మహిళలపై నేరాల్లో మనం నంబర్‌ 1

Increased crime on women in the state says Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: మహిళలపై జరుగుతున్న నేరాల్లో మన రాష్ట్రం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండటం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై మానభంగాలు, టీజింగ్, ఇంట్లో వేధింపులు పెరిగాయని చెప్పారు. సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రికి ఆంధ్ర ప్రదేశ్‌ హోంగార్డులు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. అర్ధరాత్రి మహిళలు సురక్షితంగా ఇంటికి రావాలని మహాత్మా గాంధీ అన్నారని, స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా ఆచరణలో ఇప్పటికీ సాధించుకోలేకపోయామని పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలను నిరోధించడానికి కమిటీ వేశామని, భవిష్యత్తులో ఏ ఆడబిడ్డనైనా మానభంగం చేసే దుర్మార్గులకు అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మహిళలపై వేధిం పుల కేసుల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల ఆస్తులను పరిరక్షించేందుకు లా అండ్‌ ఆర్డర్‌ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని, ప్రతినెలా పోలీస్‌ స్టేషన్‌ల వారీగా క్రైమ్‌ బులెటిన్‌ విడుదల చేయాలని ఆదేశించారు. 

హోంగార్డులకు పక్కా ఇళ్లు 
రాష్ట్రంలో హోంగార్డులకు కోరుకున్న చోట, వారు ఉండే చోటే పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను పాదయాత్ర చేసినప్పుడు హోంగార్డులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ధర్మపోరాటానికి శ్రీకారం చుట్టానని, రాష్ట్రానికి న్యాయం చేసే వరకూ కేంద్రాన్ని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. తాము కట్టే పన్నుల నుంచి ఇన్సెంటివ్‌గా కేంద్రం డబ్బులు ఇస్తే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టుకుంటామని తెలిపారు. 

హోంగార్డులవి చిన్న బతుకులు: ఏఆర్‌ అనూరాధ 
చాలీచాలని జీతాల నుంచే తమ ఖర్చులకు కొంత ఉంచుకుని ఎక్కడో ఉన్న తమ కుటుంబాలకు నగదు పంపే చిన్న చిన్న బతుకులు హోంగార్డులవని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఆర్‌ అనూరాధ ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డులు తాము విధులు నిర్వహించే పట్టణాల్లో అద్దెలు భరించలేక, గ్రామాల్లో నివాసం ఉంటూ ఇబ్బందులు పడుతుంటారని అన్నారు. ప్రతి పోలీస్‌ అధికారి పక్కన హోంగార్డు లేకపోతే పని నడవదని, వారి కోసం అందరూ ఆలోచించాలని కోరారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు హోంగార్డులు చప్పట్లు, కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఏపీ హోంగార్డు అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.గోవింద్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏవై ప్రసాద్, ఏపీ పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top