జుట్టు మందు వికటించి ఇంటర్‌ విద్యార్థిని మృతి  | Inter Girl Died In Kurnool District | Sakshi
Sakshi News home page

జుట్టు మందు వికటించి ఇంటర్‌ విద్యార్థిని మృతి 

Aug 13 2019 8:48 AM | Updated on Aug 13 2019 9:27 AM

Inter Girl Died In Kurnool District - Sakshi

విద్యార్థిని మౌనిక 

సాక్షి, ఎమ్మిగనూరు : వైద్యం వికటించి ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని హరిజనవాడకు చెందిన కదిరికోట నరసన్న, రామేశ్వరమ్మ కుమార్తె మౌనిక(19) స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సవరం చదువుతోంది. తల జుట్టు రాలుతుండటంతో పాటు, వెంట్రుకలు ఒత్తుగా రావడానికి శివ సర్కిల్‌లోని పల్లవి పాలీ క్లినిక్‌ మెడికల్‌షాప్‌కు కర్నూల్‌ నుంచి వస్తున్న డాక్టర్‌ శరత్‌చంద్ర వద్ద 2 నెలల క్రితం చూపించుకుంది. డాక్టర్‌ ఇచ్చిన మందులు వాడటంతో శరీరంపై బొబ్బలు వచ్చాయి. ఇదే విషయాన్ని మెడికల్‌ షాప్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు.

డాక్టర్‌ను రప్పించాలని లేదా ఫోన్‌లో విషయం చెప్పాలని వేడుకున్నారు. అయినా వారు తొందర పడొద్దని, తగ్గిపోతుందని, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి ఇంటికి పంపేశారు. మూడు రోజులుగా మెడికల్‌షాప్‌ వద్దకు తిరుగున్నా పట్టించుకోకపోవటంతో ఆదివారం రాత్రి విద్యార్థినికి ఆరోగ్యం విషమించి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో సోమవారం మెడికల్‌ షాప్‌ దగ్గకు చేరుకొని ఆందోళనకు దిగారు. మెడికల్‌ షాప్‌కు తాళం వేసి, పోలీసుకుల సమాచారం ఇచ్చారు. డాక్టర్‌పైనా, మెడికల్‌ షాపు నిర్వాహకులపైనా చర్యలు తీసుకోవాలని మృతురాలు కుటుంబ సభ్యులు కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement