హైదరాబాద్‌ను యూటీ చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ను అంగీకరించడమంటే సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘లూటీ’ని ఆమోదించడమేనని టీఆర్‌ఎస్ వ్యాఖ్యానించింది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను యూటీ చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ను అంగీకరించడమంటే సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘లూటీ’ని ఆమోదించడమేనని టీఆర్‌ఎస్ వ్యాఖ్యానించింది. శతాబ్దాల తెలంగాణ ప్రజల శ్రమతో నిర్మితమైన హైదరాబాద్‌ను కోల్పోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టంచేసింది. హైదరాబాద్ విషయంలో కేంద్రం విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు అంగీకరించరని పేర్కొంది. యూటీ ప్రతిపాదనను టీఆర్‌ఎస్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పార్టీ నేతలు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ, దానికి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని ప్రకటిస్తూ సీడబ్ల్యూసీ చేసిన ప్రకటన శిలాక్షరమా? లేక నీటిరాతలా? అని ప్రశ్నించారు. సంపూర్ణ తెలంగాణ సాధించేంతవరకు టీఆర్‌ఎస్, తెలంగాణ సమాజం విశ్రమించదని తేల్చిచెప్పారు. ‘భావసారూప్యత కలిగిన రాజకీయపక్షాలు, రాజకీయేతర పక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి టీఆర్‌ఎస్ ఉద్యమిస్తుందని వెల్లడించారు.