ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు ఇక నుంచి సమీకృత ఆహారాన్ని అందించనుంది. ప్రస్తుతం విడివిడిగా సరుకులు పంపిణీ చేస్తున్నారు.
ఇందూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు ఇక నుంచి సమీకృత ఆహారాన్ని అందించనుంది. ప్రస్తుతం విడివిడిగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. బియ్యం, నూనె, పప్పులు సమయానికి రాకపోవడంతో పిల్లలందరికీ సక్రమంగా పౌష్టికాహారాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఈ లోపాన్ని గుర్తించిన ప్రభుత్వం ఒకే ఆహారంలో సమతుల్య పౌష్టికాహారం ఉండే విధంగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వమే నేరుగా అన్ని రకాల దినుసులు, బియ్యం, మైక్రోన్యూట్రిన్స్, ఫ్యాట్స్ కలిగిన ఇతర ఆహార పదార్థాలు సమీకృతం చేసి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయనుంది. రెండున్నర కేజీలతో కూడిన ఒక్కో ప్యాకెట్‌ను తయారు చేయనున్నారు.
హైదరాబాద్‌లోని నాచారంనకు చెందిన ఏపీ ఫుడ్స్ కంపెనీకి బాధ్యతలను అప్పగించారు. సమీకృత ఆహార ప్యాకెట్లను తయారు చేసి అప్పగించాలని కంపెనీకి ప్రభుత్వం సూచించింది. అయితే జిల్లాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మొత్తం పది ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. వీటి ఆధీనంలో 2,403 ప్రధాన, 256 శాఖా అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. గ్రామ స్థాయిలో చేపట్టిన సర్వే ప్రకారం ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సు గల పిల్లలు జిల్లాలో మొత్తం 70 వేల మంది ఉన్నట్లు తేలింది. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రంలో సుమారు 20 నుంచి 40 మంది పిల్లలు ఉన్నట్లు అంచనా వేశారు.
ప్రభుత్వం అందించనున్న సమీకృత ఆహారం రెండున్నర కేజీల ప్యాకెట్లను పిల్లల హాజరు శాతన్ని బట్టి అంగన్‌వాడీ కేంద్రానికి నెలకు ఒకటి నుంచి మూడు వరకు, ఐదు కూడా సరఫరా చేస్తారు. ముందస్తుగా ప్రభుత్వం పంపించిన ప్యాక్‌లను గోదాంలలో అధికారులు భద్రపరుస్తారు. వాటిని సీడీపీవో ప్రాజెక్టు అధికారులకు సరఫరా చేసిన అనంతరం వారు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తారు. ఈ సమీకృత ఆహారాన్ని పిల్లలకు పాలలో కలిపి తినిపిస్తారు. ఇలా ఎంత మంది పిల్లలకు అందించా రో, ఎన్ని ప్యాకెట్లు పూర్తి చేశారో రోజువారీగా ఫోన్ ద్వారా అంగన్‌వాడీ టీచర్లు అధికారులకు ఎస్‌ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోగా సరుకులు జిల్లాకు చేరుకున్న వెంటనే అక్టోబర్ మొదటి వారంలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం అధికారులను అదేశించింది.
బియ్యం, పప్పు, నూనెలు లేనట్లే...వచ్చే నెల నుంచి సమీకృత ఆహారం అందించనున్న నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఇక ముందు బియ్యం, పప్పు, నూనె ఇతర సరుకుల సరఫరా నిలిచిపోనుంది. సమీకృత ఆహారంపై గ్రామాల్లో అవగాహన కల్పిం చాలని అధికారులకు ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది.
సరుకులు రాగానే అమలు... ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సున్న పిల్లలకోసం ప్రభుత్వం సమీకృత ఆహారాన్ని రెండున్నర కేజీల ప్యాక్‌ల రూపంలో అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయనుంది. సరుకులు ఈ నెలాఖరులోగా జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. సరుకుల రాగానే అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తాం. గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం.