బాస్కెట్‌ బాల్‌లో భేష్‌

Kamala Kumari Playing Well In Basketball - Sakshi

జాతీయ స్థాయిలో రాణిస్తున్న సూర్య కమల

పశ్చిమగోదావరి , పెనుమంట్ర: క్రీడా కర్మాగారంగా పేరుగాంచిన పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం నుంచి మరో యువ క్రీడాకారిణి జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. గతంలో ఎందరో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను అందించిన మార్టేరు ప్రఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తూ పతకాలు పంట పండిస్తోంది అక్కాబత్తుల సూర్య కమల కుమారి. బాస్కెట్‌బాల్‌ ఆటలో సత్తా చాటుతోంది. హైస్కూల్‌ విద్య నుంచి ప్రారంభమైన ఆ యువతి ప్రతిభా ప్రస్థానం జాతీయ స్థాయికేగింది. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. 

జాతీయ స్థాయిలో రాణిస్తూ..
జిల్లా, రాష్ట్ర స్థాయి పలు పోటీల్లో విశేష ప్రతిభ చూపిన కమల కొనేళ్లుగా జాతీయ స్థాయిలోనూ దూసుకుపోతోంది. 2013లో పంజాబ్‌ గ్వాలియర్‌లో జరిగిన అండర్‌ 14 విభాగం, 2014లో హైదరాబాద్‌లో నిర్వహించిన మినీ నేషనల్స్, 2016లో హైదరాబాద్‌ (గచ్చిబౌలీ)లో జరిగిన యూత్‌ నేషనల్స్, 2017లో జరిగిన ఢిల్లీలో జరిగిన అండర్‌ 17 విభాగంలో జరిగిన పోటీల్లో రాష్ట్ర జట్టులో కమల పాల్గొంది. ప్రసుత్తం ఆంధ్రప్రదేశ్‌ (చిత్తూరు)లో జరుగుతోన్న జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ క్రీడల్లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె చిత్తురులో ఉంది.

ఎస్సై అవుతా..
మార్టేరు వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేసిన కమల ప్రస్తుతం పెనుగొండలోని ప్రఖ్యాత ఎస్వీకేపీ అండ్‌ పితాని వెంకన్న జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఇంటర్, ఆపై డిగ్రీ పూర్తి చేసి ఎస్సై కావాలన్నదే లక్ష్యమని కమల తన మనోభావాన్ని తెలియజేసింది.

వ్యవసాయ కుటుంబం
మార్టేరుకు చెందిన వ్యవసాయ కుటుంబీకులు అక్కాబత్తుల నాగేశ్వరరావు, విజయకుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. నాలుగో సంతానం కమల.

వైబీఏ సహకారం మరువలేనిది..
మార్టేరులోని క్రీడాభిమానులు, ప్రోత్సాహకులు సంఘటితమై ఏర్పాటు చేసిన యూత్‌ బాస్కెట్‌బాల్‌ అసోషియేషన్‌ (వైబీఏ) మా లాంటి పేద క్రీడాకారులకు ఎంతో అండగా నిలుస్తోంది. నాకు తొలి
నుంచి అన్నివిధాల తోడ్పాటు ఇవ్వడంతో పోటీల్లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లి వచ్చాను. నిత్యం గ్రౌండ్‌లో పీఈటీ కృష్ణారెడ్డి, నగేష్‌ సార్లు నేర్పిస్తున్న క్రీడా మెళకువలు నాకెరీర్‌కు ఎంతో
తోడ్పాటునిస్తున్నాయి.– అక్కాబత్తుల సూర్యకమల కుమారి, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి, మార్టేరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top