జననేతకు నీరాజనం

జననేతకు నీరాజనం - Sakshi

  • మంగళహారతులతో స్వాగతం

  •  సమస్యలు చెప్పుకున్న చిత్తూరువాసులు

  •  ముగిసిన మూడోవిడత జగన్ యాత్ర

  •  

    సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన మూడోవిడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రకు ఎనిమిదవ రోజు సైతం విశేష స్పందన లభించింది. జననేతకు దారి పొడవునా మహిళలు హారతులు పట్టగా, బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో మేళతాళాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఉదయం చిత్తూరు సమన్యకర్త ఏఎస్.మనోహర్ ఇంటి నుంచి బయలుదేరిన జగన్‌మోహన్‌రెడ్డికి బైక్‌ర్యాలీతో ఆహ్వానం పలికారు. పాతకలెక్టరేట్ వద్దకు చేరుకున్న ఆయనకు జిల్లా మహిళా కన్వీనర్ గాయత్రీ దేవి, పలువురు మహిళలతో కలసి హారతులు ఇచ్చారు.



    ఆయన దుర్గమ్మ గుడికి వెళ్లి అభిషేకం, అర్చనలో పాల్గొన్నారు. సమీపంలోని శివాలయం సిబ్బంది మేళతాళాలతో స్వాగతం పలికారు. ఓటి చెరువు, వల్లియప్పనగర్‌లో మహిళలను జననేత  పలకరించారు. విజయ డెయిరీ వద్ద పాడిరైతుల ఉద్యమకారుడు వెంకటాచలం నాయుడు ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. విజయ డెయిరీని ప్రారంభించాలని కోరారు. గతంలో వైఎస్ తమకు దీనిపై మాట ఇచ్చారని అనగానే, ఆ విషయం తన దృష్టిలో ఉందని, తమ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టరేట్ మీదుగా రెడ్డిగుంట చేరుకోగా మహిళలు స్వాగతం పలికారు. గంగాసాగరంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.



    అనుప్పల్లె క్రాస్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, అంజలి ఘటించారు. మాపాక్షి క్రాస్ వద్ద రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. సమీపంలోని చీలాపల్లె క్రాస్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొత్తపల్లెలో బాణ సంచా పేల్చి స్వాగతం పలికారు. గుడిపాల వద్ద భారీ ఎత్తున టపాసులు పేల్చారు. జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ బహిరంగసభలో ప్రసంగించారు. గ్రీమ్స్‌పేట మీదుగా కణ్ణన్ కాలేజీ చేరుకోగా డాక్యుమెంట్ రైటర్లు ఆయనను కలుసుకున్నారు. ఈ-సేవ వచ్చిన త రువాత తమకు పనులు లేకుండా పోయాయని, తమకు జీవన భృతిలేదని వారు తెలిపారు. ఆర్‌టీసీ ఒకటవ డిపో ఉద్యోగులు కూడా కలుసుకుని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.



    ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అక్కడి నుంచి దర్గా సర్కిల్‌మీదుగా, ఎమ్మెస్సార్ సర్కిల్ చేరుకుని, తరువాత పీసీఆర్ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, సమన్వయకర్తలు ఏఎస్. మనోహర్, ఆర్‌కే. రోజా, డాక్టర్ సునీల్‌కుమార్, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మహిళా కన్వీనర్ గాయత్రీ దేవి, యువజన కన్వీనర్ ఉదయకుమార్, పార్టీ నాయకులు గాంధీ, తలుపులపల్లి బాబు రెడ్డి, పూర్ణం, బాబ్‌జాన్, వై.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

     

    ముగిసిన మూడోవిడత యూత్ర

     

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల ఐదో తేదీన జిల్లాలో చేపట్టిన మూడో విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర ఆదివారంతో ముగిసింది. తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభంకాగా, మదనపల్లె మీదుగా, పీలేరు నియోజకవర్గం చేరుకున్నారు. పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. మూడో విడత యాత్ర ముగించుకుని ఆదివారం సాయంత్రం ఆయన చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరారు. సంక్రాంతి తరువాత జిల్లాలో నాలుగోవిడత యాత్ర ప్రారంభమవుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top