బీజేపీ చెవిలో పసుపు పువ్వు

Janasena Secret Deals With TDP In Local Body Elections - Sakshi

పొత్తును చిత్తు చేస్తూ టీడీపీతో జనసేన రహస్య ఒప్పందాలు 

కమలనాథులకు ఆదిలోనే చుక్కలు చూపుతున్న వైనం

స్థానిక ఎన్నికల్లో ‘సైకిల్‌’ ఎక్కుతున్న ‘గ్లాసు’

విస్తుపోతున్న రాజకీయ పరిశీలకులు

ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. కొన్నేళ్లు టీడీపీతో కలసి సాగిన జనసేన పార్టీ తెలుగుదేశాధీశుడి వెన్నుపోటు రాజకీయం ఒంట బట్టించుకున్నట్టుంది. అందుకే బీజేపీతో ఉన్న పొత్తును ఒకపక్క కొనసాగిస్తూనే నిస్సిగ్గుగా టీడీపీతో రహస్య ఒప్పందాలు చేసుకుంటోంది. పొత్తు ధర్మాన్నివిస్మరించిన జనసేన స్థానిక ఎన్నికల్లో ఎలాగోలా పరువు దక్కించుకోవాలని పడుతున్న తాపత్రయాన్ని చూసి
రాజకీయ విశ్లేషకులు సైతం నవ్వుకుంటున్నారు.

సాక్షి, రాజమహేంద్రవరం: అంతా అనుకున్నట్టే జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మధ్య రహస్య ఒప్పందం ఉందనే మాట సార్వత్రిక ఎన్నికల నుంచి ప్రతి నోటా వినిపిస్తున్నదే. ఇంతలో చంద్రబాబు టీడీపీ కీలక నేతలను ఒకరి తరువాత మరొకరిని బీజేపీలోకి పంపించారు. అనంతరం బీజేపీ, జనసేన మధ్య జరిగిన పొత్తు కూడా దీనిలో భాగమనే ప్రచారం కూడా నడిచింది. స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని బీజేపీ, జనసేన సంయుక్త ప్రకటన చేశాయి. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి నాదెండ్ల మనోహర్‌ కూడా ప్రకటించారు. పొత్తు కుదిరి రెండు నెలలు కూడా గడవకుండానే దాన్ని చిత్తుచేస్తూ జిల్లాలో చాలాచోట్ల జనసేనతో తెలుగుదేశం పార్టీ రహస్య ఒప్పందాలు చేసుకున్న పరిణామాలు చూస్తూ రాజకీయ విశ్లేషకులే విస్తుపోతున్నారు.

ఇంతకాలం టీడీపీ, జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందనే ప్రచారాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీల రహస్య పొత్తు బట్టబయలైంది. తెలుగుదేశం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో  పోటీచేసే సాహసం ఆ పార్టీ నాయకులు చేయలేకపోతున్నారు. కానీ ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని ఆ పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. టీడీపీ నుంచి పోటీకి కేడర్‌ వెనకడుగు వేస్తున్న క్రమంలో ఆ పార్టీ నేతలు జనసేనతో ఎక్కడికక్కడ ఒప్పందాలు చేసుకుంటున్నారు. 

రహస్య మంతనాలు..ఒప్పందాలు 
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి టీడీపీలో కేడర్‌ నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. త్రిసభ్య కమిటీలో ఉన్న చినరాజప్ప ఆదేశాల మేరకు కోనసీమలోని పలు మండలాల్లో జనసేన నాయకులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. సామర్లకోట మండలం గొంచాల, నవర ఎంపీటీసీ స్థానాలలో జనసేనకు టీడీపీ, జెడ్పీటీసీ స్థానంలో టీడీపీకి జనసేన మద్ధతు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలిసింది. అదే అంబాజీపేట మండలానికి వచ్చేసరికి 18 ఎంపీటీసీలకు గాను 12 టీడీపీకీ, ఆరు జనసేనకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొర్లపాటివారిపాలెం, మాచవరం, కోటివారి అగ్రహారం, ఇరుసు మండ, వాకలగరువు గ్రామాల్లో జనసేన పోటీచేసేలా పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. చదవండి: ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ..! 

ఆ మండలంలోని కొర్లపాటివారిపాలెం–1 ఎంపీటీసీ స్థానానికి  సుంకర సత్యవేణిబాలాజీ(టీడీపీ, జనసేన) ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు మంగళవారం స్థానిక గ్రామ సచివాలయంలో నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు అరిగెల బలరామ్మూర్తి, గణపతి వీరరాఘవులు, జనసేన నాయకులు సుంకర బాలాజీ, పేరాబత్తుల పెద సుబ్బరాజు కలిసి రావడం ద్వారా రెండు పార్టీల మధ్య రహస్య పొత్తు ఎలా నడుస్తోందో స్పష్టమవుతోంది. పి.గన్నవరం మండలంలో 22 ఎంపీటీసీ స్థానాలుంటే 9 స్థానాల్లో జనసేన, 13 స్థానాల్లో టీడీపీ పోటీచేసే లోపాయికారీ ఒప్పందం జరుగుతోంది. సంఖ్యపై స్పష్టత వచ్చినా ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది బుధవారంలోపు ఒక అంగీకారానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: బాబూ.. సైకిల్‌ తొక్కలేం!

చినరాజప్ప కనుసన్నల్లో.. 
‘ఆలూ లేదు చూలూ లేదు...అన్నట్టుగా ఉంది ఈ రెండు పార్టీల పరిస్థితి. ఇక్కడ మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు వస్తే రెండున్నర సంవత్సరాలు టీడీపీ, రెండున్నర సంవత్సరాలు జనసేన అధ్యక్ష స్థానాన్ని పంచుకోవాలని కలలుగంటున్నారు. మామిడికుదురు జెడ్పీటీసీ స్థానం విషయంలో ఈ రెండు పార్టీల మధ్య తాటిపాక సెంటర్‌లోని ఒక లాడ్జిలో నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఎంపీపీ జనసేనకు వదులుకుంటాం, జెడ్పీటీసీకి వచ్చేసరికి తమకు మద్దతు ఇవ్వాలని టీడీపీ ప్రతిపాదనకు జనసేన అంగీకరించడం లేదు. ఈ చర్చల సారాంశాన్ని ఇరుపార్టీల నేతలు టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడైన చినరాజప్పకు ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నారని సమాచారం. ప్రత్తిపాడు మండలం లింగంపర్తిలో ఒక మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడి మధ్య రహస్య ఒప్పందం కుదిరింది.

కొత్తపేట జనసేన సార్వత్రిక ఎన్నికల అభ్యర్థి బండారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన, బీజేపీ నాయకులు వాడపాలెంలో సమావేశమయ్యారు. కాజులూరు మండలంలో జనసేన జెడ్పీటీసీ అభ్యర్థికి టీడీపీ మద్దతు తెలపడానికి, ఎంపీటీసీలకు జనసేన టీడీపీకి మద్దతు తెలిపే విధంగా ఒప్పందం జరిగిందంటున్నారు. మల్కిపురం మండలం గూడపల్లి, కేసనపల్లి, రామరాజులంక, సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లి లంకలో అప్పనరామునిలంక, మోరిపోడు, అంతర్వేదికర, రాజోలు మండలం కాట్రేనిపాడు, కూనవరం, ములుకుపల్లి, చింతలపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ, జనసేన నాయకులు మంతనాలు జరుపుతున్నారు. సామర్లకోట మండలం గొంచాల, నవరలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థులకు టీడీపీ మద్దతు తెలుపుతున్నారు. 

అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెం–1 ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు చెట్టాపట్టాలు వేసుకుని వెళుతోన్న టీడీపీ, జనసేన నేతలు
ఇచ్చిపుచ్చుకోవడానికి చర్చోప చర్చలు 
అమలాపురం మున్సిపాలిటీలో 2,4,5,10 వార్డులలో టీడీపీ–జనసేన మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉంది. ఉప్పలగుప్తం మండలంలో ఎంపీటీసీ పదవులు ఇచ్చిపుచ్చుకునే విషయంపై మంగళవారం చర్చలు జరిగాయి. జెడ్పీ చైర్మన్‌ అభ్యర్ధిగా తన పేరు ప్రకటిస్తానంటే ఉప్పలగుప్తం మండలం నుంచి పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ముందుకు వచ్చారని సమాచారం. బిక్కవోలు మండలం తొస్సిపూడిలో జనసేన కార్యకర్త కర్రి శ్రీనివాసరావు సోమవారం రాత్రి టీడీపీలో చేరిన 24 గంటలు కూడా గడవకుండానే శ్రీనివాసరావు భార్య సత్యగౌరి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అయిపోయారు.

కడియం మండలంలో జనసేన–టీడీపీ  నాయకులు మద్దతుపై సమావేశమయ్యారు. మండలంలో ఉన్న  22 ఎంపీటీసీ స్థానాలకు 11ఎంపీటీసీలు జనసేన, 11 ఎంపీటీసీలు టీడీపీ ఇచ్చిపుచ్చుకునేందుకు మాటలు జరుగుతున్నాయి. ఇటీవల పార్టీ ముఖ్యనేతల సమావేశంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మనకు మద్ధతు ఇస్తోందని కార్యకర్తలు అధైర్యపడవద్దంటూ భరోసా కూడా ఇచ్చారు. టీడీపీ, జనసేన మధ్య రహస్య ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతుందనే విషయం చెప్పడానికి ఇన్ని ఉదాహరణలు చాలవా అంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top