కోడ్‌ వేళ ‘దేశం’ ఫుడ్‌ బకెట్స్‌

Illegal screening in the pursuit of nutrition - Sakshi

పౌష్టికాహారం ముసుగులో అక్రమాలకు తెర 

పాత తేదీలతో కొత్త ఉత్తర్వులు జారీ

ఎలా అమలు చేయాలంటున్న అధికారులు

అమలుచేసి తీరాల్సిందేనంటున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు

కోడ్‌ ఉల్లంఘనేనంటున్న నోడల్‌ అధికారులు

సాక్షి, విశాఖపట్నం: గిరిజనుల ఆరోగ్యం..సంక్షేమం కోసం గడచిన ఐదేళ్లలో ఏనాడు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ ఎన్నడూ లేని ప్రేమ ఒలకబోస్తుంది. మాతా, శిశు మరణాల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందంటూ జాతీయ ఆరోగ్య సంస్థలు ఘోషిస్తున్నా ఇంతవరకు పట్టించుకోలేదు. అయితే ఎస్టీ కుటుంబాల ఓట్లపై కన్నేసిన ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఫుడ్‌ బకెట్‌ (గిరి ఆహారభద్రత)పేరిట కొత్త పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆరు రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు కేజీల చోడి(రాగి)పిండి, రెండు కేజీల కందిపప్పు, ఒక లీటర్‌ పామాయిల్, కేజీ చొప్పున ఉప్పు, వేరుశెనగ, బెల్లం పంపిణీ చేయాలని నిర్ణయిస్తూ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పైగా కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత పాత తేదీతో ఈ ఉత్తర్వులు (సర్క్యులర్‌ నం.ఎంకేటీజీ/ఎం6/ఫుడ్‌ బాస్కెట్‌ /2009, డేట్‌: 27–02–2019) జారీ చేయడం వివాదాస్పదమవుతోంది.

రాష్ట్రంలోని సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చిత్తూరు, కేఆర్‌ పురం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలోని 77 మండలాల్లో రెండులక్షల 668 ఎస్టీ కుటుంబాలకు ఫుడ్‌బాస్కెట్‌ కిట్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. 24 గంటలు తిరక్కుండానే ఆ సంఖ్యను రెట్టింపు చేస్తూ 4,24,335 ఎస్టీ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ మేరకు సరుకులను  ఆయా మండలాలకు కేటాయిస్తూ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ ఉత్తర్వులు (ఆర్‌సీ నం.ఎస్‌వోడబ్ల్యూ 03–21021(32)/1/2018–జీ, సెక్షన్‌–సీవోటీడబ్ల్యూ, డేటెడ్‌: 28–02–2019) జారీచేసింది. అయితే 25–02–2019నుంచి 28–03–2019 వరకు ఈ సరుకులను పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీచేయడం విస్మయం కలిగిస్తోంది. 

ఆగమేఘాలపై పంపిణీకి కసరత్తు..
పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు పౌర సరఫరాల శాఖ డెప్యూటీ తహసీల్దార్లు, రేషన్‌ డీలర్లతో సమావేశాలు నిర్వహించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రకాల నిత్యావసరాలను చంద్రన్న సంక్రాంతి కానుక సంచి మాదిరిగా నాన్‌ వోవెన్‌ కారీ బ్యాగ్‌లలో పెట్టి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కొంతమంది అధికారులు ఎన్నికల నిబంధనల కారణంగా పంపిణీ ప్రక్రియకు అభ్యంతరం వ్యక్తం చేయగా.. పాలకులు ఆదేశించారని, అమలు చేయాల్సిందేనంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది ముమ్మాటికీ కోడ్‌ ఉల్లంఘనే.. 
ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ పాత తేదీలతో ఆదేశాలు జారీ చేస్తూ అధికార ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోంది. ఎస్టీ కుటుంబాల పౌష్టికాహారం, సంక్షేమం ముసుగులో ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాలకులు పాల్పడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ తక్షణం స్పందించి పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేయాలి.
    –కాండ్రేగుల వెంకటరమణ, సమాచార హక్కు ఉద్యమకర్త, విశాఖపట్నం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top