
నేటి నుంచి వరల్డ్ చాంపియన్‌షిప్
తొమ్మిది రోజులపాటు పతకాల వేట
భారత ఆశలన్నీ నీరజ్ చోప్రాపైనే
198 దేశాలు... 2000లకు పైగా అథ్లెట్లు... 49 ఈవెంట్లు... రికార్డులు బద్దలు కొట్టేందుకు... అంతర్జాతీయ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించేందుకు... అథ్లెట్లందరూ ‘సై’ అంటున్నారు. స్ప్రింట్ రేసుల్లో అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యం కొనసాగుతుందా.... మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్‌లో ఆఫ్రికా తమ హవా కొనసాగిస్తుందా... ఫీల్డ్ ఈవెంట్స్‌లో యూరోపియన్లు తమ సత్తా చాటుకుంటారా... ఇవన్నీ తెలుసుకోవాలంటే క్రీడాభిమానులు నేటి నుంచిమొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌పై దృష్టి సారించాల్సిందే.
1983లో ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకిలో తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు వేదిక కాగా... తాజాగా 20వ ఎడిషన్‌కు జపాన్ రాజధాని టోక్యో ముస్తాబైంది. ఈ మెగా ఈవెంట్ జపాన్‌లో జరగడం ఇది మూడోసారి. ఇంతకుముందు 1991లో టోక్యో, 2007లో ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చాయి.
టోక్యో: ఒలింపిక్స్ క్రీడలు... ఫుట్‌బాల్ ప్రపంచకప్... ఆ తర్వాత క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించేది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్‌కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మొత్తం 198 దేశాల అథ్లెట్లు 49 ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి రోజు ఐదు ఈవెంట్లలో అథ్లెట్లు మెడల్స్ కోసం బరిలోకి దిగనున్నారు.
పురుషుల, మహిళల 35 కిలోమీటర్ల రేస్ వాక్... అనంతరం పురుషుల షాట్‌పుట్, మహిళల 10,000 మీటర్లు, మిక్స్‌డ్ 4–400 మీటర్ల రిలే ఫైనల్ ఈవెంట్లు జరుగుతాయి. పురుషుల, మహిళల 100 మీటర్ల విభాగాల్లో ప్రిలిమినరీ రౌండ్‌లు ఉంటాయి. పురుషుల, మహిళల 100 మీటర్ల సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆదివారం జరుగుతాయి.
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో నిషేధం ఎదుర్కొంటున్న రష్యా అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్‌లో ‘తటస్థ అథ్లెట్లు’గా పోటీపడనున్నారు. జమైకా దిగ్గజ మహిళా స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ ‘టోక్యో’లో తన కెరీర్‌ను ముగించనుంది. ఇప్పటి వరకు ఆమె ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో వ్యక్తిగత, టీమ్ రిలే ఈవెంట్స్‌లో కలిపి మొత్తం 16 పతకాలు సాధించింది. ఇందులో 10 స్వర్ణాలు, 5 రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి.
మరోవైపు పురుషుల పోల్ వాల్ట్‌లో స్వీడన్ స్టార్ డుప్లాంటిస్ ప్రధాన ఆకర్షణ కానున్నాడు. ఇప్పటికే 13 సార్లు పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన డుప్లాంటిస్ స్వర్ణం సాధించి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలని పట్టుదలతో ఉన్నాడు. 2022, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో బంగారు పతకాలు నెగ్గిన డుప్లాంటిస్, 2019లో రజత పతకం సాధించాడు.
నీరజ్ ఈవెంట్ 17న, 18న...
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈసారి భారత్ నుంచి 19 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. అయితే అందరి దృష్టి మాత్రం జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే ఉంది. ఈ మెగా ఈవెంట్‌లో 2022లో రజతం, 2023లో స్వర్ణం గెలిచిన నీరజ్... మళ్లీ విజేతగా నిలిస్తే... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండుసార్లు బంగారు పతకాలు నెగ్గిన మూడో జావెలిన్ త్రోయర్‌గా గుర్తింపు పొందుతాడు.
గతంలో జాన్ జెలెజ్నీ (1993, 1995), అండర్సన్ పీటర్స్ (2019, 2022) మాత్రమే ఈ ఘనత సాధించారు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్ రెండు రోజులపాటు జరుగుతుంది. ఈనెల 17న క్వాలిఫయింగ్... 18న ఫైనల్ ఉంటాయి. జావెలిన్ త్రోలో భారత్ నుంచి నీరజ్ చోప్రాతోపాటు సచిన్ యాదవ్, యశ్‌వీర్ సింగ్, రోహిత్ యాదవ్ బరిలో ఉన్నారు. మహిళల జావెలిన్ త్రోలో భారత స్టార్ అన్ను రాణి ఐదోసారి (2017, 2019, 2022, 2023) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడనుంది.
2019, 2022లో ఫైనల్ చేరిన అన్ను రాణి ఈసారి ఏం చేస్తుందో వేచి చూడాలి. తొలి రోజు శనివారం భారత్ నుంచి నలుగురు అథ్లెట్లు బరిలో ఉన్నారు. పురుషుల 35 కిలోమీటర్ల రేస్ వాక్‌లో రామ్‌బాబూ, సందీప్ కుమార్... మహిళల 35 కిలోమీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి... మహిళల 1500 మీటర్ల హీట్స్‌లో పూజ పోటీపడతారు.
ఇదీ భారత బృందం...
పురుషుల విభాగం: నీరజ్ చోప్రా, సచిన్ యాదవ్, యశ్‌వీర్ సింగ్, రోహిత్ యాదవ్ (జావెలిన్ త్రో), గుల్‌వీర్ సింగ్ (5000, 10000 మీటర్లు), ప్రవీణ్ చిత్రావెల్, అబ్దుల్లా అబూబాకర్ (ట్రిపుల్ జంప్), మురళీ శ్రీశంకర్ (లాంగ్‌జంప్), సర్వేశ్ కుషారే (హైజంప్), అనిమేశ్ కుజుర్ (200 మీటర్లు), తేజస్ షిర్సే (110 మీటర్ల హర్డిల్స్), సెర్విన్ సెబాస్టియన్ (20 కిలోమీటర్ల రేస్ వాక్), రామ్‌బాబూ, సందీప్ కుమార్ (35 కిలోమీటర్ల రేస్ వాక్). మహిళల విభాగం: అన్ను రాణి (జావెలిన్ త్రో), పారుల్ చౌధరీ, అంకిత దయాని (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), పూజ (800, 1500 మీటర్లు), ప్రియాంక గోస్వామి (35 కిలోమీటర్ల రేస్ వాక్).
443 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో అమెరికా సాధించిన పతకాలు. ఇందులో 195 స్వర్ణాలు, 134 రజతాలు, 114 కాంస్యాలు ఉన్నాయి. ‘ఆల్‌టైమ్ పతకాల పట్టిక’లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 171 పతకాలతో (65 స్వర్ణాలు, 58 రజతాలు, 48 కాంస్యాలు) కెన్యా రెండో స్థానంలో ఉంది.
3 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన పతకాలు. 2003లో అంజూ జార్జి మహిళల లాంగ్‌జంప్‌లో కాంస్యం నెగ్గగా.. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా 2022లో రజతం, 2023లో స్వర్ణం గెలిచాడు. ఆల్‌టైమ్ పతకాల పట్టికలో భారత్... బుర్కినఫాసో, ట్యునీసియాలతో కలిసి సంయుక్తంగా 65వ స్థానంలో ఉంది.