హైకోర్టులో కేసు స్టే ఉండగా కృష్ణా జిల్లా, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై ఉన్న కేసును ఎత్తివేస్తూ టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది
హైకోర్టు స్టే విధించిన కేసులో ప్రభుత్వ ఉత్తర్వులు
పెనమలూరు : హైకోర్టులో కేసు స్టే ఉండగా కృష్ణా జిల్లా, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై ఉన్న కేసును ఎత్తివేస్తూ టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మరో 14 మంది కొన్నేళ్ల క్రితం పెనమలూరు మండలం, కానూరులోని పాతచెక్‌పోస్టు సెంటర్‌లో పెట్రోల్ ధర పెంపును నిరసిస్తూ బందరు రోడ్డుపై ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో పెనమలూరు పోలీసులు 228/2004 ఎఫ్‌ఐఆర్ ఐపీసీ 143, 341, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విజయవాడ కోర్టులో విచారణలో ఉంది.
అయితే ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లేఖ ఆధారంగా జీవో 12 జారీ చేస్తూ పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్, మరో 14 మంది పై కేసు ఎత్తివేసింది. కాగా తమపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని నిందితుల్లో ఒకరు హైకోర్టులో కేసు (7820/2011) దాఖలు చేశారు. ఈ కేసులో ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతున్నా ప్రభుత్వం కేసును ఎత్తివేసింది.