ఆ కాలేజీల హాస్టళ్లకు అనుమతుల్లేవ్‌

Inter students suicides: IF Narayana or sri chaitanya also no one should hava to tolerate says ganta

సాక్షి, అమరావతి: నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు ఎలాంటి అనుమతుల్లేకుండా అధిక సంఖ్యలో హాస్టళ్లు నడుపుతున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఈ విధంగా అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న 158 హాస్టళ్లకు నోటీసులు జారీ చేసి.. మూడు నెలల గడువిచ్చినట్లు తెలిపారు. శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి గంటా మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలు, ఒత్తిడి, ప్రేమ వైఫల్యాలే కారణమని చెప్పారు. ఇందులో ఇంటర్‌ బోర్డు వైఫల్యం కూడా ఉందన్నారు.

కాలేజీలను మూసివేయడం, యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు పెట్టడం వంటివి సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఈ నెల 16న రాష్ట్రంలోని అన్ని కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలను ఈ సందర్భంగా స్పష్టం చేస్తామన్నారు. అన్ని కాలేజీల యాజమాన్యాలు.. చక్రపాణి కమిటీ సూచనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా, పదో తరగతి మాదిరిగానే ఇంటర్‌లో కూడా గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టే యోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20 తర్వాత ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లతో కలసి జిల్లాల వారీగా పర్యటిస్తానని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ త్వరలో జీవో జారీ చేస్తామన్నారు.  

6,500 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు 
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15న 6,500 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. ఈ కార్యక్రమం విజయవాడలో జరుగుతుందని చెప్పారు.   
  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top