లీకులు.. షాకులు


సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ‘ఉమ్మడి రాజధాని’పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లీకులు... జిల్లా ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయి. యూటీ, సెమీ యూటీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధి అంటూ ఇలా రోజుకో ప్రకటన చేస్తూ అయోమయంలో పడేస్తోంది. మంత్రుల బృందం హైదరాబాద్ స్టేటస్‌పై ఇంకా నిర్దిష్ట ప్రకటన చేయన ప్పటికీ, ఆయా శాఖల కార్యదర్శులు, రాజకీయ పార్టీల నేతలతో జరుపుతున్న సంప్రదింపుల్లో ఉమ్మడి రాజధానిపై అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చే స్తోంది. ఈ క్రమంలోనే బయటకు పొక్కుతున్న అంశాలు జిల్లా అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందనే సంతోషం కన్నా.. జిల్లా ఉనికి దెబ్బతింటుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది కేవలం హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధి వరకే ఉంటుందని అంచనా వేశారు.

 

 అయితే, ఇటీవల జీవోఎం సంప్రదింపుల్లో ఉమ్మడి రాజధాని పరిధి కీలకాంశంగా మారింది. జీహెచ్‌ఎంసీ లేదా హెచ్‌ఎండీఏ పరిధిని ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని, పాలనా వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు వెలువడుతున్న సంకేతాలు జిల్లా ప్రజలను డైలమాలో పడేస్తున్నాయి. హైదరాబాద్ నగరపాలక సంస్థ(ఎంసీహెచ్)కు గ్రేటర్ హోదా కల్పిస్తూ 2007లో శివార్లలోని పది పురపాలక సంఘాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేశారు. ఫలితంగా జిల్లాలోని 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గ్రేటర్‌లో అంతర్భాగమై పోయింది. దీంతో జిల్లా యంత్రాంగానికి ఈ ప్రాంతంపై పట్టు లేకుండా పోయింది. అభివృద్ధి కార్యక్రమాల అమలును పూర్తిగా గ్రేటర్ పాలకవర్గమే పర్యవేక్షిస్తుండటంతో కేవలం రెవెన్యూ వ్యవహారాలకే జిల్లా యంత్రాంగం పరిమితమైంది.

 

 మరోవైపు మంచినీటి సరఫరా వ్యవస్థ మెట్రో వాటర్ బోర్డు కనుసన్నల్లో ఉండటంతో ఇక్కడి ప్రజల బాగోగులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు ఆయా విభాగాల అధిపతులు ముఖ్య కార్యదర్శులు హోదా కలిగినవారు కావడంతో జిల్లా కలెక్టర్ పాత్ర నామమాత్రంగా మారిపోయింది. కేవలం సూచనలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మరోవైపు హెచ్‌ఎండీఏ పరిధిని కూడా అనూహ్యంగా పెంచడంతో జిల్లాలోని 22 మండలాలు మహానగరాభివృద్ధి సంస్థ ఆధీనంలోకి వచ్చాయి. భూములు, చెరువులు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర వ్యవహారాలన్నీ హెచ్‌ఎండీఏ గుప్పిట్లోకి వెళ్లాయి.

 

 తాజా ప్రతిపాదనలతో...

 హెచ్‌ఎండీఏ/ జీహెచ్‌ఎంసీ పరిధిలో పాలనా వ్యవహారాలు కేంద్రం పరిధిలోకి వెళితే జిల్లా ఉనికికి భంగం కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే ఇరుశాఖల అధిపత్యంతో జిల్లాలో పాలనా వ్యవస్థ మధ్య సమన్వయం లేకుండా పోయింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర సర్కారు ఎత్తుగడలు ప్రజానీకాన్ని సందిగ్ధంలో పడేశాయి. ఉమ్మడి రాజధాని పరిధి హైదరాబాద్ వరకే పరిమితమవుతుందని తొలుత ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ఆలోచనలు.. సంప్రదింపులు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హెచ్ ఎండీఏ లేదా గ్రేటర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే రహస్య ఎజెండాను తెరమీదకు తెస్తే ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఈ శాఖల పెత్తనంతో జిల్లా రాబడిలో సింహభాగం రాజధానికే ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం తాజా ప్రతిపాదనలతో జిల్లా గ్రామీణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురయ్యే వీలు ఉంది. ఈ నేపథ్యంలో యూటీ, సెమీ యూటీ పై స్పష్టత వస్తేగానీ జిల్లా ప్రజల్లో ఉన్న ఆందోళనలు తొలిగేపోయే ఆస్కారముంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top