
ఇసుక దోపిడీపై కాకుండా తవ్వకాలకు అనుమతి ఉందన్న ప్రభుత్వం
ఎన్ని టన్నుల ఇసుక తవ్వారనే ప్రశ్నకు సమాధానం కరువు
ట్రాక్టర్లే వినియోగించక పోయినా ఆ పేరుతో టన్నుకు రూ.70 ఖర్చు అని వెల్లడి
తవ్వకాల కాంట్రాక్టు పొందిన కంపెనీ అర్హతలపైనా దాటవేత
సాక్షి, అమరావతి: నావిగేషన్ ఛానల్ ముసుగులో కృష్ణా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక దందాపై ‘ఇసుక మస్కా’ శీర్షికతో సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం తప్పించుకునే ధోరణిలో వివరణ ఇచ్చింది. అక్కడ జరుగుతున్న వందల కోట్ల ఇసుక దోపిడీపై కథనంలో ప్రస్తావించిన కీలకమైన అంశాలకు సమాధానం ఇవ్వకుండా, జిల్లా స్థాయి ఇసుక కమిటీ అనుమతి మేరకే కృష్ణా, గోదావరి వాటర్ వేస్, ఇన్‌ల్యాండ్ కార్గో మూవర్స్ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిపింది. టన్నుకు రూ.215 రేటును కమిటీయే నిర్ధారించినట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు సోమవారం గనుల శాఖ గుంటూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. టన్నుకు రూ.215 రేటును నిర్ధారించామని, అందులో రూ.70 నది కట్ట నుంచి స్టాక్ పాయింట్లకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేయడానికి ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. అయితే, వాస్తవానికి ఈ రవాణాకు అసలు ట్రాక్టర్లే ఉపయోగించడం లేదు. నది వద్ద, స్టాక్ పాయింట్ల వద్ద పెద్ద లారీలు, టిప్పర్లు, డంపర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగే స్టాక్ పాయింట్‌లో వినియోగదారుల వాహనాలకు ఇసుక లోడ్ చేసేందుకు టన్నుకు రూ.30 ఖర్చవుతుందని అంచనా వేసినా, ఇందుకు రూ.15 మాత్రమే ఖర్చవుతుందని బోట్స్‌మెన్ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
అన్ని రకాల చార్జీలు కలిపి టన్నుకు రూ.213.75 ఖర్చు అవుతుందని, దాన్ని రౌండ్ ఫిగర్ చేసి రూ.215గా నిర్ధారించినట్లు ప్రభుత్వ పేర్కొంది. రూ.213.75ను రౌండ్ ఫిగర్ చేస్తే రూ.214 అవుతుంది తప్ప రూ.215 ఎలా అవుతుందో గనుల శాఖకే తెలియాలి. దీన్నిబట్టి ఈ రేటు నిర్ధారణ మొత్తం కట్టుకథేనని, చినబాబు చెప్పిన రేటుకు కాంట్రాక్టు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
7.70 లక్షల టన్నుల ఇసుక తవ్వకానికి అనుమతిచ్చామని వివరణలో పేర్కొన్నా, ఇప్పటి వరకు ఎన్ని టన్నుల ఇసుక తవ్వారు, ఏ స్టాక్ పాయింట్ నుంచి ఎంత ఇసుక తరలించారు.. రాజధాని పనులకు ఎంత ఇసుక సరఫరా చేశారు.. బయటి వారికి ఎంత ఇసుక విక్రయించారు.. ఇంకా ఎన్ని టన్నుల ఇసుక తవ్వాల్సి ఉంది.. వంటి వివరాలేవీ వివరణలో పేర్కొనక పోవడాన్ని బట్టి పరిమితికి మించి 15 లక్షల టన్నులకుపైగా ఇసుకను అడ్డగోలుగా తవ్వినట్లు గనుల శాఖ పరోక్షంగా అంగీకరించినట్లయింది. డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇచ్చిన కంపెనీకి ఉన్న అర్హతల గురించి కనీసం ప్రస్తావించక పోవడాన్ని బట్టి ఆ కంపెనీకి అర్హత లేదనే విషయం స్పష్టమవుతోంది. గనుల శాఖ ఇచ్చిన వివరణ ద్వారానే రూ.వందల కోట్ల విలువైన ‘ఇసుక మస్కా’ నిజమనే విషయం రూఢీ అవుతోంది.