రైతు గోడు పట్టాదా?

Kaluva Srinivasulu Demands Draught District Anantapur - Sakshi

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన సభ్యులు

‘అనంత’ను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌  

ప్రత్యామ్నాయ సాగు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని సూచన

అనంతపురం సిటీ: అధికార పార్టీకి చెందిన వారైనా సరే..తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టాల్సి వచ్చింది. జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తున్నా..ప్రభుత్వం 44 మండలాలనే కరువు జాబితాలో చేర్చడంతో సందిగ్ధంలో పడిన అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు..తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.  గురువారం జెడ్పీ చైర్మన్‌ పూల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం రసవత్తరంగా సాగింది. సమావేశంలో మంత్రి కాలువ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్‌ యామినీ బాల, జాయింట్‌ కలెక్టర్‌ డిల్లీరావు, జెడ్పీ సీఈఓ శోభాస్వరూపారాణి పాల్గొనగా...వ్యవసాయశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, విద్యుత్, పశుసంవర్థకశాఖలకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సమయం లేకపోవడంతో విద్య, వైద్యం, గ్రామీణ నీటిపారుదల, పంచాయతీ, అటవీశాఖలపై చర్చ జరలేదు.

రైతుల జీవితాలతో ఆడుకుంటారా..?
తీవ్ర వర్షాభావంతో జిల్లా వ్యాప్తంగా పొలాలన్నీ బీళ్లుగా మారాయని....అక్కడక్కడా విత్తనాలు వేసినా..అవి మొలకెత్తలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేవలం 44 మండలాలను మాత్రమే కరువు జాబితాలో చేర్చడంపై సభ్యులు మండిపడ్డారు. ఇలా నివేదికలు ఎలా పంపారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథిలు వ్యవసాయశాఖ జేడీపై మండిపడ్డారు.  గతేడాది రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ నేటికీ రైతులకు అందలేదనీ... తక్షణం వారికి ఈ డబ్బు చేతికందితే కొంత భరోసా ఉంటుందన్నారు. స్పందించిన జేడీ మాట్లాడుతూ, జూన్‌లో కొంతమేర వర్షాలు కురవడంతో నివేదిక ఇలా పంపామనీ, ప్రస్తుతం 63 మండలాలను కరువు మండలాలుగా గుర్తించి నివేదిక సిద్ధం చేశామన్నారు. 

విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి
సెప్టెంబరులో వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఆయా ప్రాంతాల వాతావరణాన్ని బట్టి వందశాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలని సభ్యులు కోరగా.. అధికారులు సానుకూలంగా స్పందించారు.  వాతావరణ బీమా ‘అనంత’ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేకపోతోందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కాలువ స్పందిస్తూ.. ఈ పథకంపై సీఎంకు అవగాహన ఉందనీ, త్వరలోనే ఆయన వాతావరణ బీమాలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే యోచనలో ఉన్నారన్నారు. ఇక పశుక్రాంతి పథకం ద్వారా   ఈ వాతావరణానికి అలవాటు లేని పశువులను అధికారులు తీసుకువస్తున్నారనీ, దీంతో అవి మృత్యువాత పడి రైతుకు నష్టం కలుగుతోందని సభ్యులు అన్నారు. అలా కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి పశువులను కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. స్పందించిన మంత్రి కాలవ..సభ్యుల కోరిక మేరకు తప్పకుండా మార్పు చేస్తామన్నారు.  

కల్తీ జరుగుతున్నా..కట్టడి చేయలేకపోతున్నారు
మార్కెట్లో పాలు, నెయ్యి, చివరికి నీరు కూడా కల్తీ చేస్తున్నా...అధికారులు పట్టించుకోక పోవడం దారుణమని సభ్యులు ధ్వజమెత్తారు. తక్షణం కల్తీలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌ డిల్లీ రావు.. ..ఆహారకల్తీ విభాగానికి ఒకే అధికారి ఉన్న కారణంగా కేసులు ఎక్కువగా నమోదు చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఇకపై కల్తీలకు పాల్పడే వారిపై ఐపీసీ సెక్షన్‌లు విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

డిపాజిట్‌లు చేస్తేనే రుణాలిస్తారా..?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు రుణాల మంజూరులో పలు బ్యాంకుల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ,  ముందుగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తేనే రుణాలిస్తామంటూ మొండిగా వాదిస్తున్నారన్నారు. స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌...వెంటనే బ్యాంకర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే అనంతపురం శివారుల్లో జాతీయ రహదారి నిర్మాణంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్‌ అన్నారు. స్పందించిన జేసీ..తానే స్వయంగా గ్రామాలకు వచ్చి రైతులతో మాట్లాడుతానన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పార్థసార థి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతురాయ చౌదరి, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, కత్తినరసింహారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. 

కరుణానిధి మృతికి నివాళి
సమావేశం ప్రారంభం కాగానే అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

తీర్మానాలివీ...
జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి.
జిల్లాలోని 1,468 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. ఆయా పాఠశాలల్లో మొక్కలు పెంచి..సంరక్షణ అటవీశాఖ చర్యలు తీసుకోవాలి.
జిల్లాలోని అన్ని చెరువులకు హంద్రీనీవా నుంచి నీరు విడుదల చేయాలి.
అనంతపురం, గుత్తి, రాయదుర్గంలోని జెడ్పీ స్థలాల్లో రూ.61 లక్షలతో గదులు నిర్మించి వాటిని అద్దెలకు ఇవ్వాలి.
రాయదుర్గం మండలం, వీరాపురం ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలుగా విభజించాలని తీర్మాణాలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top