ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, కార్మికుల కుటుంబాలకు తమ పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప మేయర్ కె.సురేష్‌బాబు హామీ ఇచ్చారు.
కడప మేయర్ సురేష్‌బాబు
కడప అర్బన్ : ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, కార్మికుల కుటుంబాలకు తమ పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప మేయర్ కె.సురేష్‌బాబు హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వమే విలీనం చేసుకుని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 11 నుంచి ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మె నేపథ్యంలో కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర విభజనలో భాగంగా వేల కోట్ల ఆస్తులున్న ఆర్టీసీ విభాగాన్ని తెలంగాణలో ఉండేలా, కేవలం 10 శాతం ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఉండేలా విభజన ప్రక్రియ జరగడంతో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కార్మికులు తమ వేతనాల్లో కొంత భాగాన్ని సొసైటీలో దాచుకుంటే ఆ మొత్తాన్ని కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం యాజమాన్యం వాడుకోవడాన్ని తప్పుబట్టారు.
ఆర్టీసీకి రోజూ రూ.2.50 కోట్లు నష్టం వాటిల్లుతోందని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అయినా ప్రజలకు సేవలందించడంలో ఏమాత్రం తగ్గడం లేదని చెప్పారు. అలాంటి ఆర్టీసీని ప్రభుత్వమే విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.నారాయణ సమ్మెకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ న్యాయవాది అజయ్‌కుమార్ వీణా, ఈయూ చీఫ్ డిప్యూటీ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రప్రసాద్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, ఎల్‌ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు శేఖర్, బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు శేషయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి నరసయ్య, రీజనల్ అధ్యక్షుడు నాగముని, రీజనల్ నాయకులు చెన్నయ్య, శేఖర్, కడప డిపో అధ్యక్ష కార్యదర్శులు మూర్తి, ప్రకాశం, నాగసుబ్బారెడ్డి పాల్గొన్నారు.