కబడ్డీ క్రీడాకారుడి బలవన్మరణం

Kabaddi player died in Gullapalli - Sakshi

గుళ్ళపల్లి(చెరుకుపల్లి): విధి ఆడిన ఆటలో జాతీయ స్థాయి  కబడ్డీ క్రీడాకారుడు మరణం ఎదుట ఓటమి అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే చెరుకుపల్లి మండలంలోని గుళ్ళపల్లి గ్రామానికి చెందిన కె. శంకరరావు, అరుణలకు ఇద్దరు కుమారులున్నారు. చిన్నకుమారుడైన సాయికుమార్‌(16) కావూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత కొంత కాలంగా సాయి కుమార్‌ తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉండటంతో అప్పులు చేసి మరీ వైద్యం చేయిస్తున్నారు. 

అప్పులపాలు కావటంతో తీసుకున్న బాకీలు ఎలా తీర్చాలో అర్థం కాక తీవ్ర మనస్తాపం చెందిన సాయి కుమార్‌ ఈ నెల 21వ తేదీన  కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనం ద్వారా తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొంది నయమైన తర్వాత ఇంటికి వచ్చారు. ఈ నెల 27వ తేదీన మరలా సాయి కుమార్‌ ఆరోగ్యం విషమించటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ 28వ తేదీన మరణించాడు. దీంతో వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ వీరయ్య తెలిపారు.
  
కబడ్డీ అంటే ప్రాణం
సాయికుమార్‌కు చిన్ననాటి నుంచి కబడ్డీ క్రీడ అంటే ఎంతో అమితమైన ఆసక్తి. చిన్ననాటి నుంచి పేదరికంలో పుట్టి పెరగటంలో ఎలాగైనా సరే క్రీడల్లో రాణించి స్పోర్ట్స్‌ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించలనేది సాయికుమార్‌ కల, లక్ష్యం.  అందుకు తగిన్నట్లుగానే గుళ్ళపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో 10వ తరగతి పూర్తిచేశాడు. పాఠశాల స్థాయిలోనే కబడ్డీ  క్రీడలో విశేషంగా రాణించి జోన్‌లో, రాష్ట్రస్థాయిలో జట్టుగెలుపులో కీలక పాత్రను పోషించాడు. అంతేకాకుండా కబడ్డీలో రాష్ట్రస్థాయిలో రాణించి ఎట్టకేలకు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. దీంతో అతడికి కోచింగ్‌ ఇచ్చిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు. కానీ అంతలోనే సాయికుమార్‌ చనువు చాలించటం ఎంతో బాధాకరమని ఉపాధ్యాయులు, ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top