ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట

Published Fri, Nov 21 2014 3:28 AM

ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్): ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి.. డ్వాక్రా సంఘాలకు కేటాయించిన రీచ్‌ల నుంచి నిబంధనల ప్రకారం తరలిస్తామని జాయింట్ కలెక్టర్ కన్నబాబు అన్నారు. గురువారం ఆయన తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణా అధికారులతో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి నిరంతర గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌లను గుర్తించినా.. నిడ్జూరులో మాత్రమే తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. ఇసుక ధర, రవాణా చార్జీలను ఇప్పటికే ఖరారు చేశామన్నారు.

ఇప్పటి వరకు వినియోగదారులు డీడీలు చెల్లించి ఇసుక తరలిస్తున్నారని.. ఇకపై మీసేవ కేంద్రాల్లో నగదు చెల్లించి రశీదులను ఇసుక రీచ్‌ల వద్ద డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు అందిస్తేనే ఇసుక సరఫరా అవుతుందన్నారు. వాల్టా చట్టాన్ని వంద శాతం అమలు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇందులో భాగంగానే రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
 
పత్తి కొనుగోలుకు చర్యలు
పత్తి ధర పడిపోవడంతో కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాలలో సీసీఐ కొనుగోలు కేంద్రాలతో ఎంఎస్‌పీతో పత్తిని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ, ఆముదం దిగుబడులను ఈ-టెండర్లతో  కొనుగోలు చేస్తున్నారని.. త్వరలోనే పత్తిని కూడా అదేవిధంగా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Advertisement
Advertisement