
‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఐవైఆర్ కృష్ణారావు, మడభూషి శ్రీధర్, ఈఎస్ శర్మ, వీవీ రమణమూర్తి, బొలిశెట్టి సత్య తదితరులు
సాక్షి, విశాఖపట్నం: అధికార వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలూ అభివృద్ధిలోకి వస్తాయని, అప్పుడు రాజధానికి అంతగా ప్రాధాన్యం ఉండదని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. రాజధాని నిర్మాణ వ్యామోహమే ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. ఆదివారం విశాఖపట్నంలో ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర సమాచార కమిషనర్ మడభూషి శ్రీధర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర మాజీ కార్యదర్శి డాక్టర్ ఈఎస్ శర్మ, సీనియర్ జర్నలిస్టు వీవీ రమణమూర్తి, సామాజిక వేత్త బొలిశెట్టి సత్య తదితర ప్రముఖులు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
రాజధానికి మహానగరం అవసరం లేదన్న ఐవైఆర్.. ఏపీలో పద్మశ్రీ అవార్డుల నుంచి జన్మభూమి కమిటీల దాకా అన్ని విషయాల్లో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని, రాజధాని విషయంలోనూ అదే జరిగిందని గుర్తుచేశారు. విశ్రాంత అధికారి శర్మ మాట్లాడుతూ.. రాజధానుల కోసం గతంలో ఎన్నడూ నిధులు కేటాయించిన దాఖలాలులేవని, మాయాబజార్, బాహుబలి సెట్టింగ్స్ మాదిరి అమరావతిని చేయాలనుకుంటున్నారని, అసలు రాజధానికి హంకుల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని అన్నారు.