న్యాయ వ్యవస్థ ఎంతో కీలకమైనది

లీగల్‌ (కడప అర్బన్‌) : సమాజంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకమైందని, పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సహకరిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ అన్నారు. జిల్లాలోని వివిధ కోర్టుల్లో మెజిస్ట్రేట్లుగా పనిచేస్తున్న అధికారులు, పోలీసు, ఇతర అధికారులకు కేసులకు సంబంధించి పరిష్కారం కోసం శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌ హాలులో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గత ఎన్నికల్లో నమోదైన కేసులు చాలావరకు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే రెండు సంవత్సరాల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయని, ఆ సమయం లోపు ఈ కేసులు పూర్తిగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు.

జిల్లా కలెక్టర్‌ బాబూరావునాయుడు మాట్లాడుతూ దేశంలోనే పటిష్టంగా ఉన్న న్యాయ వ్యవస్థ ముందు డేరా బాబా లాంటి వారు కూడా తలవంచిన సంఘటన దేశ వ్యాప్తంగా చెప్పుకోదగిందన్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ, రెవెన్యూ శాఖలు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనవని, ఇందుకోసం సమన్వయంగా పనిచేసుకుంటూ ప్రజలను శాంతియుత జీవనం గడిపేలా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పోలీసు శాఖకు ఎంతో సహకరిస్తోందని, భవిష్యత్తులో కూడా ఎంతో సహకరిస్తే తమవంతు కీలకమైన ఎర్రచందనం లాంటి కేసులను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు జడ్జి వీవీ శ్రీనివాసమూర్తి, పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు, న్యాయ సేవా«ధికార సంస్థ సెక్రటరీ యూయూ ప్రసాద్, అన్వర్‌బాషా, ఎస్‌.ప్రసాద్, వివిధ కోర్టులకు చెందిన మెజిస్ట్రేట్లు, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top