జగన్‌ వ్యాజ్యాన్ని ‘పిల్‌’తో జతచేస్తారా!?

High Court Comments about YS Jagan Petition - Sakshi

విస్మయం వ్యక్తంచేసిన హైకోర్టు ధర్మాసనం

బాధితునిగా జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు కాబట్టి సింగిల్‌ జడ్జే విచారించి ఉండాల్సింది

విచారణ నేటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌ : తనపై జరిగిన హత్యాయత్నం మీద దర్యాప్తును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి తమ ముందున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)తో జత చేయడంపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వంలోని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఓ బాధితునిగా జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేస్తే, దానిని పిల్‌తో జత చేయకుండా సింగిల్‌ జడ్జి విచారించి ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడుతూ జగన్‌ పిటిషన్‌ను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. 

వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఇదే అంశంపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లతోపాటు విమానాశ్రయాల్లో భద్రతా లోపాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జగన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రతిపక్ష నేతైన పిటిషనర్‌పై పట్టపగలు విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిందన్నారు. ఘటన జరిగిన గంట వ్యవధిలోనే.. నిందితుడు ప్రచారం కోసమే ఈ పనికి పాల్పడినట్లు డీజీపీ మీడియా సమక్షంలో తేల్చేశారన్నారు. అలాగే, సీఎం కూడా ఈ ఘటనను చాలా తక్కువచేసి మాట్లాడారన్నారు.

ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు నిష్పాక్షింగా జరిగే అవకాశంలేనందువల్ల రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని మోహన్‌రెడ్డి  ధర్మాసనానికి నివేదించారు. పిటిషనర్‌పై దాడి వెనుక ఓ భారీ కుట్ర ఉందన్నారు. ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడి జోక్యం చేసుకుంటూ, పార్టీ తరఫున తామూ పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్‌ బాధితుడైతే ఈ వ్యాజ్యం తమ ముందుకు ఎలా వచ్చిందని ప్రశ్నించింది. సింగిల్‌ జడ్జి ఆదేశాల మేరకు దీనిని పిల్‌తో జత చేశారని, వాస్తవానికి ఆ పిల్‌కూ తమ వ్యాజ్యానికి ఎటువంటి సంబంధంలేదని, ఈ విషయాన్ని సింగిల్‌ జడ్జికి కూడా చెప్పామని మోహన్‌రెడ్డి వివరించారు.

అడ్వకేట్‌ జనరల్‌ చెప్పిన వివరాల మేర తమ వ్యాజ్యాన్ని ఈ పిల్‌కు జత చేయడం జరిగిందన్నారు. దీంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అనంతరం పిల్‌ ప్రస్తావన రాగా.. బాధితుడే స్వయంగా తమ ముందున్నప్పుడు దీనిని విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. అలాగే, ఈ వ్యాజ్యం దాఖలు చేసింది స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోసం.. అంతే కదా? అని అడిగింది. అవునని మోహన్‌రెడ్డి సమాధానం ఇవ్వగా, పోలీసుల దర్యాప్తునకు సంబంధించిన ఓ స్వల్ప నివేదికను మంగళవారం తమ ముందుంచాలని అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను ధర్మాసనం ఆదేశించింది. కాగా, విచారణను శుక్రవారమే చేపట్టాలని మోహన్‌రెడ్డి పట్టుబట్టడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను ఆ మేర వాయిదా వేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top