రోమాంచిత సంబరం.. తాకెను అంబరం

Horsley Hills Adventure Festival Was Started - Sakshi

అట్టహాసంగా హార్సిలీ హిల్స్‌ అడ్వెంచర్‌ ఫెస్టివల్‌ ప్రారంభం 

ఉత్సాహం నింపిన సైక్లింగ్‌ పోటీలు

ఉత్కంఠ రేపిన పారా మోటార్‌ విహారం.. గగుర్పాటుకు గురిచేసిన సాహస విన్యాసాలు

బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): కొండలపై సైక్లింగ్‌ పోటీలు దుమ్ము రేపాయి. సాహస విన్యాసాలు సందడి చేశాయి. పారా మోటార్‌ విహారం ఉత్సాహం నింపింది. తాళ్లతో చేసిన వలపై నిలువుగా పైకి ఎగబాకటం.. తాళ్ల ఆధారంగా ఒకచోట నుంచి మరో చోటకు ప్రయాణించటం.. ఆకాశ వీధిలో తాళ్లు ఆధారంగా ఉంచిన చెక్కలపై నడవటం వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్‌పై రెండు రోజుల పాటు నిర్వహించే అడ్వెంచర్‌ ఫెస్టివల్‌ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ చేపట్టిన ఈ ఉత్సవాలు పండుగ వాతావరణంలో సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన వంద మందికి పైగా క్రీడాకారులు సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు.

తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృధ్వీతేజ్‌ అడ్వెంచర్‌ క్రీడలను ప్రారంభించారు. చేకూరి కీర్తి, పృధ్వీతేజ్‌ వేర్వేరుగా పారా మోటార్‌లో అరగంట పాటు ఆకాశంలో విహారం చేశారు. రోప్‌ సైక్లింగ్, బైక్‌ రైడింగ్, జిప్‌ సైకిల్, ట్రెక్కింగ్‌ ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు యాత్రికులు, క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. సాహస క్రీడల్లో పాల్గొనేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. విన్యాసాలు, క్రీడలను తిలకించి ఆహ్లాదం పొందారు. సాహస క్రీడలపై మక్కువ గల క్రీడాకారులు ప్రతిభ చాటేందుకు ఈ అడ్వెంచర్‌ ఫెస్టివల్‌ వేదికగా నిలిచింది. టూరిజం డీవీఎం సురేష్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధికారి చంద్రమౌళి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అలరించిన వినోద కార్యక్రమాలు
అడ్వెంచర్‌ ఫెస్టివల్‌లో భాగంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలు అలరించాయి. టీవీ యాంకర్లు గీతా భగత్, చైతూ సందడి చేశారు. హాస్యనటులు బుల్లెట్‌ భాస్కర్, రాజమౌళి హాస్యం పండించారు. పలు చిత్రాల్లోని సినీ నేపథ్య గేయాలు ఆలపించారు. డీజే నృత్యాలతో సభికులను ఉత్సాహపరిచారు. నివేదిక కూచిపూడి, యశ్వని జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలను సందర్శకులు ఉత్సాహంతో తిలకించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top