనారాయణ, చలపతిరావు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గిరిజనుల ఐక్యతకు ప్రతిగా కందికొత్తల పండుగ నిలుస్తుందన్నారు. ఈ పండగ సందర్భంగా ఏటా ఏజెన్సీకి కేంద్ర బిందువుగా ఉన్న గుమ్మలక్ష్మీపురానికి అన్ని గ్రామాల గిరిజనులంతా అధిక సంఖ్యలో తరలివచ్చి కందికొత్తల ఉత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తద్వారా మరుగున పడిపోతున్న తమ సాంప్రదాయాన్ని భావితరాలకు తెలియజేస్తున్నామని గిరిజనులు తెలిపారు. కందికొత్తల ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎల్విన్‌పేట పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో...
కురుపాం: కందికొత్తల పండగను మండలంలోని గొటివాడ గ్రామంలో గిరిజనులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మొదటిగా పండిన పంటలను గొడ్డలతమ్మ వద్దకు తీసుకొచ్చి నైవేధ్యంగా సమర్పించారు. అనంతరం గొడ్డలమ్మతల్లిని మేళతాళాలతో ఊరేగించారు. అందరూ ధింసా నృత్యాన్ని ప్రదర్శించి ఉత్సాహంగా గడిపారు. ఈ పండగలో గ్రామపెద్దలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top