
వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర పోరు: రామ్‌మాధవ్
భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ స్వతంత్ర పోరుకు సిద్ధమవుతోందని ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి వారణాసి రామ్‌మాధవ్ స్పష్టం చేశారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ స్వతంత్ర పోరుకు సిద్ధమవుతోందని ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి వారణాసి రామ్‌మాధవ్ స్పష్టం చేశారు. పంచాయతీ, సహకార, మున్సిపల్, కార్పొరేషన్ సహా సాధారణ ఎన్నికలకు అన్ని స్థాయిల్లోనూ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం రాత్రి పార్టీ నూతన సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ.. చాయ్‌వాలా ప్రధాని అవగా, సాధారణ ఫొటోగ్రాఫర్ అయిన తాను మంత్రినవడమే బీజేపీ సామాన్యుల పార్టీ అనడానికి నిదర్శనమన్నారు. వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో గాడితప్పిన పాలనా వ్యవస్థను మోదీ గాడిలో పెడుతున్నారని పేర్కొన్నారు.
కేంద్ర మాజీ మంత్రులు కావూరి సాంబశివరావు, యూవీ కృష్ణంరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు విష్ణుకుమార్‌రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాల్గొన్నారు.