భంగపాటు! | JP Chairperson of the JP CEO is shattered in the transfer | Sakshi
Sakshi News home page

భంగపాటు!

Aug 25 2017 5:41 AM | Updated on Sep 17 2017 5:58 PM

భంగపాటు!

భంగపాటు!

జిల్లా పరిషత్‌ సీఈవో నగేష్, చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మిల మధ్య కొన్ని నెలలుగా నెలకొన్న విభేదాలు ప్రస్తుతం తారస్థాయికి చేరుకున్నాయి.

జెడ్పీ సీఈవో బదిలీ విషయంలో భంగపడ్డ జెడ్పీ చైర్‌పర్సన్‌
నెలరోజుల క్రితం సీఈవోను పంపించేస్తామని బహిరంగ ప్రకటన
తాజా  బదిలీలో నగేష్‌ పేరు లేకపోవడంతో డీలా
మంత్రులు, రాష్ట్ర అధికారులతో సుదీర్ఘ మంతనాలు
వినాయక చవితి అనంతరం రాజధాని వెళ్లే యోచనలో చైర్‌పర్సన్‌ వర్గం
ప్రస్తుతానికి సీఈవోదే  పైచేయి!


‘జెడ్పీ సీఈవో మాకు సహకరించడం లేదు. జిల్లా పరిషత్‌కు సంబంధించి తనకే సర్వాధికారాలు ఉండగా తాము చెప్పినట్లు చేయకుండా ప్రతి ఫైల్‌ను కలెక్టర్‌కు నివేదిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. అందువల్ల సీఈవో నగేష్‌ను పంపించేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే మంత్రులతో మాట్లాడాను. అవసరమైతే పైస్థాయి వారితో కూడా మాట్లాడుతా’’ అంటూ నెలరోజుల క్రితం జెడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. అయితే ఆమె మాట చెల్లలేదు. తాజాగా ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో శ్రీకాకుళం జిల్లా సీఈవో పేరు లేకపోవడంతో చైర్‌పర్సన్‌కు భంగపాటు తప్పలేదు. ప్రస్తుతానికి సీఈవోదే పైచేయి అని జెడ్పీ వర్గాలు భావిస్తున్నాయి.

శ్రీకాకుళం: జిల్లా పరిషత్‌ సీఈవో నగేష్, చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మిల మధ్య కొన్ని నెలలుగా నెలకొన్న విభేదాలు ప్రస్తుతం తారస్థాయికి చేరుకున్నాయి. సీఈవో తమ మాట వినడం లేదని చైర్‌పర్సన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీంతో అతన్ని ఎలాగైనా ఇక్కడ నుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని విలేకరుల సమక్షంలో ప్రకటించేశారు. ఇటువంటి ప్రకటన జిల్లా చరిత్రలో గతంలో ఎన్నడూ..ఎవరూ చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయభేదాలు వస్తే పైస్థాయి అధికారులకు, సంబంధిత శాఖ మంత్రులకు ఫిర్యాదు చేస్తామనో చెప్పారే తప్పా నేరుగా అధికారిని పంపించేస్తామని ప్రకటించిన దాఖలాల్లేవు.

అయితే చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. సీఈవోను పంపించేయడానికి ఏర్పాట్లు పూర్తయినట్టు చెప్పేశారు. ఇటువంటి ప్రకటన చేయగానే సీఈవో నగేష్‌ కూడా అప్రమత్తమయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడును కలిసి తనకష్ట సుఖాలను చెప్పుకున్నట్టు సమాచారం. అంతావిన్న ఆయన చైర్‌పర్సన్‌కు ఇష్టం లేన్నప్పుడు ఇక్కడ ఉండడం దేనికని అనడంతో సీఈవో కూడా బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ పక్క ప్రయత్నం చేస్తూనే ఆయనకు ఉన్న పరిచయడంతో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని కలిసి తన కష్టాలను చెప్పుకున్నారు. తనకు బదిలీ చేయాలని, అవసరమైతే మాతృ సంస్థకు పంపించాలని కూడా కోరినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.

ఇటువంటి నేపథ్యంలో సీఈవో నగేష్‌కు బదిలీ తప్పదని అందరూ భావించారు. అయితే పంచాయతీరాజ్‌ శాఖామంత్రి సీఈవోది తప్పులేదని భావించారో... మరేదైనా కారణమో తెలియకపోయినా గురువారం రాష్ట్రం లోని ఏడు జెడ్పీలకు సీఈవోలను నియమించగా, అందులో శ్రీకాకుళం లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి డీలా పడ్డారు. ఎంతో ఆర్భాటంగా చేసిన ప్రకటనకు విరుద్ధంగా పరిస్థితి ఉండడంతో తీవ్ర ఆవేదనతో గురువారం రోజంతా రాష్ట్ర మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో సుదీర్ఘంగా మం త్రాంగం జరిపినట్లు తెలియవచ్చింది.

అవసరమైతే వినాయ క చవితి తర్వాత రాజధానికి వెళ్లి సీఈవోకు బదిలీ అయ్యేవరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తనతో పాటు జెడ్పీటీసీ సభ్యులను కూడా తీసుకెళ్లి సీఈవో తీరు కారణంగా అభివృద్ధి కుంటుపడుతోందని చెప్పించాల ని కూడా వ్యూహరచన జరిపినట్లు బోగట్టా. సీఈవో మాత్రం తనకు ఎప్పుడు బదిలీ అయిన తక్షణం రిలీవ్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏదిఏమైనా ప్రస్తుతానికి మాత్రం ఈ బదిలీ వ్యవహారంలో సీఈవోదే పైచేయి అయ్యిందన్న వాదన జెడ్పీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. అలాగే తొందరపాటుతో జెడ్పీచైర్‌పర్సన్‌ బహిరంగ ప్రకటన చేశారన్న వాదన కూడా ఉంది. ఈ వ్యవహారం ఎటువంటి మలుపులకు దారితీస్తుందో రెండు, మూడు రోజుల్లో తేలనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement