టీడీపీ, బీజేపీ పాపపరిహారం చేసుకోవాలి | Sakshi
Sakshi News home page

టీడీపీ, బీజేపీ పాపపరిహారం చేసుకోవాలి

Published Fri, Jun 29 2018 12:16 PM

Kadapa Steel Plant AP Peoples Right : Opposition Parties - Sakshi

సాక్షి, కడప : కడప ఉక్కు - రాయలసీమ హక్కు అంటూ వైఎస్సార్‌ జిల్లా నినదించింది. కరువు సీమ అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమ ఒక్కటే దారని జిల్లా ప్రజానీకం ఆకాంక్షింది. నాయకుల కుట్రలకు బలైన రాయలసీమకు న్యాయం చేయాలంటూ యువత ఉద్యమ బాట పట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సిందేనని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. తమ హక్కులను సాధించుకోవడానికి అఖిల పక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు బంద్‌లో పాల్గొన్నారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్షాలు సంయుక్తంగా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

పూటకో మాట మాట్లాడుతున్న టీడీపీ.. : బంద్‌ సందర్బంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకు బంద్‌ చేపట్టామని అన్నారు. విభజన హామీలను బీజేపీ విస్మరించిందని ఆయన ధ్వజమెత్తారు. ఇరుపార్టీలకు సెగ తగిలేలా ఉక్కు ఉద్యమం చేపట్టామని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకొని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఉక్కు పరిశ్రమపై చిత్తశుద్ధి లేదని, అందుకే పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రజల్లో పరిశ్రమపై బలమైన ఆకాంక్ష ఉందని, అందుకే బంద్‌కు అందరూ సహకరిస్తున్నారని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.

ఇప్పటికైనా పాపపరిహారం చేసుకోవాలి : జిల్లాకు ఉక్కు పరిశ్రమ ప్రకటించకపోవడంపై వామపక్ష నేతలు మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసి పాపాలను మూటగట్టుకున్నాయని, ఉక్కు పరిశ్రమ స్థాపించి చేసిన పాపాలకు పరిహారం చేసుకోవాలని హితవు పలికారు. ప్రజాఉద్యమంలో టీడీపీ, బీజేపీలు కొట్టుకు పోతాయిని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశత్వం విడిచి ప్రజల ఆకాంక్షల మేరకు నడుచు కోవాలంటూ సూచించారు.

హామీలు అమలయ్యే వరకూ పోరాటం : విభజన చట్టంలోని హామీలు అమలయ్యే వరకూ వైఎస్సార్‌సీపీ అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందని మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెట్టాలనే ఆకాంక్షను బలంగా తెలియచేశారని అన్నారు. గత నాలుగేళ్లుగా విభజన చట్టం హమీల కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం చిత్తశుద్ధి లేని దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Advertisement
Advertisement