అయ్యబాబోయ్...మంత్రిరావెలా? | Hulchul creating the Social Welfare Minister ravela kisorbabu district. | Sakshi
Sakshi News home page

అయ్యబాబోయ్...మంత్రిరావెలా?

Aug 8 2014 12:03 AM | Updated on Aug 24 2018 2:36 PM

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు జిల్లాలో హల్‌చల్ సృష్టిస్తున్నారు. ఉద్యోగుల మనోభావాలు, ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తూ ఇటు ఉద్యోగులు, అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆగ్రహానికి కారకులవుతున్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు:రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు జిల్లాలో హల్‌చల్ సృష్టిస్తున్నారు. ఉద్యోగుల మనోభావాలు, ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తూ ఇటు ఉద్యోగులు, అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆగ్రహానికి కారకులవుతున్నారు.
 
  పార్టీ కార్యకర్తల ముందే ఉద్యోగులను తూలనాడుతున్నారనే విమర్శలుటీడీపీ వర్గీయుల నుంచే వినిపిస్తున్నాయి. ‘నేను సీరియస్ మంత్రిని మా కార్యకర్తలు చెప్పిన పనిచేయక పోతే శంకరగిరిమాన్యాలకు పంపుతా, సస్పెండ్ చేయిస్తా,ఇంటికి పంపిస్తా, కడపకు ట్రాన్స్‌ఫర్ చేయిస్తా’ అంటూ పార్టీ కార్యకర్తల ముందే అధికారులను చులకన చేసి మాట్లాడుతు న్నారు.
 ఆయన జిల్లాలో పర్యటించిన ప్రతిసారీ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం పరిపాటిగా మారింది.
 
 కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఉద్యోగులను ‘నీకు బుద్ధి ఉందా’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెప్పినపని చేయకపోతే ఇంతే సంగతులంటూ బెదిరిస్తున్నారు.
 ఇప్పటి వరకు రెవెన్యూ, పోలీస్, దేవాదాయశాఖల అధికారులు, సిబ్బందికి మంత్రి రావెల చుక్కలు చూపించారు.
 
 బెదిరిపోయిన ఆయా శాఖల అధికారులు ఉద్యోగం అంటూ ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చనే భావనతో బదిలీపై వెళ్లే యత్నంలో ఉన్నారు. మహిళా ఉద్యోగులైతే మౌనంగా కుంగిపోతున్నారు. ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలకు చెప్పుకునేందుకు వెనుకాడుతున్నారు. ఆ షాక్ నుంచి తేరుకునేందుకు ఒకటి, రెండు రోజులు సెలువు పెట్టి మళ్లీ విధులకు హాజరవుతున్నారు.
 
 ‘ప్రజల వద్దకు పాలన’, ‘జన్మభూమి’ వంటి కార్యక్రమాలతో ప్రస్తుత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులు, అధికారులపై నోరుపారేసుకోవడం వల్లనే ఆ వర్గాలకు దూరమాయ్యరనే విషయాన్ని మంత్రి గుర్తించడం లేదని టీడీపీ శ్రేణులు భయాందోళనకు గురవుతున్నాయి.

 ఉద్యోగుల మనోభావాలు, ఆత్మాభిమానం దెబ్బతినేలా మంత్రి వ్యవహరిస్తున్నారని చెప్పడానికి కొన్ని సంఘటనలను ఉదాహరణుగా చూపుతున్నారు. బుధవారం పెదనందిపాడులో మండల ఉపాధ్యక్షుడు నర్రా బాలకృష్ణ నివాసంలో మంత్రి రావెల పెదనందిపాడు, కాకుమాను మండల నాయకులు, కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
 నాలుగు గోడల మధ్య జరిగిన ఈ సమావేశానికి ప్రొటోకాల్ ప్రకారం అధికారులు వెళ్లాల్సిన అవసరం లేకపోయినా రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది హాజరయ్యారు. అన్నవరం గ్రామ ఎస్సీకాలనీ రోడ్డు సమస్యపై సర్పంచ్ ఎన్.శివశంకరరావు ఫిర్యాదు మేరకు మంత్రి రావెల మండల తహశీల్దారు సీహెచ్ పద్మావతి, ఎస్‌ఐ లోకేశ్వరరావులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆ రోడ్డు సమస్య తమ పరిధిలోకి రాదని ఆ ఇద్దరు అధికారులు చెప్పినప్పటికీ మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు సమాచారం.
 
 మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల అనంతరం వట్టిచెరుకూరు మండలంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇక్కడ కొందరు కార్యకర్తలు ఎస్‌ఐపై ఫిర్యాదు చేయడంతో, ‘పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చాం,కార్యకర్తలకు అనుగుణంగా పనులు చేయాలని’ హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా అప్పటి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఎస్‌ఐపై ఫిర్యాదు చేయడమేకాకుండా డిఎస్పీ కె.నరసింహను పిలిపించి ఎస్‌ఐపై ఫిర్యాదు చేశారు. ఇతను మాకు అవసరం లేదు. మెడికల్ లీవ్‌లో వెళ్లిపోయే విధంగా చూడాలని డిఎస్పీని ఆదేశించారు.
 
 మంత్రి వ్యవహార సరళి ఇలా వుండడంతో భయపడుతున్న  కొందరు అధికారులు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.మరో వైపు మంత్రి రావెల పనితీరుపై పార్టీలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యల పరిష్కారానికి ఆయన వద్దకు వెళ్లే కంటే ఇతర మార్గాలు చూసుకోవడం మేలనే భావనలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. అధికారులు కూడా ఆయనకు సహకరించే పరిస్థితులు లేవంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement