కాకినాడలో వైఎస్సార్ సీపీ నాయకులపై దాడిచేస్తున్న జనసేన కార్యకర్తలు
పెన్షనర్స్ పేరడైజ్‌గా పిలిచే ప్రశాంత కాకినాడ నగరంలో జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టడంతో స్థానికేతరులు కాకినాడ వచ్చి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంపై దాడికి ప్రయత్నించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల దాడి ప్రయత్నాలను ప్రతిఘటించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కాకినాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసలు నగరంలో ఏ మూల ఏం జరుగుతుందా అనే ఆందోళన సర్వత్రా నెలకొంది.
సాక్షి, కాకినాడ: మూడు రాజధానుల ప్రతిపాదనపై శనివారం కాకినాడలో జరిగిన సంఘీభావ ర్యాలీలో పవన్‌కల్యాణ్ వ్యవహారశైలిని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి ఎత్తిచూపారు. మొదటి నుంచి పవన్‌కల్యాణ్ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో జనసే కార్యకర్తలు ఆదివారం తొలుత కాకినాడ భానుగుడి జంక్షన్‌లో రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఆ పార్టీ నాయకులు పంతం నానాజీ, కందుల దుర్గే‹Ù, ముత్తా శశిధర్ తదితరులు భానుగుడి సెంటర్‌లో బైఠాయించారు. భానుగుడి సెంటర్ నుంచి టూటౌన్ ఫ్లై ఓవర్ పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారంతా తిరిగి భానుగుడి సెంటర్‌కు చేరుకుని ఎమ్మెల్యే నివాసం ముట్టడిస్తామంటూ మూకుమ్మడిగా బయలుదేరారు. పోలీసులు ఆ సమయంలో జనసేన కార్యకర్తలను, నాయకులను అక్కడే కట్టడి చేసి ఉంటే వారు ఎమ్మెల్యే నివాసానికి సమీపం వరకూ వెళ్లే వారు కాదంటున్నారు.

జనసేన కార్యకర్తల దాడిలో గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న టేకేటి సారధి
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పంతం నానాజీ పిఠాపురం, పెద్దాపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వారిని దాడికి రెచ్చగొట్టారు. జనసేన నాయకులు, కార్యకర్తలు భాస్కర్‌నగర్‌లోని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి నివాసం సమీపాన ఉన్న వాటర్ ట్యాంక్ సెంటర్‌కు చేరుకున్నారు. వచ్చీ రాగానే కర్రలతో, రాళ్లతో ఎమ్మెల్యే నివాసంపై దాడికి ప్రయత్నించారు. వేర్వేరు వీధుల నుంచి గుంపులుగా చుట్టుముట్టి ఎమ్మెల్యే నివాసం వద్ద ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ పరిణామాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో వారు పరుగులు తీశారు. ఇంతలో పోలీసులు అల్లరిమూకలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ వ్యవహారం కాకినాడలో ఏడు గంటల పాటు టెన్షన్ వాతావరణానికి కారణమైంది. జనసేన కార్యకర్తల దాడి నేపథ్యంలో గాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ద్వారంపూడితో కన్నబాబు చర్చలు
జనసైనికుల దుందుడుకు చర్య నేపథ్యంలో వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనసేన నేతలకు టీడీపీ తెరవెనుక మద్దతునిచ్చి ఈ వ్యవహారాన్ని నడిపిస్తోన్న అంశంపై చర్చించారు. జనసేన ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా పార్టీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలని నేతలు సూచించారు.

జనసేన కార్యకర్తల దాడి దృశ్యాలను మంత్రి కన్నబాబుకు సెల్‌లో చూపిస్తున్న ఎమ్మెల్యే ద్వారంపూడి, ఫ్రూటీకుమార్
కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసానికి చేరుకుని ఆయనతో ఘటనపై చర్చించారు. పోలీసులు సమయానుకూలంగా స్పందించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఆందోళనకు దిగిన జనసేన నాయకులు, కార్యకర్తలను భానుగుడి సెంటర్‌లోనే కట్టడి చేసి ఉంటే ఎమ్మెల్యే ఇంటి సమీపం వరకూ జనసేన కార్యకర్తలు వచ్చి ఉండే వారే కాదు, ఇంతటి ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి ఎదురయ్యేది కాదంటున్నారు.

