
అమర జవాన్లకు అంతిమ వీడ్కోలు
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
గ్రామాల్లో ఉద్విగ్నభరిత వాతావరణం
కన్నీటి నివాళులర్పించిన వేలాదిమంది
జమ్మూ/ముజఫర్‌నగర్: దేశంకోసం ప్రాణాలర్పించారన్న గర్వం ఓవైపు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న బాధ మరోవైపు.. సరిహద్దు వెంబడి పాక్ కాల్పుల్లో మృతి చెందిన సైనికుల అంత్యక్రియల సందర్భంగా స్వగ్రామాల్లో కనిపించిన ఉద్విగ్నభరిత దృశ్యమది. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, కన్న తల్లిదండ్రులే కాదు.. గ్రామాలకు గ్రామాలు దుఃఖ నదులయ్యాయి. వేలాది మంది అమర జవాన్లకు కన్నీటి నివాళులర్పించారు. ‘అమర్ రహే’ అంటూ నినదించారు.
కాల్పుల్లో ఆరి్నయా సెక్టార్‌లోని త్రివా గ్రామానికి చెందిన రైఫిల్‌మెన్ సునీల్ కుమార్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. 4జేకే లైట్ ఇన్‌ఫాంటరీ రెజిమెంట్‌లో సేవలందిస్తున్న సునీల్.. ఆర్‌ఎస్‌పుర సెక్టార్‌లో ఉండగా శనివారం కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. 25 ఏళ్ల సునీల్ కుటుంబానిది మిలిటరీ నేపథ్యం. తండ్రి గతంలో పనిచేశారు.
ప్రస్తుతం ఇద్దరన్నలు సాయుధ దళాల్లో పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితో దేశంకోసం ఆర్మీలో పనిచేయాలని చిన్నతనం నుంచే స్ఫూర్తిని పెంచుకున్న సునీల్.. దేశ సేవలోనే ప్రాణాలర్పించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్‌కు అతని స్వగ్రామంలో కన్నీటి వీడ్కోలు పలికారు. పవన్.. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో షెల్లింగ్‌లో గాయపడి మృతి చెందారు.
అతని కొడుకు చితికి నిప్పటించగా.. వేలాది మంది ‘సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అమర్ రహే’, ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అని నినాదాలు చేశారు. కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న సర్జెంట్ సురేంద్రకు రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలోని స్వగ్రామంలో, ఆంధప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ముడావత్ మురళీనాయక్‌కు అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అర్‌ఎస్‌పురా సెక్టార్‌పై డ్రోన్ దాడిలో మరణించిన బీఎస్‌ఎఫ్ ఎస్‌ఐ మహమ్మద్ ఇంతియాజ్‌కు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరీ నివాళులర్పించారు. అనంతరం పారి్థవ దేహాన్ని స్వస్థలం బీహార్‌కు తరలించారు.
అధికారులు, సామాన్యులు సైతం..
పాక్ శనివారం జరిపిన షెల్లింగ్‌లో సామాన్య పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. తన ఇంట్లో షెల్ పడటంతో రాజౌరీ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కమిషనర్ రాజ్‌కుమార్ థప మృతి చెందారు. జమ్మూ శివార్లలోని రూప్‌నగర్‌లో ఉన్న అతని నివాసానికి పార్థివ దేహాన్ని తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్‌కుమార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజౌరీ జిల్లాలో జరిగిన షెల్లింగ్‌లో 35 ఏళ్ల మహమ్మద్ సాహిబ్, అతని మేనకోడలు రెండేళ్ల అయేషా మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారి స్వగ్రామం ఖాయ్‌ఖేడిలో వందలాది మంది కన్నీటివీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.