బెజవాడ ట్రాఫిక్‌కు విముక్తి!

Introducing Adaptive Traffic Control System In Vijayawada Junctions - Sakshi

సిగ్నలింగ్‌ వ్యవస్థలో భారీ మార్పులు

కూడళ్ల వద్ద రద్దీ  నియంత్రణకు టైమర్లు

సీసీ కెమెరాలు, కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షణ

బెజవాడ నగరంలో పద్మవ్యూహంలా మారిన ట్రాఫిక్‌కు విముక్తి లభించబోతోంది. ఇరుకు రోడ్లు, వెల్లువెత్తుతున్న వాహనాల రద్దీతో విజయవాడ ట్రాఫిక్‌ రోజురోజుకూ నరకంలా మారింది. ప్రధానమైన జంక్షన్లలో నిత్యం ట్రాఫిక్‌తో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని ఛేదించడానికి నగర పోలీసులు నిత్యం నానా తంటాలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పోలీసు అధికారులు సాంకేతిక సాయం తీసుకోబోతున్నారు. ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐటీఎంఎస్‌) ప్రాజెక్ట్‌ ద్వారా ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలో భారీ మార్పులు చేయబోతున్నారు. 

సాక్షి, అమరావతి : విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పాత సిగ్నలింగ్‌ వ్యవస్థ బదులు ప్రయోగాత్మకంగా 17 కూడళ్లలో ఏటీసీఎస్‌ (అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌) ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో దాదాపు 180 కూడళ్లు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా తొలి దశలో ప్రకాశం బ్యారేజీ నుంచి బెంజి సర్కిల్‌ వరకు వారధి నుంచి ఎయిర్‌పోర్టు వరకు వినాయక టెంపుల్, గద్ద బొమ్మ, ప్రకాశం విగ్రహం, ఓల్డ్‌ బస్టాండ్, బందర్‌ లాకులు, గోల్డెన్‌ పెవిలియన్, రాఘవయ్య పార్క్, రాజ్‌భవన్, స్టేట్‌ గెస్ట్‌ హౌస్, డీసీపీ బంగ్లా, ఆర్టీఏ సర్కిల్‌తోపాటు బాలాజీ నగర్, స్క్రూ బ్రిడ్జి, బెంజి సర్కిల్, రామవరప్పాడు రింగ్‌ రోడ్, న్యూ ఆటోనగర్‌ కూడళ్లను ఏటీసీఎస్‌కు అనుసంధానం చేస్తారు.

ఆయా కూడళ్లలో వాహన చోదకులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు తక్కువ సమయంలో నలువైపులా వాహనాలు వేగంగా వెళ్లేలా చర్యలు చేపట్టనున్నారు. సమీకృత ఇంటెలిజెంట్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ద్వారా అన్ని సిగ్నళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారు. ఇవి కేంద్రీకృత నియంత్రిత విధానం ద్వారా పని చేస్తాయి. వీటికి ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇవి వాహనాలను లెక్కించి, వాటిని వర్గీకరించి సమాచారాన్ని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి పంపిస్తాయి. వాహనాల రద్దీని బట్టి సిగ్నల్‌ పడుతుంది. ఎక్కువ వాహనాలు ఉండే మార్గంలో ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడానికి అధిక సమయం ఆకుపచ్చ లైట్‌ వస్తుంది. సిగ్నలింగ్‌ వ్యవస్థ అంతా సౌరశక్తితో పని చేస్తుంది. 

ఇక నిరీక్షణ ఉండదు!.. 
పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి బెంజి సర్కిల్‌ వరకు దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. పాత పద్ధతిలో సిగ్నల్స్‌ ఒకదానితో మరొకటి సంబంధం లేదు. దీనివల్ల ఈ కొద్ది దూరానికే ఒక్కొక్క సిగ్నల్‌ వద్ద చాలా సమయం నిరీక్షించాల్సి వస్తోంది. కొత్త వ్యవస్థ వస్తే ఎక్కడా ఆగాల్సిన పని లేదు. అత్యవసర వాహనాలకు ప్రత్యేక ట్యాగ్‌లు బిగిస్తారు. ఈ వాహనాలు వచ్చే సమయంలో ఆ మార్గంలో అకుపచ్చ లైట్లు వెలుగుతాయి. సిగ్నళ్ల స్తంభాలకు బిగించిన కెమెరాలు వాహనాల నెంబరు ప్లేట్లను గుర్తిస్తాయి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే నేరుగా చలానా జారీ అవుతుంది. వీటికి సెన్సార్లు ఉంటాయి. అలాగే ముఖ్యమైన కూడళ్లలో పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ఉంటుంది. ఎల్‌ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. వీటిపై ట్రాఫిక్‌ నిబంధనలు, ముఖ్యమైన సూచనలు, వాతావరణం, తదితర వివరాలు వస్తుంటాయి.

అత్యవసర వాహనాలకు గ్రీన్‌ సిగ్నల్‌.. 
ఈవీపీ (ఎమర్జెన్సీ వెహికల్‌ ప్రయార్టీ) : ఇప్పటి వరకు అత్యవసర సమయాలు, అంబులెన్స్‌లు వెళ్లేటప్పుడు, వీవీఐపీల రాకపోకల సమయంలో మాన్యువల్‌ విధానాన్ని ట్రాఫిక్‌ పోలీసులు పాటించేవారు. ఆయా వాహనాల రాకపోకల సమయాల సమాచారం తెలియగానే... ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ టైమర్లను నిలిపిసేవారు. ఆ తర్వాత మాన్యువల్‌ పద్ధతిలో రాకపోకలను నియంత్రించేవారు. ఈవీపీ పద్ధతిలో ఇకపై మాన్యువల్‌ విధానం అవసరం ఉండబోదు. అంబులెన్స్, ఫైర్‌ ఇంజిన్స్‌ వస్తున్న సమయంలో ఆ మార్గంలో ఆకుపచ్చ లైట్లు వెలుగుతాయి. 

ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం.. 
విజయవాడ నగర ట్రాఫిక్‌ సమస్యకు ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమే సరైన పరిష్కారం. ఈ ప్రాజెక్టు పూ ర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ప్రజలకు ఎం తో మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు సా కారం కావడానికి చాలా కష్టపడ్డాం. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఏటీసీ ఎస్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను అమలు చేస్తాం. – సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, పోలీసు కమిషనరు, విజయవాడ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top