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో మాట్లాడుతున్న రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా
ఇటువంటి ఘటనలను ఖండించాలి
సంఘటనపై ఎమ్మెల్యే ద్వారంపూడి స్పందిస్తూ ప్రశాంతమైన కాకినాడ నగరంలో బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు విధ్వంసం సృష్టించడం బాధ కలిగిస్తోందన్నారు. కాకినాడ చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ తాను చూడలేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అన్నారు. అంతమాత్రానికే విమర్శలు చేసిన వారిపై బయట ప్రాంతాల వారిని తీసుకువచ్చి దాడులకు తెగబడటం చూస్తుంటే మనం ఎక్కడికి పోతున్నామో అర్థం కావడం లేదన్నారు. పవన్‌పై తాను చేసిన విమర్శలకు కులం కలర్ తీసుకు రావడం చూస్తుంటే కాపు సామాజికవర్గంలో పట్టులేని పంతం నానాజీ వంటి వారే ఒక పథకం ప్రకారం ఇది చేస్తున్నట్టుగా కనిపిస్తోందన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఎమ్మెల్యే కోరారు.

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కర్రలతో దాడిచేస్తూ రాళ్ల వర్షం కురిపిస్తున్న జనసేన కార్యకర్తలు
జీజీహెచ్‌లో బీభత్సం
►ఓ మహిళా రిపోర్టర్, ఇద్దరు డ్యూటీ నర్సులపై దాడి
కాకినాడ క్రైం: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించడంతో ఆరుగురు వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, వారు చేస్తున్న అరాచకాన్ని సెల్‌లో చిత్రీకరిస్తున్న ఓ మహిళా రిపోర్టర్‌పై దాడి చేసి గాయపరిచారు. అంతేకాకుండా మరో ఇద్దరు నర్సులు కూడా వీరి దాడిలో గాయపడ్డారు. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటిపై దాడికి దిగేందుకు ప్రయత్నించిన జనసేన కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను గాయపర్చారు. గాయపడిన వ్యక్తులు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందేందుకు వచ్చారు. అదే సమయంలో జనసేన కార్యకర్తలు కాకినాడ జీజీహెచ్‌కు నాలుగు కారుల్లో వచ్చి చికిత్స పొందేందుకు అత్యవసర విభాగంలో మంచాలపై పడుకున్న వారిని ఇష్టానుసారంగా కొట్టారు. ఆ ఘటనను చిత్రీకరిస్తున్న ఓ మహిళా రిపోర్టర్ జుత్తుక జ్యోతిపైన జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన డ్యూటీ నర్సులను కొట్టారు.

జనసేన కార్యకర్తలను అరెస్టుచేసి వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు
ఈ సమయంలో వైఎస్సార్ సీపీకి చెందిన ముగ్గురు కార్యకర్తల సెల్‌ఫోన్లు తీసుకెళ్లిపోయారు. అదే సమయంలో జనసేనకు చెందిన ఓ మహిళ నాయకురాలు మహిళా రిపోర్టర్ చేతిని వెనక్కి వంచేసీ, తలను గోడకు ఢీకొట్టింది. దీంతో రిపోర్టర్ జ్యోతి కింద పడిపోయారు. దీంతో అక్కడే ఉన్న కొందరు ఆమెను ఎమర్జన్సీ వార్డులో చేర్చారు. జనసేన కార్యకర్తలు, నాయకులు చేసిన దాడిలో గాయపడిన వారిలో టేకేటి సారధి, వాసుపల్లి కృపానందం, పేర్ల విజయ్, అర్జల సింహాచలం, వాసుపల్లి ఏసుపాదం, పాడిశెట్టి గోపీలు ఉన్నారు. వీరందరూ కాకినాడ జీజీహెచ్ ఎమర్జన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. అవుట్‌పోస్టు పోలీసులు వచ్చి వీరి వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేశారు. జనసేన కార్యకర్తలు సుమారు 200 మందికి పైగా పాల్గొని ఎమర్జన్సీ వార్డులో వీరంగం సృష్టించారు. ఎవరు ప్రశ్నించినా వారు కొట్టేందుకు ప్రయత్నించారు.

ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు
విలేకరులు ఘటనా స్థలానికి చేరుకొని వారు చేస్తున్న వీరంగాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయగా, విలేకర్లపై దాడికి యత్నించారు. విషయం తెలిసిన వెంటనే వన్‌టౌన్, త్రీటౌన్, టూటౌన్‌లకు చెందిన పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని జనసేన నాయకులను ఆసుపత్రి ఎమర్జన్సీ వార్డు నుంచి బయటకు పంపించి గొడవను సర్దుబాటు చేశారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రౌడీల్లా వ్యవహరించి వైఎస్సార్ సీపీ కార్యకర్తలనే కాకుండా డ్యూటీ నర్సులను, మహిళా రిపోర్టర్‌పై దాడికి దిగడాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు. వీరంగం సృష్టించి పలువురిని గాయపర్చిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించేందుకు ఆసుపత్రిలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి, వాటి ఆధారంగా కేసులు నమోదు చేయనున్నారు.


