breaking news
Kamala Kumari
-
అంతర్ధానమైన అభినయ శారద
డ్యాన్సా.. తనేం చేస్తుంది? అంత మాట అంటారా? కమల కుమారికి ఎక్కడలేని పట్టుదల వచ్చింది. భవిష్యత్‌లో మంచి డ్యాన్సర్ అనిపించుకుంది. ఏంటీ.. భాష రానివాళ్లను పెట్టారెందుకు? జయంతిపై సావిత్రి ఆగ్రహం. జయంతికి పట్టుదల వచ్చింది. భవిష్యత్‌లో ‘నంబర్ వన్ హీరోయిన్’ అంటూ సావిత్రియే మెచ్చుకునే రేంజ్‌కి వెళ్లారు. ‘నీ వల్ల కాదు’ అంటే ‘నా వల్ల అవుతుంది’ అని చేసి చూపించడం కమల కుమారి అలియాస్ జయంతి అలవాటు. అందుకే... ‘అభినయ శారద’గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు. ‘జెను గూడు (1963).. కథానాయికగా జయంతికి తొలి చిత్రం ఇది. అంటే.. తేనె తుట్టె అని అర్థం. నటిగా జయంతి కెరీర్ తీయగా సాగింది. జయంతి అనేది స్క్రీన్ నేమ్. అసలు పేరు కమల కుమారి. 1945 జనవరి 6న బళ్లారిలో పుట్టింది కమల. తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఇంగ్లీష్ లెక్చరర్. ఇద్దరు తమ్ముళ్లు. మగపిల్లలను ఎలా పెంచారో కూతురినీ తల్లిదండ్రులు అలానే పెంచారు. కమల తీరు మగరాయుడిలానే ఉండేది. స్కూల్లో జరిగే కార్యక్రమాల్లో తప్పనిసరిగా డ్యాన్స్ చేసేది. కూతురి డ్యాన్స్ చూసి, ‘క్లాసికల్ డ్యాన్సర్’ని చేస్తే బాగుంటుందని, మదరాసు తీసుకెళ్లారు కమల తల్లి సంతాన లక్ష్మి. సినిమాల్లో డ్యాన్సర్‌గా చేస్తూ, డ్యాన్స్ స్కూల్ నడుపుతున్న చంద్రకళ దగ్గర చేర్పించారు. అయితే కొత్తగా చేరిన కమల భవిష్యత్‌లో సినిమా తారగా రాణిస్తుందని, డ్యాన్స్ బాగా చేస్తుందని ఊహించక ‘తనేం డ్యా¯Œ ్స చేస్తుంది. కాలూ చేయీ ఊపితే డ్యాన్స్ అయిపోతుందా?’ అని డ్యాన్స్ స్కూల్లో సీనియర్లు ఏడిపించారు. పట్టుదలతో నేర్చుకుంది కమల. నటిగా భవిష్యత్‌లో జయంతి చేసిన డ్యాన్సులు అందర్నీ ఆకట్టుకున్నాయి. తెరపైకి జయంతిగా... కమల సినిమాల్లోకి రావాలనుకోలేదు. అనుకోకుండా జరిగిపోయింది. డ్యాన్స్ టీచర్‌కి షూటింగ్ ఉంటే ఆమెతో పాటు వెళ్లింది. అక్కడే ఉన్న కన్నడ దర్శకుడు వైఆర్ స్వామి ముగ్గురు కథానాయికలున్న సినిమా ప్లాన్ చేస్తున్నారు. పండరీ భాయ్, చంద్రకళను ఎంపిక చేశారు. మూడో హీరోయిన్ కోసం వెతుకుతున్న ఆయన కళ్లల్లో కమల పడింది. ముందు కమల తల్లి ఒప్పుకోకపోయినా, స్వామి ఒప్పించారు. అలా ‘జెను గూడు’ సినిమాకి నటిగా తొలిసారి మేకప్ వేసుకుంది కమల కుమారి. ‘నీ చుట్టూ జనం ఉన్నారని మర్చిపో. నేను చెప్పినట్లు చెయ్’ అన్నారు స్వామి. చేసేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. అయితే స్క్రీన్ నేమ్ కమల కుమారి అంటే పెద్దగా ఉంటుందని ‘జయంతి’ అని నిర్ణయించారు. పేరు పెట్టిన ముహూర్తం మంచిది. పేరు బలం సెంటిమెంటూ వర్కవుట్ అయింది. సినిమా కూడా సూపర్ హిట్. జయంతి బిజీ కథానాయిక అయ్యారు. చిన్న దేవకన్యగా... నిజానికి కథానాయికగా ‘జెను గూడు’లో కనిపించకముందే తెలుగు, తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేసింది కమల. డ్యా¯Œ ్స నేర్చుకోవడానికి మదరాస్ వెళ్లినప్పుడు ఎన్టీఆర్‌ని చూడ్డానికి వెళ్లింది. అప్పుడాయన ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘నాతో యాక్ట్ చేస్తావా?’ అని అడిగారు. నిజంగానే ఎన్టీఆర్ సరసన నటించింది. ఎన్టీఆర్ ‘జగదేకవీరుని కథ’లో చిన్న దేవకన్యగా చేసింది కమల. అయితే దేవకన్య అంటే వయ్యారంగా నడవాలి. టామ్ బాయ్ కమల విసావిసా నడుచుకుంటూ వెళుతుంటే, ‘అబ్బాయిలా నడుస్తున్నారేంటి?’ అని ఎలా నడవాలో చూపించారు ఎన్టీఆర్. ‘ఆ తర్వాత నా నడక మారింది’ అని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయంతి అన్నారు. ‘దొంగ మొగుడు’లో..., ‘మిస్ లీలావతి’లో... స్విమ్ సూట్లో... వరుసగా ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన జయంతి ‘మిస్ లీలావతి’ (1965)లో స్విమ్ సూట్ ధరించడం చర్చనీయాంశమైంది. అప్పటివరకూ లంగా, వోణీ, చీరలకే పరిమితమైన కన్నడ సినిమా ఆ తర్వాత స్కర్ట్స్–టీషర్ట్.. ఇలా ఆధునిక దుస్తులకు మారింది. ఆ సినిమాలో నటనకుగాను జయంతికి మంచి మార్కులు పడ్డాయి. సొంత గొంతుతో... ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాషలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు జయంతి. కొత్త భాషలు నేర్చుకోవాలనే పట్టుదల జయంతికి కలగడానికి కారణం సావిత్రి. ఓ తమిళ సినిమాలో సావిత్రి కాంబినేష¯Œ లో చేస్తున్నప్పుడు జయంతి డైలాగ్ చెప్పడానికి తడబడ్డారు. ‘భాష రానివాళ్లను తీసుకొచ్చారేంటి’ అని సావిత్రి విసుక్కున్నారు. దాంతో మాస్టారుని పెట్టుకుని, తమిళం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఓ సినిమాలో ఆమెకు అత్తగా సావిత్రి నటించారు. ఆ షూట్లో సావిత్రిని ఆశీర్వదించమని జయంతి అడిగితే, ‘కన్నడంలో నంబర్ వన్ హీరోయి¯Œ వి. నా కాళ్ల మీద పడుతున్నావేంటి?’ అన్నారామె. ‘నేను ఇలా ఉన్నానంటే కారణం మీరే. భాష నేర్చుకునేలా చేశారు’ అన్న జయంతిని సావిత్రి ఆశీర్వదించారు. కన్నడ, తెలుగు, తమిళం తదితర భాషల్లో హీరోయిన్గా నటించిన జయంతి ‘పెదరాయుడు’, ‘వంశానికొక్కడు’, ‘ఘరానా బుల్లోడు’, ‘రాముడొచ్చాడు’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లోనూ మెప్పించారు. రాజకీయాల్లోనూ... 1998 లోక్‌సభ ఎన్నికల్లో చిక్ బళ్ళాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు కానీ జయంతికి విజయం దక్కలేదు. 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగీరె నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఓటమి చెందారు. నిద్రలోనే... ఆదివారం బనశంకరిలోని తన నివాసంలో కన్నుమూశారు జయంతి. కొన్నాళ్లుగా ఆమె శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డారు. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు. దక్షిణాదితో పాటు హిందీ, మరాఠీ భాషల్లో కలిపి దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఈ అభినయ శారద భౌతికంగా అంతర్థానమైనప్పటికీ అద్భుత పాత్రల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో మిగిలిపోతారు. ‘కొండవీటి సింహం’లో..., ‘పెదరాయుడు’లో... జయంతి అంత్యక్రియలు నేడు (మంగళవారం) బెంగళూరులోని బనశంకరి స్మశానవాటికలో జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రవీంద్ర కళాక్షేత్రంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం అంత్యక్రియలను పూర్తి చేయనున్నట్లు జయంతి తనయుడు కృష్ణకుమార్ తెలిపారు. తెలుగు దర్శకుడు పేకేటి శివరాంతో జయంతి పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగానే సాగింది. కొన్నాళ్లకే వారు విడిపోయారు. తనయుడు కృష్ణకుమార్‌కి సినిమాలంటే ఆసక్తి లేకపోవడంతో