సీమాంధ్ర ఉద్యమ ప్రభావం జిల్లాపైనా పడింది. ఆ ప్రాంత ఉద్యోగులు విద్యుత్ సంస్థల్లో ఉత్పత్తిని నిలిపివేసి ఆందోళనబాట పట్టడంతో మూడు రోజు లుగా సీమాంధ్రలో చీకట్లు అలుముకున్నాయి.
రాయికల్, న్యూస్‌లైన్ : సీమాంధ్ర ఉద్యమ ప్రభావం జిల్లాపైనా పడింది. ఆ ప్రాంత ఉద్యోగులు విద్యుత్ సంస్థల్లో ఉత్పత్తిని నిలిపివేసి ఆందోళనబాట పట్టడంతో మూడు రోజు లుగా సీమాంధ్రలో చీకట్లు అలుముకున్నాయి. విద్యుత్ సరఫరాలో తీవ్రమైన లోటు ఏర్పడడం వల్ల తెలంగాణలోనూ కోతలు విధిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మండల కేంద్రాల్లో రెండు గంటలు, గ్రామాల్లో మూడు గంటలు అధికారిక కోతలు అమలు చేస్తున్నారు. తాజాగా సోమవారం రాత్రి నుంచి మరో రెండు మూడు గంటల పాటు అనధికార కోతలు విధిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ఒకే సమయంలో కాకుండా పలు దఫాలుగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. అరగంట, గంట చొప్పున సరఫరా నిలివేస్తూ ప్రజల దృష్టి కోతలవైపు మరలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు కొన్ని ప్రాంతాల్లో, ఉదయం వేళల్లో మరికొన్ని ప్రాంతాల్లో కరెంటు కట్ చేశారు. సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళన ఇలాగే కొనసాగితే గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలిపోయి తెలంగాణలోనూ అంధకారం అలుముకునే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.