ఏళ్లతరబడి అక్కడే... | Sakshi
Sakshi News home page

ఏళ్లతరబడి అక్కడే...

Published Thu, Jul 18 2019 12:45 PM

irregularities In Bobbili Irrigation office - Sakshi

ప్రభుత్వం పాలనలో పారదర్శకత కోరుకుంటోంది. అన్ని విభాగాల్లోనూ ప్రక్షాళన చేపట్టాలని ఆదేశిస్తోంది. జిల్లాస్థాయి అధికారులు సైతం అక్రమాలకు అవకాశం లేకుండా పనులు చేపట్టాలని పదేపదే హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం సాధారణ బదిలీలు చేపట్టి కొత్తగా పాలనకు తెరతీయాలని యోచించారు. కానీ కొందరు అధికారుల చర్యలతో ఈ వ్యవహారం కాస్తా విమర్శలకు తావిస్తోంది. జలవనరులశాఖలో జరిగిన బదిలీలు అసంతృప్తులకు దారితీసింది. ఏళ్లతరబడి ఇక్కడే తిష్టవేసుకున్నా వారిని కదపకపోవడం చర్చనీయాంశమైంది. చివరకు దీనిపై స్పందనలో ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరాయి.

సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : జల వనరుల శాఖలో జరిగిన బదిలీల్లో అసంతృప్తులు బయటపడుతున్నాయి. రాష్ట్రమంతా పారదర్శకతకు పెద్ద పీటవేస్తోందని ప్రభుత్వాన్ని కొనియాడుతున్నా కొందరి అధికారుల అలసత్వంతో ఇంకా పాత వాసనలు వదలడం లేదన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. బొబ్బిలిలో ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయం ఉంది. ఈ సర్కిల్‌లో ఎస్‌ఈగా ఇటీవలే చేరిన కె.రాంబాబు ఆధ్వర్యంలో రెండు జిల్లాల్లోని జలవనరుల శాఖ అధికారులు, సిబ్బందికి బదిలీలు జరిగా యి. శ్రీకాకుళం జిల్లా బదిలీల కు కూడా ఈయనే అడ్మినిస్ట్రేవ్‌ కంట్రోల్‌ కనుక రెండు జిల్లాల్లో బదిలీలు ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఈ నెల 5 నాటికి బదిలీలు పూర్తి కావాల్సిఉన్నా మరో ఐదు రోజుల పాటు ఉన్నతాధికారులు గడువును పొడిగించారు. అయినా బదిలీల్లో నిబంధనలను పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

20 ఏళ్లుగా అవే సీట్లలో ...
ఇరిగేషన్‌ సర్కిల్‌లోని పలువురు అధికారులు చాలా ఏళ్లుగా అక్కడే పాతుకుపోయినా బదిలీలు జరగడం లేదు. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని బదిలీ చేయాల్సి ఉంది. దీనికి దొరకకుండా ఉండేందుకు ఈ బదిలీలకు ముందు కొన్ని రోజుల పాటు ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకుని... తరువాత అక్కడినుంచి వచ్చేస్తూ... కొత్తచోటుగా చూపించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 

ఆరోపణలు వీరిపైనే..
బొబ్బిలి ఇరిగేషన్‌ సర్కిల్‌లో టెక్నికల్‌ అధికారి శ్రీనివాసరావు, పర్యవేక్షకురాలు భాగ్యలక్ష్మితో పాటు ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు దాదాపు ఆరు నుంచి పదిహేను సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. బదిలీలకు ముందు ఇతర ప్రాంతాలకు ఎలాగోలా బదిలీచేయించుకోవడం మళ్లీ ఇక్కడకు వచ్చేస్తూ... కొత్తవారికి మాత్రం అవకాశం కల్పించడం లేదని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. వీరికి ఎస్‌ఈ అడ్మినిస్ట్రేషన్‌ విధానంలో అవసరమున్న సిబ్బంది అంటూ డిటెన్షన్‌ ఇచ్చారు. ఇక్కడకు బదిలీ కోసం వచ్చేందుకు సింగిల్‌ ఆప్షన్‌ ఇచ్చినా తన భర్తకు బదిలీ అవకాశం ఇవ్వలేదని ఎ.సుధారాణి అనే టీచర్‌ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. 

చేతులు మారుతున్న కాసులు?
బదిలీల కోసం భారీగానే కాసులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కిళ్లలో జరుగుతున్న బదిలీల్లో ఎన్నాళ్లుగానో పాతుకుపోతున్నవారిని వదిలిపెట్టడం ఈ ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన సుధారాణి తన భర్తకు స్జౌజ్‌ ప్రాతిపదికన బొబ్బిలిలో పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉన్నా... ఈ మేరకు సింగిల్‌ ఆప్షన్‌ ఇచ్చినా పార్వతీపురం బదిలీ చేయడం దారుణమని పేర్కొన్నారు. బదిలీలకు చేతులు మారిన డబ్బులు తామూ ఇవ్వగలమని సాక్షాత్తూ స్పందన అధికారులవద్దే ఆమె వ్యాఖ్యానించడం విశేషం. సెక్షన్‌ కార్యాలయంలో ఇతరుల హవా నడవకుండా ఉండేందుకు కొందరు కావాలనే బదిలీల్లో రాజకీయ జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 

Advertisement
Advertisement