జేసీ చిందులు.. శమంతకమణి కన్నీళ్లు

JC Diwakar Reddy Fires on Dalit female leader - Sakshi

ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద రెచ్చిపోయిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి 

దళిత సామాజికవర్గం మహిళా ప్రజాప్రతినిధులపై ఆగ్రహం 

అవతలికి పోండి అంటూ కసురుకున్న జేసీ 

మనస్తాపానికి గురై కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్సీ శమంతకమణి 

సాక్షి, అమరావతి: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, శింగనమల ఎమ్మెల్యే యామినీబాలపై చిందులు తొక్కారు. ఇష్టానుసారంగా మాట్లాడారు. వారిని కసురుకుని పక్కకు వెళ్లిపోవాలని బెదిరించారు. ముఖ్య నాయకులందరి ముందు తమను అవమానించడంతో శమంతకమణి ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం పక్కనున్న ప్రజావేదికలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. విశ్వసనీయవర్గాల సమాచారం.. టిక్కెట్ల ఖరారు కోసం ఆశావహులతో చంద్రబాబు చర్చలు జరుపుతున్న ప్రజావేదికలో జేసీ దివాకర్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి తదితరులు కూర్చుని ఉన్నారు. వారిని చూసిన శమంతకమణి, యామినీబాల మర్యాదపూర్వకంగా నమస్కారం చేసేందుకు దగ్గరకు వెళ్లగా జేసీ దివాకర్‌రెడ్డి వారిపై విరుచుకుపడ్డారు. ‘‘మీరేంటి ఇక్కడ.. అవతలికి పోండి’ అంటూ కసురుకున్నారు. ‘అన్నీ మీకే కావాలా’ అంటూ పెద్దగా అరుస్తూ రభస సృష్టించారు. పక్కనే ఉన్న సూర్యప్రకాశరెడ్డి సర్ది చెప్పినా వినకుండా రెచ్చిపోయి వారిద్దరిపై తిట్ల దండకం అందుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన శమంతకమణి, యామినీబాల పక్కకు వెళ్లిపోయారు. నమస్కారం పెడుతుంటే ఇలా అవమానిస్తారా అంటూ శమంతకమణి కన్నీళ్లు పెట్టుకున్నారు. 

దళిత సామాజికర్గం ప్రజాప్రతినిధులను అవమానిస్తారా?  
అధికార పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇలా రెచ్చిపోవడానికి శింగనమల టిక్కెట్‌ను మళ్లీ తనకే ఇవ్వాలని యామినీబాల కోరుతుండడమే కారణమని తెలిసింది. ఆ సీటును ఈసారి తాను సూచించిన శ్రావణికి ఇవ్వాలని జేసీ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసేందుకు వేచిచూస్తున్న సమయంలో వారు కనిపించడంతో అగ్గిమీద గుగ్గిలమై వారిని దూషించారు. జేసీ తీరుతో అక్కడున్న మిగిలిన నేతలంతా కంగుతిన్నారు. ఇదేం పద్ధతని గుసగుసలాడుకున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులను ఆయన ఇలా అవమానించడంపై అక్కడున్న నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

టీడీపీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ 
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, చీరాలకు చెందిన ఎడం బాలాజీ బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో రాధాకృష్ణకు పసుపు కండువా కప్పి చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. వంగవీటిది ఒక చరిత్రగల కుటుంబమని, ప్రజల కోసం పనిచేసిన కుటుంబమని అన్నారు. రిజర్వేషన్ల కోసం కాపుల పోరాటం సుదీర్ఘమైనదని, వారికి రిజర్వేషన్లు ఇస్తానని పాదయాత్రలో మాట ఇచ్చానని, అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని పేర్కొన్నారు. 

నేడు టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితా!  
వచ్చే ఎన్నికల్లో తలపడే టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితాను చంద్రబాబు గురువారం విడుదల చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి. 100 నుంచి 110 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి. ఇందుకోసమే గురువారం పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top