ఇటువైపుగా తీసుకురాలేదామె. ఇందిరా గాంధీ చేతుల మీదుగా... జయంతికి ‘గ్లామర్ దివా’ పేరు తెచ్చిన ‘మిస్ లీలావతి’ ఆమెకు ప్రెసిడెంట్ మెడల్ దక్కేలా చేసింది. ఆ సమయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ మెడల్ అందించి, ముద్దాడి.. జయంతికి గుడ్ లక్ చెప్పారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇచ్చిన ‘అభినయ శారదె’ (అభినయ శారద) బిరుదుతో పాటు మరెన్నో అవార్డులు అందుకున్నారు. ఆ హెడ్‌లైన్స్‌తో జోడీ కట్ కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్–జయంతి కలిసి దాదాపు 45 సినిమాలు చేశారు. ఈ జంటకు ‘రాజా జోడీ’ అని పేరు. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రాల్లో ‘బహద్దూర్ గండూ’ది ప్రత్యేకమైన స్థానం. నువ్వా? నేనా అన్నట్టుగా నటించారు. ఆ సినిమా విడుదలయ్యాక ఇంగ్లీష్ మ్యాగజీ¯Œ ్స అన్నీ ‘జయంతి స్టీల్స్ ది షో’ అని రాశాయి. అంతే.. రాజ్‌కుమార్‌తో జయంతికి అదే చివరి సినిమా. ఆ హెడ్లై¯Œ ్స రాయకుంటే మరిన్ని సినిమాలు చేసేవాళ్లమేమో అని ఓ సందర్భంలో జయంతి అన్నారు. అయితే రాజ్‌కుమార్ ఉన్నంతవరకూ ఆయనతో స్నేహం అలానే ఉంది. – డి.జి.భవాని -
బాస్కెట్ బాల్లో భేష్
పశ్చిమగోదావరి , పెనుమంట్ర: క్రీడా కర్మాగారంగా పేరుగాంచిన పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం నుంచి మరో యువ క్రీడాకారిణి జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. గతంలో ఎందరో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను అందించిన మార్టేరు ప్రఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తూ పతకాలు పంట పండిస్తోంది అక్కాబత్తుల సూర్య కమల కుమారి. బాస్కెట్‌బాల్ ఆటలో సత్తా చాటుతోంది. హైస్కూల్ విద్య నుంచి ప్రారంభమైన ఆ యువతి ప్రతిభా ప్రస్థానం జాతీయ స్థాయికేగింది. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాణిస్తూ.. జిల్లా, రాష్ట్ర స్థాయి పలు పోటీల్లో విశేష ప్రతిభ చూపిన కమల కొనేళ్లుగా జాతీయ స్థాయిలోనూ దూసుకుపోతోంది. 2013లో పంజాబ్ గ్వాలియర్‌లో జరిగిన అండర్ 14 విభాగం, 2014లో హైదరాబాద్‌లో నిర్వహించిన మినీ నేషనల్స్, 2016లో హైదరాబాద్ (గచ్చిబౌలీ)లో జరిగిన యూత్ నేషనల్స్, 2017లో జరిగిన ఢిల్లీలో జరిగిన అండర్ 17 విభాగంలో జరిగిన పోటీల్లో రాష్ట్ర జట్టులో కమల పాల్గొంది. ప్రసుత్తం ఆంధ్రప్రదేశ్ (చిత్తూరు)లో జరుగుతోన్న జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడల్లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె చిత్తురులో ఉంది. ఎస్సై అవుతా.. మార్టేరు వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేసిన కమల ప్రస్తుతం పెనుగొండలోని ప్రఖ్యాత ఎస్వీకేపీ అండ్ పితాని వెంకన్న జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఇంటర్, ఆపై డిగ్రీ పూర్తి చేసి ఎస్సై కావాలన్నదే లక్ష్యమని కమల తన మనోభావాన్ని తెలియజేసింది. వ్యవసాయ కుటుంబం మార్టేరుకు చెందిన వ్యవసాయ కుటుంబీకులు అక్కాబత్తుల నాగేశ్వరరావు, విజయకుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. నాలుగో సంతానం కమల. వైబీఏ సహకారం మరువలేనిది.. మార్టేరులోని క్రీడాభిమానులు, ప్రోత్సాహకులు సంఘటితమై ఏర్పాటు చేసిన యూత్ బాస్కెట్‌బాల్ అసోషియేషన్ (వైబీఏ) మా లాంటి పేద క్రీడాకారులకు ఎంతో అండగా నిలుస్తోంది. నాకు తొలి నుంచి అన్నివిధాల తోడ్పాటు ఇవ్వడంతో పోటీల్లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లి వచ్చాను. నిత్యం గ్రౌండ్లో పీఈటీ కృష్ణారెడ్డి, నగేష్ సార్లు నేర్పిస్తున్న క్రీడా మెళకువలు నాకెరీర్‌కు ఎంతో తోడ్పాటునిస్తున్నాయి.– అక్కాబత్తుల సూర్యకమల కుమారి, బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి, మార్టేరు -
రావు రమేశ్‌కు మాతృవియోగం
దివంగత నటుడు రావు గోపాలరావు సతీమణి కమలకుమారి (73) శనివారం తుది శ్వాస విడిచారు. కమలకుమారి హరికథ కళాకారిణి. ఆంధ్రపదేశ్, కర్ణాటకల్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన ఘనత ఆమెది. దూరదర్శన్‌లో చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మంచి పేరు సంపాదించుకున్నారామె. స్వతహాగా పురాణాలను ఇష్టపడని రావు గోపాలరావు ఓ సందర్భంలో కమలకుమారి చెప్పిన హరికథ విని, తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఆమె హరికథ చెప్పే తీరుకి ఆయన ముగ్ధుడయ్యారు. ఆ తర్వాత స్నేహితులు కొందరు ‘మీ ఇద్దరూ చక్కని ప్రతిభావంతులు. ఎందుకు పెళ్లి చేసుకోకూడదు’ అంటే... అప్పటికే ఒకరి పట్ల మరొకరికి మంచి అభిప్రాయం ఉండటంతో వివాహం చేసుకున్నారు. భార్యను ఏనాడూ ఏకవచనంతో పిలవలేదాయన. ‘కుమార్జీ’ అని పిలిచేవారట. ఈ విషయాన్ని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలకుమారి తెలిపారు. భర్త మరణం తర్వాత తనలో సగభాగం చచ్చుబడినట్లయిందని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారిలో పెద్ద కుమారుడు రావు రమేశ్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రావు రమేశ్ మంచి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలకుమారి హైదరాబాదులోని స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలుసుకుని నటుడు చిరంజీవి స్వయంగా వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంకా పలువురు సినీ రంగ ప్రముఖులు కమలకుమారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
రావు గోపాల్ రావు భార్య కన్నుమూత
ప్రముఖ హరికథా కళాకారిణి, ప్రముఖ నటులు రావు గోపాల్ రావు భార్య కమల కుమారి (73) ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రావు రమేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో సహాయ నటుడిగా కొనసాగుతున్నారు. ఎన్నో వేదికలపై హరికథా గానం చేసిన కమల కుమార్ రావు గోపాల్ రావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొండాపూర్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. -
సైబరాబాద్ కమిషనర్ ఆనంద్‌పై హైకోర్టుకు ఫిర్యాదు
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌పై ఓ మహిళ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆనంద్ తనను మానసికంగా వేధిస్తున్నాడని కమల కుమారి అనే మహిళ కోర్టుకు తెలిపారు. కోర్టు, ఉన్నతాధికారుల ఆదేశాలను ఆయన పట్టించుకోవడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీవీ ఆనంద్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఆయనను కోర్టు ఎదుట హాజరయ్యేలా ఆదేశించాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు.