గుర్తింపు అస్పష్టం | Identification is unclear | Sakshi
Sakshi News home page

గుర్తింపు అస్పష్టం

Dec 13 2013 12:44 AM | Updated on Sep 2 2017 1:32 AM

చేతిలో అయిదు గుర్తింపు కార్డులున్నా అవస్థలే..సెల్ సిమ్‌కార్డు, రైల్వేటికెట్, బ్యాంకు అకౌంట్.. ఏది పొందాలన్నా గుర్తింపు కార్డు తప్పనిసరి.

 ‘గుర్తింపు’ లేకుంటే గడవని రోజులివి.. సిమ్ కార్డు నుంచి పాస్‌పోర్ట్ వరకు.. డ్రైవింగ్ లెసైన్స్ నుంచి  రైలు టికెట్ వరకు.. ఏది కావాలన్నా ‘గుర్తింపు’ ఉండాల్సిందే. ఐడీ లేకుండా అడుగు ముందుకు వెయ్యలేం.. కానీ ఆ ‘గుర్తింపు’ అస్పష్టంగా ఉంటే? ఎన్ని తిప్పలు పడాలో.. ఎన్ని ఇక్కట్లు ఎదుర్కోవాలో! ఈ సమస్యలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం
 
 యలమంచిలి, న్యూస్‌లైన్: చేతిలో అయిదు గుర్తింపు కార్డులున్నా అవస్థలే..సెల్ సిమ్‌కార్డు, రైల్వేటికెట్, బ్యాంకు అకౌంట్.. ఏది పొందాలన్నా గుర్తింపు కార్డు తప్పనిసరి. ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఏదో ఒక గుర్తింపు కార్డు ఉందో లేదో చూసుకోవలసిందే.  అయితే ప్రస్తుతం ఎన్ని గుర్తింపు కార్డులున్నా ఒక్క కార్డు కూడా ‘గుర్తించని’ పరిస్థితి.  రేషన్,  ఆధార్, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్‌లను పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు గుర్తింపుకార్డులుగా పరిగణిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గుర్తింపు కార్డుల్లో ఫొటోలు సక్రమంగా లేకపోవడం, పేర్లు, చిరునామాలు తప్పుల తడకలతో వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు.  బ్యాంకులతోపాటు పలు ప్రభుత్వం సంస్థలు ప్రస్తుతం అస్పష్టంగా ఉన్న గుర్తింపుకార్డులను తిరస్కరిస్తున్నాయి.  దీంతో వినియోగదారులు పాస్‌పోర్టు ఫొటోలతో వీఆర్‌ఓల ధ్రువీకరణ తీసుకుని పనులను ముగించుకుంటున్నారు.  
 
రేషన్ కార్డు కష్టాలు

జిల్లాలో 12,17,117 రేషన్ కార్డులు ఉన్నాయి.  దీంట్లో వేప్ సిరీస్‌తో ఉన్న కార్డులు 8 లక్షల వరకు ఉన్నాయి.  ఈ కార్డుల్లో కుటుంబ యజమాని ఫొటోతోపాటు సభ్యుల ఫొటోలు భూతద్దంతో వెతికినా కనిపించని పరిస్థితి. ఇక వయస్సు, పేర్లు తప్పుల తడకలతో సరిచేయించుకోవడానికి నెలల తరబడి తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.   ఈమద్య కాలంలో ఇచ్చిన రచ్చబండ వంటి కార్యక్రమాల్లో ఇచ్చిన రేప్ సిరీస్‌తో ఉన్న  కార్డుల్లో ఫొటోలు స్పష్టత ఉన్నప్పటికీ  పెద్దయెత్తున తప్పులు దొర్లడంతో వీటిని సరిదిద్దించుకోలేక అవస్థలు పడుతున్నారు.

 ఆధార్‌లో నల్ల ఫొటోలు
 
ఆధార్ కార్డుల్లో కూడా ఫొటోలు నల్లగా స్పష్టత లేకుండా ఉండడంతో వీటిని గుర్తింపు కార్డులుగా ఆమోదించడానికి పలు సంస్థలు నిరాకరిస్తున్నాయి.  జిల్లాలో దాదాపు 30 లక్షల వరకు ఆధార్ కార్డులు పంపిణీ  జరిగినట్టు అధికార యంత్రాంగం చెబుతోంది.  వాస్తవానికి 50శాతం కార్డుల్లో ఫొటోలు స్పష్టత లేకపోవడం, పేర్లు, చిరునామాల తప్పులతో సమస్య ఎదురవుతోంది. ఓటరు గుర్తింపు, డ్రైవింగ్ లెసైన్సుల్లో ఫొటోలు స్పష్టత లేకపోవడంతో గుర్తింపు కార్డులుగా పనికిరావంటున్నారు.   గత ఏడాదిగా ఓటరు గుర్తింపు కార్డులను ఆన్‌లైన్ ద్వారా పొందడానికి అవకాశం కల్పించడంతో ఓటర్లు తమ ఫొటోలను అప్‌లోడ్ చేసుకుంటున్నారు.  దీంతో గుర్తింపు కార్డుల్లో స్పష్టత ఉంటోంది.  
 
ఏం జరుగుతోందంటే...

 గుర్తింపు కార్డుల తయారీ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోంది.  ఈ వ్యవహారంలో లక్షల్లో చేతులు మారుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి.   ప్రైవేట్ సంస్థలు అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలపై అధికారుల పర్యవేక్షణ ఉండడంలేదు.  నాణ్యతలేని కంప్యూటర్ సామగ్రి, డిజిటల్ కెమెరాలు,  ఇంకు (టోనర్) లేని ప్రింటర్లతో గుర్తింపు కార్డుల ప్రింట్లు తీస్తూ వినియోగదారులకు పంపిస్తున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.  ఇక ప్రైవేట్ సంస్థలు సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో సిబ్బంది మొక్కుబడిగా సెంటర్లలో విధులు నిర్వహిస్తున్నారు.  తప్పులు దొర్లడానికి ఇవన్నీ కారణాలని తేటతెల్లమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement