తిరుమలపై దుష్ప్రచారం వెనుక టీడీపీ ఐటీ విభాగం

IYR Krishna Rao Letter to CM Chandrababu - Sakshi

సీఎంకు ఐవైఆర్‌ కృష్ణారావు లేఖ

సాక్షి, అమరావతి: కొన్ని ప్రసార మాధ్యమాలు టీటీడీని కేంద్రం స్వాధీనం చేసుకుంటోందంటూ తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాయని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు మండిపడ్డారు. అంతేకాకుండా కేంద్రం కుట్రలో తాను భాగస్వామినంటూ చేసిన ప్రచారం వెనుక టీడీపీ ఐటీ విభాగం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి నారా లోకేశ్‌ నేతృత్వంలో పనిచేసే ఐటీ విభాగంలోని కొందరు కొన్ని వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారని దుయ్యబట్టారు.

ఇలా చేయడాన్ని తప్పుపడుతూ శుక్రవారం  చంద్రబాబుకి ఐవైఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయడం సరికాదని, టీడీపీ ఇటువంటివాటికి కేంద్ర బిందువు కాకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. 2011లో టీటీడీ ఈవోగా పనిచేస్తున్న సమయంలో తాను రాసిన లేఖ ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందంటూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఐవైఆర్‌ ఖండించారు. అపోహలు ప్రజల్లోకి వెళ్లడానికి చంద్రబాబు కారణమయ్యారంటూ ఆరోపించారు. 

చట్టంలో మార్పులు తీసుకురండి
1958నాటి పురాతన కట్టడాల చట్టం ప్రకారం.. ఏదైనా కట్టడాన్ని పరిరక్షిత కట్టడంగా లేదా జాతీయ ప్రాధాన్యం ఉన్న కట్టడంగా నిర్ణయిస్తే ఆ కట్టడం పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లి జీవకళ తప్పిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ చట్టంలో సవరణలు చేయాల్సిందిగా సీఎంకి సూచించారు. కట్టడాల్లో శాశ్వత మార్పులూచేర్పులూ చేయాలనుకుంటే పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి చేస్తూ చట్టాన్ని సవరిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top