తిరుపతిలోనూ ‘కే’ ట్యాక్స్‌! | K Tax Also In Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలోనూ ‘కే’ ట్యాక్స్‌!

Aug 25 2019 5:19 AM | Updated on Aug 25 2019 8:30 AM

K Tax Also In Tirupati - Sakshi

తిరుపతిలోని రుయా ఆస్పత్రి

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ పాలనలో గుంటూరు జిల్లా నర్సరావుపేట, సత్తెనపల్లె ప్రాంతాల్లో విధించిన ‘కే’ ట్యాక్స్‌ వ్యవహారం చిత్తూరు జిల్లా తిరుపతి వరకూ పాకింది. గడిచిన ఐదేళ్లుగా రుయా ఆస్పత్రి కేంద్రంగా మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తనయుడు కోడెల శివరాం బినామీ ద్వారా ప్రతినెలా రూ.40 లక్షల దాకా కొల్లగొడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌ల నిర్వహణను అప్పటి టీడీపీ ప్రభుత్వం మెడాల్‌ సంస్థకు అప్పగించింది. తిరుపతి, గుంటూరు ఆస్పత్రుల్లో మాత్రం ‘లక్ష్మీవెంకటేశ్వర క్లినికల్‌ ల్యాబ్‌’కు అప్పగించారు. కోడెల శివరాం బినామీ మనోజ్‌కు చెందినదే ఈ లక్ష్మీవెంకటేశ్వర క్లినికల్‌ ల్యాబ్‌. తిరుపతి రుయా ఆస్పత్రిలో రూ.4 కోట్లకు పైగా విలువైన అత్యాధునిక పరికరాలున్నాయి.

వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన నిపుణులు ఉన్నారు. అయినప్పటికీ అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు ఒత్తిడి మేరకు రుయా ఆస్పత్రిలో ల్యాబ్‌ నిర్వహణను లక్ష్మీ వెంకటేశ్వర క్లినికల్‌ ల్యాబ్‌కు కట్టబెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్‌ఐవీ టెస్టు చేయడానికి రూ.150 తీసుకుంటారు. కానీ, లక్ష్మీవెంకటేశ్వర సంస్థ రూ.850 వసూలు చేస్తోంది. రూ.80తో చేసే థైరాయిడ్‌ టెస్టుకు ఏకంగా రూ.350 దండుకుంటోంది. వైద్య పరీక్షల పేరిట ప్రతినెలా రోగుల నుంచి రూ.40 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్షలను రుయా ఆస్పత్రి నిపుణులు సొంతంగా నిర్వహిస్తే కేవలం రూ.15 లక్షలే ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే లక్ష్మీవెంకటేశ్వర క్లినికల్‌ ల్యాబ్‌ ప్రతినెలా రూ.25 లక్షలు అధికంగా పిండుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఈ లెక్కన గత ఐదేళ్లలో రూ.15 కోట్లు అదనంగా గుంజుకున్నట్లు తెలుస్తోంది.  

వైద్య పరికరాల సరఫరాలోనూ.. 
మెడికల్‌ సర్జికల్‌ పరికరాలను సరఫరా చేసే కాంట్రాక్టును సైతం కోడెల శివరాంకు చెందిన జయకృష్ణ, సాయికృష్ణ మెడికల్‌ ఏజెన్సీ దక్కించుకుంది. నిబంధనల ప్రకారం.. ఇలాంటి కాంట్రాక్టును స్థానికంగా ఉన్న ఏజెన్సీకే అప్పగించాలి. టీడీపీ సర్కారు హయాంలో కోడెల తనయుడి ఏజెన్సీకి కట్టబెట్టారు. పైగా ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్‌ అప్‌లోడ్‌ టెండర్‌ను తక్కువ ధర కోట్‌ చేసిన ఏజెన్సీని కాదనీ, ఎక్కువ ధర కోట్‌ చేసిన బ్లూఫ్లాంట్‌ ఏజెన్సీకి కోడెల ఒత్తిడి మేరకు అప్పగించారు. దీన్ని కోడెల శివరాం బినామీ మనోజ్‌ నిర్వహిస్తున్నాడు. ‘కే’ ట్యాక్స్‌ను తిరుపతిలో అధికారికంగానే వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement